ఉక్రెయిన్, రష్యా మధ్య 12 రోజులుగా భీకర యుద్ధం నడుస్తోంది. ఒక్కో సిటీని రష్యన్ ఆర్మీ ఆక్రమించుకుంటూ వస్తోంది. అయితే రాజధాని నగరం కీవ్ ను మాత్రం చేజారనీయకుండా ఉక్రెయిన్ బలగాలు తమ శక్తినంతటినీ ఒడ్డుతున్నాయి. మాతృ దేశాన్ని ఎలానైనా కాపాడుకుంటామని, తమను ఎవరూ దెబ్బకొట్టలేరని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేస్తున్నారు. అయితే యుద్ధంలో రష్యా పూర్తి పట్టు సాధించి.. రాజధాని నగరాన్ని సైతం తన చేతుల్లోకి తెచ్చుకుని ప్రెసిడెంట్ ను చంపేస్తే పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్నగా నిలుస్తుంది. ఆ దేశం ఎలా ముందుకు సాగాలన్నది ఎవరు దిశానిర్దేశం చేస్తారనేది ఎలా తేల్చుకుంటుందని అందరికీ అనుమానం కలుగుతుంది. అయితే ఈ ప్రశ్నలకు అగ్రరాజ్యం అమెరికా నుంచి సమాధానం వచ్చింది.
NEWS: @SecBlinken says Ukraine has “plans in place” for continuity of government in the event President Volodymyr Zelensky is killed during Russia’s invasion.
— Face The Nation (@FaceTheNation) March 6, 2022
Tune in at 10:30a E.T. to watch @margbrennan’s full interview. pic.twitter.com/HV3QVAFuNP
అమెరికా విదేశాంగ మంత్రి కామెంట్స్
యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరణిస్తే.. ఏం చేయాలన్న దానిపై ప్లాన్స్ సిద్ధంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. తాను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో మాట్లాడానని, అనుకోనిది ఏదైనా జరిగితే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారని అన్నారు. ఈ వివరాలను తాను ఇప్పుడు బయటకు చెప్పలేనన్నారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ను రష్యా చంపేస్తే అక్కడి పరిస్థితి ఏంటి? అమెరికా ప్రభుత్వం ఏమైనా సాయం చేయబోతోందా? అని అమెరికాలో ఓ న్యూస్ చానెల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. కాగా, కొద్ది రోజులుగా రష్యా టార్గెట్ తానేనని, తనతో పాటు కుటుంబం మొత్తాన్ని రష్యా బలగాలు చంపేయొచ్చని పలుమార్లు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చెబుతూ వస్తున్నారు.