- రష్యన్ క్రూడాయిల్‌ను భారీగా దిగుమతి చేసుకొని, రిఫైన్ చేసి డీజిల్, పెట్రోల్‌గా యూరప్ దేశాలకు ఎగుమతి
- యూరప్‌కు చేస్తున్న డీజిల్ ఎక్స్‌పోర్ట్స్ లో 58 శాతం వృద్ధి
- లూప్‌హోల్స్ వాడుకొని లాభపడుతున్న ఇండియన్ కంపెనీలు
న్యూఢిల్లీ: నియంత్రణలు కొనసాగుతున్నా, ఇండియాలో రిఫైనై డీజిల్, పెట్రోల్‌గా యురోపియన్ దేశాలకు రష్యా క్రూడాయిల్ చేరుతోంది. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య ఇండియా నుంచి యూరప్ దేశాలకు డీజిల్, పెట్రోల్ వంటి పెట్రోలియం ప్రొడక్ట్‌ల ఎగుమతులు ఏకంగా 58 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయి. తక్కువ రేటుకు దొరుకుతుండడంతో ఇండియన్ ఆయిల్ రిఫైనరీ కంపెనీలు రష్యన్ క్రూడాయిల్‌ను భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) లేదా జీ7 దేశాలు 2022 డిసెంబర్‌లో రష్యన్ క్రూడాయిల్‌పై ధరల పరిమితిని విధించాయి. బ్యారెల్‌ను 60 డాలర్ల కంటే ఎక్కువకు ఏ దేశం కూడా దిగుమతి చేసుకోకూడదని రిస్ట్రిక్షన్లు పెట్టాయి. అంటే ఇంతకంటే ఎక్కువ ధరకు కొనుగోలు జరిపితే ఇన్సూరెన్స్, షిప్పింగ్ వంటి సర్వీస్‌లను వెస్ట్రన్ దేశాల కంపెనీలు ఆపేస్తాయి.
కానీ, రష్యన్ క్రూడాయిల్ నుంచి ఉత్పత్తి అవుతున్న పెట్రోల్, డీజిల్ వంటి రిఫైన్డ్ ఆయిల్ ఎగుమతులపై మాత్రం ఎటువంటి పాలసీలు తీసుకురాలేదు. దీంతో తమపై ఎటువంటి ఆంక్షలు లేని దేశాలు రష్యా నుంచి భారీగా క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకొని, రిఫైన్ చేసి, వెస్ట్రన్ దేశాలకే లీగల్‌గా ఎగుమతి చేసుకోవడానికి వీలుకుదిరింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యన్ ఆయిల్‌ను కొంటున్న అతిపెద్ద దేశంగా ఇండియా ఎదిగింది. యుద్ధానికి ముందు ఇండియా ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా కేవలం ఒక శాతం ఉంటే, ప్రస్తుతం 40 శాతానికి పెరిగింది.
రిలయన్స్, నయారా, మంగళూరు రిఫైనరీ నుంచే ఎక్కువ..
ఈయూకి పెట్రోలియం ప్రొడక్ట్‌లను ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశంగా ఇండియా ఎదిగిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) తన రిపోర్ట్‌లో పేర్కొంది. జామ్‌నగర్, వదినార్ (గుజరాత్), న్యూ మంగళూరు రిఫైనరీలు ఎక్కువగా రష్యా క్రూడాయిల్ దిగుమతులపై ఆధారపడుతున్నాయని, ఈ ఏడాది మొదటి మూడు క్వార్టర్లలో ఈ రిఫైనరీ నుంచి ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 58 శాతం పెరిగాయని తెలిపింది. జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రిఫైనరీ ఉండగా, రష్యా కంపెనీ రోస్నెఫ్ట్‌కు వాటాలున్న నయారా ఎనర్జీకి వదినార్ దగ్గర రిఫైనరీ ప్లాంట్ ఉంది.
ఓఎన్‌జీసీ సబ్సిడరీ మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ మంగళూరు రిఫైనరీని మేనేజ్ చేస్తోంది. ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి ముందు ఇండియా నుంచి యూరోపియన్ దేశాలు రోజుకి 1,54,000 బ్యారెళ్ల డీజిల్‌ను దిగుమతి చేసుకునేవి. ప్రస్తుతం ఈ నెంబర్ రెండింతలు పెరిగింది. కిందటేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రష్యన్ క్రూడాయిల్ నుంచి ఉత్పత్తి చేసిన 8.5 బిలియన్ యూరోల విలువైన పెట్రోలియం ప్రొడక్ట్‌లను యూరప్ దిగుమతి చేసుకుందని అంచనా. ఈ 8.5 బిలియన్ యూరోల (రూ.77,350 కోట్ల) దిగుమతుల్లో 6.16 బిలియన్ యూరో (రూ.56 వేల కోట్ల) విలువైన దిగుమతులు ఇండియా నుంచే ఉన్నాయని
సీఆర్‌ఈఏ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్‌లో 2 బిలియన్ యూరోల విలువైన క్రూడాయిల్‌ను రష్యా నుంచి ఇండియా దిగుమతి చేసుకుందని, అంతకుముందు నెలలో రికార్డ్ అయిన 2.4 బిలియన్ డాలర్ల నుంచి తగ్గిందని వివరించింది. కిందటి నెల రష్యా జరిపిన క్రూడాయిల్ ఎగుమతుల్లో 47 శాతం చైనాకు వెళ్లగా, 37 శాతం క్రూడాయిల్‌ను ఇండియా దిగుమతి చేసుకుంది.