
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ మిసైల్ దాడులు చేసింది. ఆదివారం సుమీ నగరంపై రెండు మిసైల్స్‌ను ప్రయోగించింది. ఈ దాడిలో 24 మంది చనిపోయారు. ‘‘పామ్ సండేను పురస్కరించుకుని సుమీ నగరం నడిబొడ్డున వేడుకలు నిర్వహించేందుకు జనం గుమిగూడారు. అదే ప్రాంతంపై ఉదయం 10:15 గంటల టైమ్‌లో రష్యా రెండు మిసైల్స్ ప్రయోగించింది. బిల్డింగులు కుప్పకూలిపోయాయి.
ఎక్కడికక్కడ రోడ్లపై జనం విగతజీవులుగా పడిపోయారు. ఈ దాడిలో కనీసం 24 మంది చనిపోయారు. మరో 84 మంది గాయపడ్డారు” అని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. పండుగ వేళ రష్యా విషాదం మిగిల్చిందని సుమీ నగర మేయర్ ఆర్టెమ్ కోబ్జార్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 4న జెలెన్‌స్కీ సొంతూరు క్రివీ రిహ్ మీద రష్యా మిసైల్ దాడి చేసింది. ఇందులో 20 మంది చనిపోయారు. వారిలో 9 మంది పిల్లలు ఉన్నారు.
రష్యాపై జెలెన్‌స్కీ ఫైర్..
రష్యా మిసైల్ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. దీనిపై ప్రపంచ దేశాలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘రష్యా విషయంలో చర్చలు ఎప్పుడూ మిసైల్, బాంబు దాడులను ఆపలేకపోయాయి. ఒక ఉగ్రవాదితో ఏ విధంగా వ్యవహరిస్తామో.. రష్యా విషయంలోనూ అలాంటి వైఖరే అవసరం” అని అన్నారు. రష్యా దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, ఓవైపు అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు జరుగుతుండగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడుతున్నది. విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు జరిగిన తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని రష్యా, ఉక్రెయిన్ అగ్ర దౌత్యవేత్తలు పరస్పరం ఆరోపించుకున్న వేళ దాడులు చోటుచేసుకున్నాయి.