కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో అన్ని దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. లాక్డౌన్ ఉండటంతో ప్రజలందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఆయా దేశాలు సూచిస్తున్నాయి. ఆ నిబంధనే ఒక ఆటగాడి ప్రాణాలు పోవడానికి కారణమయింది. రష్యాలో ఒక్కడే ఫుట్ బాల్ ప్రాక్టిస్ చేస్తున్న యువ ఆటగాడు చనిపోయిన ఘటన సోమవారం జరిగింది. రష్యాకు చెందిన లోకోమోటివ్ మాస్కో ఫుట్ బాల్ ఆటగాడు ఇన్నోకెంటీ సమోఖ్వలోవ్ లాక్డౌన్ వల్ల ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండె ఆగిపోయి మరణించాడు. ప్రస్తుతం సమోఖ్యలోవ్ లోకోమోటివ్ రిజర్వ్ టీం కజాంకా తరఫున ఆడుతున్నాడు.
లోకోమోటివ్ మాస్కో యువ ఆటగాడు ఇన్నోకెంటీ సమోఖ్వలోవ్ సోమవారం సోలోగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గుండె వైఫల్యంతో మరణించినట్లు రష్యన్ ప్రీమియర్ లీగ్ క్లబ్ తెలిపింది. ఆయన ఇప్పటి వరకు రష్యన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడలేదు. సమోఖ్యలోవ్ 2015లో లోకోమోటివ్ టీంలోకి వచ్చారు. అప్పటినుంచి లోకోమోటివ్ యొక్క రిజర్వ్ జట్టు కజంక కోసం ఆడుతున్నాడు.
‘ఇది అసలు ఊహించలేదు. సమోఖ్యలోవ్ గుండె ఆగిపోవడం వల్ల చనిపోయాడని వైద్యులు తెలిపారు. సమోఖ్యలోవ్ కు ఎటువంటి సమస్యలు లేవు. అతని కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం’ అని కజాంకా కోచ్ అలెగ్జాండర్ గ్రిషిన్ అన్నారు.
సమోఖ్యలోవ్ కు భార్య మరియు ఒక కుమారుడు ఉన్నారు. రష్యా ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ విధించింది. దాంతో అన్ని ఫుట్ బాల్ మ్యాచులు మే 31 వరకు వాయిదా పడ్డాయి.
For More News..