
- ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ
కీవ్: రష్యా మా దేశంపై దాడులు ఆపట్లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ పేర్కొన్నారు. కాల్పుల విరమణ కోసం మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్ దాడులకు దిగిందని ఆయన తెలిపారు. వాటికి సంబంధించిన ఫొటోలను బుధవారం ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. దీంతో యూఎస్ చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను రష్యా తిరస్కరించిందని ఆయన ఆరోపించారు. మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్‌చేసి కాల్పుల విరమణ ప్రతిపాదనను ముందుంచారు.
దీంతో ఎనర్జీ గ్రిడ్ తో పాటు, పౌర మౌలిక సదుపాయాలపై 30 రోజుల పాటు దాడులను నిలిపివేసేందుకు పుతిన్ అంగీకరించారు. తన సైన్యాన్ని సైతం ఉక్రెయిన్ ఇంధన లక్ష్యాలపై దాడులను నెల రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశించారు. అయితే, ట్రంప్, -పుతిన్ మధ్య చర్చలు జరిగిన కొన్ని గంటల అనంతరం ఉక్రెయిన్ అంతటా రష్యా డ్రోన్ దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. సుమీలోని ఓ ఆస్పత్రి సహా పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు.