మూడో ప్రపంచ యుద్ధానికి ఎంతో టైం లేదు

మూడో ప్రపంచ యుద్ధానికి ఎంతో టైం లేదు

ప్రస్తుతం ప్రపంచ దృష్టి మొత్తం ఉక్రెయిన్​–రష్యా యుద్ధంపైనే ఉంది. ఈ యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందో అనే భయాలు, ఆందోళనలు నెలకొన్నాయి. ఇక ఉక్రెయిన్ భవిష్యత్తు ఏమిటి? తాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా? యుద్ధం వల్ల ప్రపంచంలో వచ్చే మార్పులు ఏమిటి? అనే ఎన్నో ప్రశ్నలు ప్రపంచ దేశాల ముందు తలెత్తుతున్నాయి. ఈ యుద్ధం ఎవరిని ఎవరికి దగ్గర చేస్తుంది? ఎవరిని ఎవరికి దూరం చేస్తుందనేది? కూడా కీలకంగా మారింది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్​ వార్​ నేపథ్యంలో ఇండియా అడుగులు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. తాజా పరిణామాలు ఇండియాకు కత్తి మీద సాము లాంటివే. కానీ, అన్ని దేశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియా ఉంది. 

1991లో సోవియెట్ యూనియన్ విచ్చిన్నం అయిన తర్వాత రష్యా ఇష్టానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. అప్పటి రాజకీయ, ఆర్థిక పరిస్థితుల వల్ల దానిని ఆపగలిగే శక్తి లేక రష్యా మౌనంగానే దానిని అంగీకరించి ఉక్రెయిన్ స్వాతంత్య్రాన్ని గుర్తించింది. అయినప్పటికీ ఉక్రెయిన్ రష్యాకు ఒక మిత్ర దేశంగానే ఉంటుందని, రష్యాకు వ్యతిరేకంగా రాజకీయ, ఆర్థిక విధానాలు అవలంబించదని భావించింది. అయితే ఉక్రెయిన్ అంతర్గత రాజకీయాలు వెస్ట్రన్ కంట్రీస్​కు అనుకూలంగా మారడంతో పాటు రష్యాకు వ్యతిరేకంగా 2004లో జరిగిన ఆరంజ్ రెవల్యూషన్, 2014లో జరిగిన యూరో మైదాన్ ఉద్యమాల తర్వాతి పరిణామాలు, రష్యాకు, ఉక్రెయిన్​కు మధ్య దూరం పెంచాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ ఆర్థికాభివృద్ధికి యురోపియన్ యూనియన్​తో రాజకీయ సంఘటిత, ఉచిత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుని 830 మిలియన్ డాలర్ల లోన్ తీసుకోవడానికి నిరాకరించిన విక్టర్ యనుకోవైచ్ ప్రభుత్వాన్ని గద్దె దించడం రష్యాకు ఏమాత్రం నచ్చలేదు. అదే సమయంలో రష్యా ఇవ్వచూపిన 15 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరస్కరించడం కూడా మింగుడు పడలేదు. సాంస్కృతికంగా, చారిత్రకంగా రష్యాతో ఉన్న సంబంధాలను కాదనుకోవడానికి, రష్యా పట్ల ప్రజల్లో వ్యతిరేక భావనలు పెరగడానికి కారణం వెస్ట్రన్ కంట్రీస్ ప్రచారం, రష్యా వ్యతిరేక శక్తులకు అందించిన ధన సహాయం ముఖ్యమని నమ్మింది. ఈ కారణాలే 2014లో క్రీమియాను రష్యాలో కలుపుకోవడానికి, రష్యా భాషను అధికంగా మాట్లాడే దొనేత్సక్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వయం ప్రకటిత నియంత్రిత 
ప్రాంతాలుగా గుర్తించింది.

