జెలెన్ స్కీపై మిసైల్ దాడి!

ఒడెస్సా: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ, గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకీస్ కాన్వాయ్ లక్ష్యంగా రష్యా మిసైల్ దాడి చేసింది. ఈ దాడి నుంచి వాళ్లిద్దరూ తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన బుధవారం ఉక్రెయిన్ లోని ఒడెస్సాలో జరిగింది. ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చేందుకు గ్రీస్ ప్రధాని కిరియాకోస్ ఆ దేశ పర్యటనకు వచ్చారు. ఆయనను తీసుకుని జెలెన్ స్కీ ఒడెసా వెళ్లారు. ఈ క్రమంలో వాళ్ల కాన్వాయ్ కి కేవలం 500 మీటర్ల దూరంలోనే  మిసైల్ దాడి జరిగింది. పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగి, పొగ కమ్ముకుంది. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా, మరికొంత మంది గాయపడ్డారు. దాడి నుంచి జెలెన్ స్కీ, కిరియాకోస్ తప్పించుకున్నారని.. వాళ్లకు గాయాలేమీ కాలేదని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. కాగా, దాడి తామే చేసినట్టు రష్యా ధ్రువీకరించింది. అయితే జెలెన్ స్కీ, కిరియాకోస్ పేర్లు మాత్రం పేర్కొనలేదు. ‘‘ఒడెస్సా నగరంలో యుద్ధానికి సముద్ర డ్రోన్లను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఆ టార్గెట్ పై మా ఆర్మీ మిసైల్ దాడి చేసింది. అది విజయవంతమైంది” అని రష్యా ప్రకటనలో పేర్కొంది.  

మాకు దగ్గర్లోనే దాడి జరిగింది: జెలెన్ స్కీ 

జెలెన్ స్కీ తరచూ యుద్ధ రంగంలోకి వెళ్లి సైనికుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. వివిధ దేశాధినేతలు వచ్చినప్పుడు యుద్ధం కారణంగా జరిగిన నష్టాన్ని చూపిస్తున్నారు. అలా నాటో సభ్య దేశమైన గ్రీస్ ప్రధాని కిరియాకోస్ తో ఒడెసాకు వెళ్లినప్పుడు దాడి జరిగింది. దీనిపై జెలెన్ స్కీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు మాకు చాలా దగ్గర్లో దాడి జరిగింది. అది మేం చూశాం. మనం ఎలాంటి వాళ్లతో పోరాడుతున్నామో మీరందరూ అర్థం చేసుకోవచ్చు. ఆ దాడిలో కొంతమంది చనిపోగా, మరికొంత మంది గాయపడ్డారు” అని చెప్పారు. మొదట తమను తాము రక్షించుకోవడం ముఖ్యమని, అందుకోసం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ‘‘మేం కార్లలోకి ఎక్కిన కొద్దిసేపటికే పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. అక్కడ రోజూ యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో సైనికులతో పాటు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు” అని గ్రీస్ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.