
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా మంగళవారం అర్ధరాత్రి మిసైల్ అటాక్ చేసింది. ఈ దాడిలో ఐదుగురు చనిపోయారు. ఒడెసాలోని సదరన్ పోర్టులో అల్జీరియాకు వెళ్లే ఓ నౌకలో సరుకులు లోడ్ చేస్తుండగా మిసైల్ దాడి చేసిందని, ఈ దాడిలో నలుగురు సిరియన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారందరూ 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉన్నవారని చెప్పారు.
అలాగే సెంట్రల్ ఉక్రెయిన్ లోని ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్ స్కీ హోంటౌన్ క్రివిహ్ రిహ్ లోనూ రష్యా క్షిపణి దాడి చేసిందని, ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయిందని వెల్లడించారు. కాగా.. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉక్రెయిన్ ప్రతిపాదించాలనుకుంటున్న టైంలో రష్యా దాడి చేసింది. అంతకుముందు ఉక్రెయిన్ కూడా రష్యాపై భారీగా డ్రోన్ అటాక్ చేసింది. ఆ దాడిలో ఓ పౌరుడు చనిపోగా.. పలు భవనాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి.
ఆ అటాక్ కు ప్రతిదాడిగా రష్యా డ్రోన్ దాడి చేసినట్లు తెలుస్తున్నది. మరోవైపు ఉక్రెయిన్‌కు గతంలో మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తూ తాను విధించిన సస్పెన్షన్‌ను అమెరికా ఎత్తివేసింది. మిలిటరీ సాయం, కాల్పుల విరమణపై ఉక్రెయిన్, అమెరికా మధ్య మంగళవారం సౌదీలో చర్చలు జరిగాయి. రష్యాకు ఉన్న భారీ సైనిక బలగం నేపథ్యంలో తమ దేశానికి అమెరికా సైనిక సాయం చేయడం చాలా అవసరమని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.