ఉక్రెయిన్‌‌‌‌ను క్లయింట్‌‌‌‌ దేశంగా భావించిన రష్యా

పూర్వం సోవియెట్ యూనియన్​లో రష్యా తర్వాత అతి పెద్ద భాగమైన ఉక్రెయిన్​లో అప్పటి సోవియెట్ ప్రభుత్వం పారిశ్రామిక వ్యవస్థలను అభివృద్ధి చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఉక్రెయిన్ సోవియెట్ యూనియన్​కు ఒక పారిశ్రామిక హబ్​గా ఉండేది. అనేక ఆయుధ ఉత్పత్తి కేంద్రాలు, మిస్సైల్ పరీక్షా కేంద్రాలు, బైకునూర్ లాంటి అంతరిక్ష పరిశోధన కేంద్రాలు, ప్రయోగశాలలు, వీటితో పాటు న్యూక్లియర్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి రియాక్టర్లు సోవియెట్ యూనియన్ ఉక్రెయిన్​లో నెలకొల్పింది. ఇవన్నీ సోవియెట్ యూనియన్ ఒక బలమైన, శక్తిమంతమైన, సంఘంగా ఎదిగేందుకు దోహదపడ్డాయి. ఉక్రెయిన్ సోవియెట్ యూనియన్​లో ఒక అంతర్భాగంగా చూడడం వల్లే ఇన్ని వ్యవస్థలు నెలకొల్పారు. సోవియెట్ యూనియన్ ప్రభావాన్ని అందుకోవాలనుకుంటున్న రష్యాకు, ఉక్రెయిన్ తనతో సన్నిహిత సంబంధాలు ఉండాలని, తన ఇన్​ఫ్లూయెన్స్​లో పనిచేయాలని, ఒక రకంగా తనకు సామంత దేశంగా క్లయింట్ దేశంగా ఉండాలని కోరుకుంది. అలాంటి రష్యా ఉద్దేశాల మధ్య ఉక్రెయిన్ తనకు దూరంగా జరగడం, తన ప్రత్యర్థులైన అమెరికా, దాని మిత్రపక్షాలవైపు మొగ్గడం ఏవిధంగా చూసినా రష్యాకు సహించరాని విషయం. అందులోను రష్యాకు వ్యతిరేకంగా జట్టుకట్టిన నాటో కూటమిలో చేరాలనుకోవడం, నాటో కూడా దానికి అనుకూలంగా ఉండడం రష్యాకు ప్రమాద ఘంటికలను మోగించింది. 2017లో ఉక్రెయిన్ పార్లమెంట్ నాటోలో చేరే రెసొల్యూషన్ పాస్ చేయడం రష్యాకు మరింత కోపం తెప్పించింది. ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో భాగమైతే, నాటోలో ఉన్న ఆయుధ వ్యవస్థలు రష్యా బోర్డర్​లో మోహరించే అవకాశం ఉంది. ఉక్రెయిన్​లో ఉన్న న్యూక్లియర్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి కేంద్రాలు, న్యూక్లియర్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ రష్యాకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంది. ఇవన్నీ జరగడానికన్నా ముందే ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసేసింది. ఉక్రెయిన్​ను మిలిటరీ పరంగా, నిర్వీర్యం చేయడం, ఆ దేశంలో రష్యా వ్యతిరేక భావజాలాన్ని అంతం చేయడం, రష్యా ముందున్న ప్రథమ ప్రాధాన్యాలు. ఒకవేళ ఉక్రెయిన్ పై దాడి చేయకుండా అలాగే వదిలేస్తే, పక్కలో బల్లెంగా, అణ్వాయుధ శత్రుదేశంగా ఎదిగే అవకాశం ఉంది.

ఆర్థిక వ్యవస్థపై దెబ్బ పడేలా..

కరోనా వల్ల యూరోపియన్ ఎకానమీ ఇప్పటికే దాదాపు పది శాతం కుచించుకుపోయింది. నిరుద్యోగం దాదాపు ఎనిమిది శాతం, ద్రవ్యోల్బణం 5.1 శాతం పెరిగాయి. అదే సమయంలో పారిశ్రామిక ఉత్పత్తి దాదాపు 11 శాతం పడిపోయింది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థలు ఉక్రెయిన్– రష్యా యుద్ధం రూపంలో ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేవు. అంతే కాకుండా, రష్యన్ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడ్డ యూరప్, రష్యాతో వైరం కోరుకోదు. యురోపియన్ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం పొందాలంటే తన మొత్తం వ్యాపారంలో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న 28 శాతం ఆయిల్, 35 శాతం గ్యాస్ సరఫరా, 37 శాతం ఎగుమతులు ఆగిపోకూడదు. అందుకే ఉక్రెయిన్ పట్ల ఎంత సానుభూతి వ్యక్తం చేసినా, రష్యాపై ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా, రష్యా పట్ల మిలిటరీ పరంగా, ఆర్థికపరంగా కఠిన వైఖరి అవలంబించే అవకాశం లేదు. పై విషయాలు పరిశీలించిన తర్వాత ఉక్రెయిన్ భవిష్యత్తు ఏమిటో అర్థమైపోతుంది.

రష్యాకు సాయంగా చైనా ముందుకొస్తే..

