యుద్ధం ఎక్కడైన బలయ్యేది ప్రజలే..దాడలు ఎవరివైన దహనమయ్యేది ప్రజలే..సంక్షోభం ఏదైనా చస్తూ బతికేది ప్రజలే..తినేందుకు తిండి లేక..ఉండేందుకు చోటు లేక..కంటినిండా కునుకు లేక..కంటిపాపకు రక్షణలేక..ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ చేస్తున్న విధ్వంసం కూడా ఇలాంటిదే. నాటో కూటమిలో చేరొద్దంటూ ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలుపెట్టింది రష్యా. మొదట ఉక్రెయిన్ ను రెండు, మూడు రోజుల్లో దారికి తెచ్చుకోవచ్చనుకున్న రష్యాకు భంగపాటు ఎదురైంది. అలా మొదలుపెట్టిన యుద్ధానికి ఇవాళ్టికి వంద రోజులు పూర్తయ్యాయి.
మొదట ఉక్రెయిన్ లోని కీవ్, బుచా వంటి నగరాలపై దాడులు నిర్వహించిన రష్యాకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. భారీ సంఖ్యలో సైనికులను, సైనికాధికారులను, యుద్ధ ట్యాంకులను కోల్పోయింది రష్యా. దీంతో వ్యూహం మార్చింది. కీవ్ వంటి నగరాల నుండి వెనక్కి మళ్లీ తూర్పు ఉక్రెయిన్ పై దాడులకు దిగింది. ఈ ప్రాంతంలోని పోర్టులు, సముద్ర మార్గాలను చేజిక్కించుకునేలా ప్రణాళికలు వేసింది. అందులో భాగంగానే అజోవ్ సముద్ర తీరంలోని మరియపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. లుషాంక్ లోని అతి కీలక నగరం సీవీరోడ్నెట్స్కీని దాదాపు స్వాధీనం చేసుకుంది. యుద్ధానికి ముందే డాన్ బాస్ ను స్వతంత్ర్య ప్రతిపత్తి ప్రాంతంగా గుర్తించిన రష్యా..ఇప్పుడు ఆ ప్రాంతంపై పూర్తిగా పట్టు సాధించింది.
ఇక తూర్పు ఉక్రెయిన్ లో పరిస్థితి చాలా క్లిష్ఠంగా ఉందని జెలన్ స్కీ వ్యాఖ్యానించారు. అయితే మరోవైపు రష్యాను నిలువరించేందుకు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాయి. పెద్దఎత్తున ఉక్రెయిన్ కు యుద్ధట్యాంకులను తరలిస్తున్నాయి. రష్యాకు చెందిన యుద్ధట్యాంకులను చిన్నపాటి డ్రోన్లతో నేలమట్టం చేశాయి ఉక్రెయిన్ సేనలు. మాస్కోవా వంటి యుద్ధనౌకతో పాటు మరో రెండు నౌకలను సముద్రంలోనే పేల్చేశాయి.ఉక్రెయిన్ ప్రతిఘటన ఈ స్థాయిలో ఉంటుందని..ప్రపంచదేశాలు వాటికి ఇంతలా అండగా నిలుస్తాయని రష్యా అంచనావేయలేకపోయింది. దీంతో యుద్ధం దీర్షకాలం చేసేందుకు మాస్కో సిద్ధమైంది.
ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. అటు రెండు దేశాలు కూడా దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఈ వంద రోజుల యుద్ధంలో ఉక్రెయిన్ లోని ఎన్నో నగరాలు ధ్వంసమ్యాయి. రెండు దేశాలకు చెందిన ఎంతోమంది ప్రాణాలను వదిలారు. ఇన్నిరోజులవుతున్న రష్యాకు స్వాధీనం చేసుకుంది ఉక్రెయిన్ లోని 20శాతం మాత్రమే. రష్యా సేనలను దేశం నుండి తరిమికొట్టాలని ఉక్రెయిన్..ఉక్రెయిన్ నగరాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని రష్యా..ఇలా ఎవరి పంతాలు వారివే కావడంతో యుద్ధానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కన్పించడం లేదు. వెరసీ సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది.
ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అక్కడి దేశస్థులకు ఒక హీరో అయ్యాడు. లొంగిపోయే ప్రసక్తే లేదంటూ యుద్ధరంగంలోకి దిగి తన సేనలకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నారు జెలన్ స్కీ. దీంతో ఉక్రెయిన్ సేనలు కూడా ప్రాణాలకు తెగించిన కొట్లాడుతున్నాయి. ఆ పోరాట ఫలితమే నేటికి రష్యాకు లొంగకుండా నిలిపింది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా అపకీర్తిని మూటబట్టుకున్నారు. అయితే ఈ యుద్ధం వల్ల సర్వం కోల్పోయామని ఉక్రెయిన్ అంటోంది.25వేల కిలోమీటర్ల మేర రహదారులు, 12 ఎయిర్ పోర్టులు నాశనమయ్యాయని ఆ దేశ ప్రధాని డెనిస్ చెప్పారు. వంద విద్యాసంస్థలు, 500 మెడికల్ కేంద్రాలు, 200 ఫ్యాక్టరీలకు తీవ్రనష్టం వాటిల్లినట్లు తెలిపారు.
అయితే నాటో విస్తరణను అడ్డుకోవడం, ఉక్రెయిన్ అందులో చేరొద్దనేది పుతిన్ యుద్ధ లక్ష్యాల్లో ఒకటి. అయితే ఇదే యుద్ధం వల్ల ఫిన్లాండ్, స్వీడన్ వంటి దేశాలు నాటోలో చేరాలని నిర్ణయించుకోవడం రష్యాకు మింగుడుపడని అంశం. ఇక ఈ యుద్ధ ప్రభావం ఆ రెండు దేశాలకే పరిమితం కాలేదు. మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. ఆహారసంక్షోభానికి కావాల్సిన పరిస్థితులను ఈ యుద్ధం తీసుకొచ్చింది.
గోధుమల ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. రష్యా, ఉక్రెయిన్ గోధుమల ప్రధాన ఎగుమతిదారులు. ఇప్పుడు ఆ రెండు దేశాలు యుద్ధం చేస్తుండడంతో గోధుమల ఎగుమతి నిలిచిపోయింది. ఇలా రెండు దేశాలు యుద్ధంతో పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. జెలన్ స్కీ-పుతిన్ సమావేశమై ఓ ఒప్పందానికి వస్తే తప్ప ఈ యుద్ధానికి ముగింపు దొరికేలా లేదు. అయితే ఆ ఇద్దరు యుద్ధాన్నే కొనసాగిస్తుండడం ఇప్పుడు అందరినీ కలవరపెట్టే అంశం.