ఉక్రెయిన్​కు అమెరికా షాక్..శాంతి తీర్మానంపై రష్యాకు మద్దతుగా ఓటు

ఉక్రెయిన్​కు అమెరికా షాక్..శాంతి తీర్మానంపై రష్యాకు మద్దతుగా ఓటు

న్యూయార్క్: ఉక్రెయిన్ కు అమెరికా మరోసారి షాక్ ఇచ్చింది. యుద్ధం ముగింపు, శాంతి స్థాపన కోసం పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి మూడేండ్లు అవుతున్న సందర్భంగా.. సోమవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ‘ఉక్రెయిన్ లో యుద్ధం ముగింపు, శాంతి స్థాపన’ కోసం ముసాయిదా తీర్మానాన్ని ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రవేశపెట్టాయి. 

దీనిపై ఓటింగ్ నిర్వహించగా.. తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు, వ్యతిరేకంగా 18 దేశాలు ఓటు వేశాయి. చర్చలు, దౌత్య పద్ధతిలోనే శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని స్పష్టం చేసిన ఇండియా సహా 65 దేశాలు ఓటింగ్ కు గైర్హాజరయ్యాయి. రష్యాకు అనుకూలంగా (ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా) దాని మిత్రదేశాలు బెలారస్, నార్త్ కొరియా, సూడాన్ తోపాటు ఇన్నాళ్లూ శత్రుదేశంగా ఉన్న అమెరికా సైతం ఓటు వేసింది. ఉక్రెయిన్ యుద్ధంపై ఇదివరకు ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాలపై ఓటింగ్ సందర్భంగా రష్యాకు వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈసారి మాత్రం ఉక్రెయిన్ కు మద్దతు గణనీయంగా తగ్గిపోయింది. ఇంతకుముందు అన్ని తీర్మానాలకూ ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చిన అమెరికా ఈ సారి రష్యాకు అనుకూలంగా ఓటేసింది.

ఈ ఓటింగ్ తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్ కు సంబంధించి జరిగిన తీర్మానంలో ఓటింగ్ సందర్భంగా కూడా రష్యాకే అమెరికా మద్దతు ఇవ్వడం విశేషం. కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ కు యుద్ధ సాయాన్ని నిలిపివేస్తూ ఫస్ట్ షాక్ ఇచ్చారు. అప్పట్లో తాను అధ్యక్షుడిగా ఉంటే అసలు ఈ యుద్ధమే మొదలయ్యేది కాదని, ఈ యుద్ధానికి అసలు కారణం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీనే అంటూ ఇటీవల మరో బాంబు పేల్చారు. తాజాగా ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా తన పాలసీని మార్చుకున్న అమెరికా తీరు చర్చనీయాంశం అయింది.