
వాషింగ్టన్/మాస్కో: ఉక్రెయిన్తో 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనలకు ఆయన ఓకే చెప్పారు. మంగళవారం ఉదయం పుతిన్ తో ట్రంప్ సుదీర్ఘంగా రెండు గంటలపాటు ఫోన్ లో చర్చలు జరిపారు. యుద్ధానికి ముగింపు పలికి, దీర్ఘకాలికంగా శాంతిని నెలకొల్పాలని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు.
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడం, యూరప్ లోనూ ఘర్షణలు నివారించడం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై వారు చర్చించారు. అనంతరం ఇటు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్, అటు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ నుంచి వేర్వేరుగా ప్రకటనలు విడుదలయ్యాయి. శాంతి ప్రక్రియ దిశగా ట్రంప్, పుతిన్ చర్చలు జరిపారని, కాల్పుల విరమణతోపాటు వివిధ అంశాలకు నేతలు అంగీకరించారని తెలిపాయి. ఇజ్రాయెల్ ను నాశనం చేసే స్థాయిలో ఇరాన్ ఎప్పుడూ ఉండరాదని కూడా ట్రంప్, పుతిన్ అభిప్రాయపడ్డారని వైట్ హౌస్ వెల్లడించింది.
షరతుతో అంగీకారం..
శాంతి స్థాపన, యుద్ధ మరణాల నివారణకు విశేష కృషి చేసినందుకుగాను ట్రంప్ కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారని క్రెమ్లిన్ వెల్లడించింది. అయితే, ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అమెరికా నిలిపివేయాలన్న షరతుతోనే కాల్పుల విరమణకు అంగీకరించినట్టు తెలిపింది. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని రష్యా సైన్యానికి పుతిన్ ఆదేశాలు సైతం జారీ చేశారని వెల్లడించింది. అలాగే బుధవారమే ఉక్రెయిన్, రష్యా మధ్య చెరో 175 మంది యుద్ధఖైదీల మార్పిడి కూడా జరగనుందని క్రెమ్లిన్ తెలిపింది.