భౌగోళిక, వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ సంక్షోభం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ప్రపంచంలో అతిపెద్ద శక్తిమంతమైన దేశంగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా మెల్ల మెల్లగా తన శక్తిని కోల్పోతున్న విషయం ఇక్కడ గమనించవచ్చు. ఆఫ్గనిస్తాన్ నుంచి అర్థాంతరంగా వైదొలగి, ఆ దేశాన్ని తాలిబన్ల వశం చేసినప్పటి నుంచి అమెరికా పట్ల ప్రపంచ దేశాల్లో ఉన్న గౌరవం, భయం కొద్ది కొద్దిగా తగ్గుతున్న విషయం కూడా చూడవచ్చు. నాటోలో, యూరోప్​లో తన మిత్ర దేశాలు ప్రస్తుతం గుడ్డిగా అమెరికాను అనుసరించే పరిస్థితిలో లేవు. రష్యా పట్ల ఉక్రెయిన్ విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని ఇంగ్లాండ్ కోరుకుంటుంటే, ఫ్రాన్స్ మాత్రం చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటోంది. జర్మనీ, ఫ్రాన్స్, ఉక్రెయిన్, రష్యా భాగస్వామ్యంలో నార్మన్డీ ఫార్మాట్లో, మిన్స్క్ అగ్రిమెంట్ ప్రకారం ముందుకు పోవాలని ఫ్రాన్స్ కోరుకుంటోంది. అయితే ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో ఈ ఫార్మాట్​ అగ్రిమెంట్ నిలబడుందా అన్నది సందిగ్ధమే. అమెరికా దాని మిత్రపక్షాలు విధించబోయే కఠిన ఆంక్షల నుంచి రష్యాను బయట పడేయడానికి చైనా ముందుకు వచ్చే అవకాశం ఉందన్న వార్తలను గమనిస్తే, వింటర్ ఒలింపిక్స్ వేదికగా పుతిన్, జిన్​పింగ్​ సమావేశం అయిన ఫలితాలను గమనిస్తే, తైవాన్ విషయంలో చైనా వైఖరిని పుతిన్ సమర్థించడం గమనిస్తే, రెండు దేశాల మధ్య చిగురిస్తున్న బంధం ఒక కొత్త కూటమికి దారి తీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇండియాకు తలనొప్పి..

ఇప్పటికే ఒకవైపు నాటో ఉండగానే, చైనాకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​తో జట్టు కట్టి అమెరికా ఏర్పాటు చేసిన వ్యూహాత్మక మిలిటరీ కూటమి ఏయూకేయూఎస్ ఉనికిలో ఉంది. ఇండియన్ ఓషన్ రీజియన్​లో చైనా సాగిస్తున్న కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాతో ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమి రష్యా- చైనా కొత్త బంధంతో ప్రభావితం కాకతప్పదు. ఈ కొత్త బంధంలోకి పాకిస్తాన్ కూడా చేరితే ఇండియాకు మరిన్ని తలనొప్పులు వస్తాయి. ఫిబ్రవరి 23 నుంచి మూడు రోజుల పాటు రష్యాలో పర్యటిస్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్​లో రష్యా మొదటిసారి పెట్టబోతున్న దాదాపు రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడి, ముఖ్యంగా చైనా డెవలప్ చేస్తున్న గ్వాదర్ పోర్ట్ నుంచి లాహోర్ వరకు నిర్మిస్తున్న  స్ట్రీమ్ గ్యాస్ పైప్​లైన్, 
రష్యాకు పాకిస్తాన్​కు కొత్త బంధానికి తెరలేపనుంది. ఆఫ్గనిస్తాన్​లోని అతివాద ఇస్లామిక్ శక్తులను రష్యా చెచెన్యా, టార్టాస్తాం ప్రాంతాల్లో ప్రభావం చూపకుండా నిలువరించాలంటే రష్యా కు పాకిస్తాన్ సహకారం అవసరం.

మూడో ప్రపంచ యుద్ధానికి ఎంతో టైం లేదు

స్థూలంగా చూస్తే ఉక్రెయిన్– రష్యా యుద్ధం ఒక కొత్త ప్రపంచ వ్యవస్థను సృష్టించబోతోంది. ఏక ధృవ ప్రపంచం నుంచి బహుళ ధృవ ప్రపంచంలోకి లేదా భిన్న ధృవ ప్రపంచంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. కొత్త సవాళ్లను, అత్యంత కఠినమైన, సున్నిత పరిస్థితులను ఎదుర్కోబోతున్నాం. ఇందులో ఏ తేడా వచ్చినా మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇండియా లాంటి దేశాలు ఈ కొత్త ప్రపంచంలో రెండు ధృవాలతో సమన్వయం చేసుకుంటూ యునైటెడ్ నేషన్స్​లో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు వెళ్లాల్సిన 
అవసరం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇది అంత సులువైన విషయం ఏమీకాదు.

:: గద్దె ఓం ప్రసాద్‌‌‌‌, పొలిటికల్​ ఎనలిస్ట్