
- జెలెన్స్కీ సొంత పట్టణంపై రష్యా దాడి.. నలుగురు మృతి.. 31 మందికి గాయాలు
- ఖార్కివ్, ఒడెసా, సుమీపై కూడా డ్రోన్లు, మిసైళ్లతో ఎటాక్
- ఉక్రెయిన్‌కు ఇంటెలిజెన్స్ సాయం నిలిపేసిన అమెరికా
- సాయానికి ముందుకొచ్చిన ఫ్రాన్స్
కీవ్, పారిస్: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్ స్కీ సొంత పట్టణం క్రివీ రిహ్‌పై రష్యా డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసింది. దీంతో ఒక హోటల్లో ఉన్న నలుగురు మృతిచెందారు. 31 మంది గాయపడగా.. 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉక్రెయిన్‌కు ఇంటెలిజెన్స్ సాయాన్ని నిలిపివేస్తున్నట్టు బుధవారం అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి డ్నిప్రో పెట్రోవ్స్కీ ప్రాంతంలోని జెలెన్స్కీ పుట్టిన గడ్డపై రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో షాహిద్, డెకాయి రకానికి చెందిన మొత్తం 112 డ్రోన్లు, రెండు బాలిస్టిక్ మిసైళ్లు వినియోగించినట్టు క్రివీ రిహ్మేయర్ ఒలెగ్జాండర్ విల్కుల్ తెలిపారు.
ఈ దాడిపై గురువారం ఉదయం జెలెన్స్కీ స్పందించారు. రష్యా దాడులకు ముందే మానవతా సాయం అందిస్తున్న సంస్థలకు చెందిన వలంటీర్లు. అమెరికన్, బ్రిటీష్జాతీయులు హోటల్ నుంచి బయటపడి సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్నారని తెలిపారు. క్రివీ రిహ్తో పాటు, ఖార్కివ్, ఒడెసా, సుమీ ఏరియాలపై రష్యా దాడులకు పాల్పడిందని మొత్తం 68 రష్యన్ డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ఒక ప్రకటనలో పేర్కొంది.
గతంలో రష్యా మిసైల్స్, డ్రోన్, వైమానిక దాడులను తిప్పికొట్టడానికి అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం ఉక్రెయిన్‌కు సహాయపడేది. ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని నిలిపివేయాలని గతవారం అమెరికా నిర్ణయించింది. దీంన్లో భాగంగానే ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడం ఆపేసింది.
ఉక్రెయిన్‌కు సాయం చేస్తం: ఫ్రాన్స్
ఉక్రెయిన్‌కు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందిస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది. గురువారం ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను ఫ్రాన్స్ ఇంటర్ రేడియోతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌తో ఇంటెలిజెన్స్ భాగాస్వామ్యాన్ని కొనసాగిస్తామని లెకోర్ను చెప్పారు.