ఉక్రెయిన్​పై మిసైళ్లు, డ్రోన్లతో దాడి

  • రష్యా అటాక్​లో 16 మంది మృతి 

కీవ్: ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ మిసైళ్ల వర్షం కురిపించింది. ఈసారి 20 మిసైళ్లతో పాటు రెండు డ్రోన్లతోనూ దాడి చేసింది. శుక్రవారం తెల్లవారుజామున జరిపిన ఈ దాడుల్లో 16 మంది చనిపోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 2 నెలల తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా దాడికి పాల్పడింది. కీవ్ టార్గెట్ గా 11 మిసైళ్లు, రెండు డ్రోన్లను ప్రయోగించగా.. వాటిని అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు.

కీవ్ కు 215 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమన్ సిటీపైనా దాడులు జరిగినట్లు చెప్పారు. ఇక్కడి 9 అంతస్తుల బిల్డింగ్ పై మిసైల్ ప్రయోగించారని వెల్లడించారు. ఈ దాడిలో 14 మంది చనిపోయారని, వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. శిథిలాల నుంచి ముగ్గురు చిన్నారులను రక్షించామని తెలిపారు. 17 మందికి గాయాలు కాగా, 9 మందిని ఆస్పత్రిలో చేర్పించామన్నారు. ‘‘ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. సెకన్లలో బిల్డింగ్ కుప్పకూలింది. అదృష్టవశాత్తు మేం బయటపడ్డాం. పక్క అపార్ట్ మెంట్ లో ఉండే నా ఫ్రెండ్ చనిపోయింది” అని హలీనా అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

చైనాతో మాట్లాడిన తెల్లారే... 

దినిప్రో సిటీపైనా రష్యా దాడులు చేసిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో మహిళ, ఆమె రెండేండ్ల బిడ్డ చనిపోయారని చెప్పారు. మరో నలుగురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. కాగా, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్​తో జెలెన్ స్కీ మాట్లాడిన తెల్లారే రష్యా దాడులకు పాల్పడింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి కృషి చేస్తామని చైనా చెప్పిందని జెలెన్ స్కీ ప్రకటించారు. రష్యా తాజా దాడులను చూస్తుంటే ఆ దేశానికి శాంతి ఒప్పందంపై ఆసక్తి లేదని అర్థమవుతోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా అన్నారు.