ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ పై దాడిని ఖండిస్తూ ఓటు వేశాయి. అయితే భద్రతామండలిలో ఐదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరించింది. ఇక మొదటి నుంచి ఉక్రెయిన్, రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్ తో పాటు చైనా.. యూఏఈలు ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. రష్యాను ఏకాకిగా చేయాలని భావించిన అమెరికా మరో దేశం అల్బేనియాతో కలిసి ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మరోవైపు 193 సభ్యదేశాలు ఉన్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఈ ముసాయిదాను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. భద్రతామండలిలో రష్యా వీటోను ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకున్నప్పటికీ ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేశామని పశ్చిమదేశాలు భావిస్తున్నాయి.
చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించగలమని ఐక్యరాజ్య సమితి భద్రాతామండలి సమావేశంలో భారత్ స్పష్టం చేసింది. అనేక మంది ఇండియన్స్ ఉక్రెయిన్ లో ఇబ్బంది పడుతున్నారని.. త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరింది. తీర్మానాన్ని వీటో చేసినంత మాత్రానా.. ప్రపంచ దేశాల గొంతును అణచలేరని యూఎస్ రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ అన్నారు. నిజాన్ని ఎప్పటికీ వీటో చేయలేరని తెలిపారు.