కీవ్: ఉక్రెయిన్‌లో తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్న రష్యాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఐదుగురు ఆర్మీ జనరల్స్ సహా 13 మంది టాప్ ఆఫీసర్లను పోగొట్టుకున్న రష్యాకు మరోసారి షాక్ తగిలింది. తాజాగా రష్యా నేవీ డిప్యూటీ కమాండర్ ను కూడా హతమార్చినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. నల్ల సముద్రంలో రష్యన్ నేవీకి ఫస్ట్ ర్యాంక్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న డిప్యూటీ కమాండర్ ఆండ్రీ పలియ్ (51)ను మేరియపోల్ సిటీ సమీపంలో కాల్చిచంపినట్లు ఆదివారం ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. దీంతో రష్యన్ బలగాలు ఇప్పటివరకు 14 మంది టాప్ ఆఫీసర్లను కోల్పోయినట్లయింది. అయితే, రష్యన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉక్రెయిన్ లో పని చేయకపోవడంతో అంత సురక్షితం కాని కమ్యూనికేషన్స్ నెట్ వర్క్ ను వాడటం వల్లే టాప్ ఆఫీసర్లు ఉన్న ప్రాంతాలను పసిగడుతూ ఉక్రెయిన్ బలగాలు దాడులు చేస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆండ్రీ పలీయ్ ఉక్రెయిన్‌లోని కీవ్ లోనే పుట్టాడు. 1993లో ఉక్రెయిన్ మిలిటరీలో చేరేందుకు వచ్చిన అవకాశాన్ని కాదని రష్యన్ నార్తర్న్ ఫ్లీట్‌లో చేరాడు. ఇప్పుడు పుట్టిన దేశంలోనే చనిపోయాడు. మరోవైపు విదేశాల నుంచి ఉక్రెయిన్ వచ్చిన ఫైటర్లు, సోల్జర్లకు జైటోమిర్ రీజియన్ లోని ఓవ్ రుచ్ గ్రామం వద్ద ట్రెయినింగ్ ఇస్తున్న ప్లేస్ పై తాము బాంబు దాడి చేశామని, ఇందులో 100 మందికి పైగా చనిపోయారని రష్యా ప్రకటించింది.
చనిపోయిన రష్యన్ టాప్ ఆఫీసర్లు వీళ్లే..
కెప్టెన్ ఆండ్రీ పలీయ్: రష్యన్ నేవీలో డిప్యూటీ కమాండర్, నల్ల సముద్రంలో రష్యన్ నేవీ యూనిట్ ఫస్ట్ ర్యాంక్ కెప్టెన్.
కర్నల్ సెర్గీ సుఖరెవ్: 331వ గార్డ్స్ పారాచూట్ అసాల్ట్ రెజిమెంట్ లో కర్నల్.
మేజర్ జనరల్ ఓలెగ్ మితయేవ్: 150వ మోటారైజ్డ్ రైఫిల్ డివిజన్ కమాండర్.
మేజర్ జనరల్ ఆండ్రీ కొలెస్నికోవ్: 29వ కంబైన్డ్ ఆర్మీ కమాండర్.
మేజర్ జనరల్ విటలి గెరాసిమోవ్: 41వ ఆర్మీ యూనిట్ ఫస్ట్ డిప్యూటీ కమాండర్.
మేజర్ జనరల్ ఆండ్రే సుఖోవెస్కీ: 41వ కంబైన్డ్ ఆర్మీ యూనిట్ డిప్యూటీ కమాండర్.
కర్నల్ ఆండ్రీ జఖరోవ్: రష్యన్ ఆర్మీలో కర్నల్.
లెఫ్టినెంట్ కర్నల్ దిమిత్రి సఫ్రోనోవ్: రష్యన్ మెరైన్ బ్రిగేడ్ లీడర్.
లెఫ్టినెంట్ కర్నల్ డెనిస్ గ్లెబోవ్: ఎయిర్ అసాల్ట్ బలగాల లీడర్.
కర్నల్: కాన్ స్టాంటైన్ జిజెవ్ స్కీ: ఎయిర్ అసాల్ట్ బలగాల లీడర్.
జనరల్ మాగోమ్డ్ తుషేవ్: చెచెన్ ప్రత్యేక బలగాలకు లీడర్.
వ్లాదిమిర్ జోంగా: నియో నాజీ స్పార్టా బెటాలియన్ లీడర్.
జార్జీ డుడోరోవ్: 106వ తులా గార్డ్స్ ఎయిర్ బోర్న్ డివిజన్లో డిప్యూటీ కమాండర్.
అలెక్సీ అలెష్కో: పారాట్రూప్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్.