- ఈ నెల 23 న ల్యాండయ్యే అవకాశం
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఓవైపు సతమతమవుతున్న రష్యా.. తాజాగా చంద్రుడిపైకి స్పేస్ క్రాఫ్ట్‌ను పంపించింది. చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండర్‌ను దింపి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే లూనా–25 స్పేస్ క్రాఫ్ట్ ను గురువారం అంతరిక్షంలోకి పంపించింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఐదు రోజుల్లో చంద్రుడి కక్ష్యలోకి ఎంటర్ కానుంది.
ఆపై మూడు నుంచి వారం రోజుల పాటు కక్ష్యలో తిరుగుతూ ఈ నెల 23 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని రష్యా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రయాన్ - 3 ప్రాజెక్ట్ లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) పంపించిన విక్రమ్ ల్యాండర్ కూడా ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండ్ కానుంది. కిందటి నెల 14న ఇస్రో స్పేస్‌క్రాఫ్ట్ పంపించిన విషయం తెలిసిందే. అయితే, రష్యా వ్యోమనౌక మాత్రం గురువారం నాడే అంతరిక్ష ప్రయాణం మొదలు పెట్టింది. భూమి నుంచి నేరుగా చంద్రుడి కక్ష్య వరకు ఈ స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణించనుంది. ఆపై చంద్రుడి కక్ష్యలోకి చేరి, ఎత్తు తగ్గించుకుంటూ చంద్రుడిపై ల్యాండ్ కానుందని అధికారులు తెలిపారు.
గతంలో సోవియట్ యూనియన్..
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాక ముందు చంద్రుడిపైకి ల్యాండర్‌ను విజయవంతంగా పంపించిం ది. అప్పట్లో అమెరికా, సోవియట్ యూనియన్, చైనాలు మాత్రమే చంద్రుడిపై విజయవంతంగా స్పేస్ క్రాఫ్ట్‌లను ల్యాండ్ చేయగలిగాయి. రష్యా తొలిసారిగా చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపడం ఇదే మొదలు. తొలుత ఇందులో ఓ చిన్న రోవర్‌ను కూడా పంపాలని భావించినా.. తర్వాత విరమించుకున్నట్లు తెలిపారు. చంద్రుడిపై విజయవంతంగా ల్యాండర్‌ను దింపడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపారు.