- బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు
- 10 నుంచి 50 శాతం వరకు పెరిగిన ధరలు
- ఆహార పదార్థాల కొనుగోళ్లపై లిమిట్
- కంపెనీలు పోతుండడంతో ఊడుతున్న ఉద్యోగాలు
- లక్షలాది మందికి ఉపాధి దెబ్బ
- ఒక డాలర్‌కు 74 నుంచి 134కు పడిపోయిన రూబుల్
- స్టాక్ మార్కెట్లు క్లోజ్ అవ్వడంతో లక్షలాది కోట్లు ఆవిరి
- అనేక దేశాల ఆంక్షలతో దిగజారుతున్న పరిస్థితి
సెంట్రల్ డెస్క్, వెలుగు: ఉక్రెయిన్ మీద రష్యా ఆయుధ బలగంతో దండెత్తి పెను విధ్వంసమే సృష్టిస్తోంది. స్కూళ్లు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలు, ఫ్యాక్టరీలు, జనాల ఇండ్లపై బాంబులు వేసి నాశనం చేస్తోంది. దేశాన్ని మసిగొట్టుకుపోయిన శ్మశానంలా మార్చేసింది. కట్టుబట్టలతో పిల్లలను వెంటబెట్టుకుని.. ప్రజలు వేరే దేశానికి వలసకట్టేలా చేసింది. ఇలాంటి పరిస్థితులేవీ ప్రస్తుతం రష్యాలో లేవు. కానీ, ఆ యుద్ధంతో రష్యా ప్రజలూ లెక్కలేనన్ని సమస్యలతో అల్లాడిపోతున్నారు. కష్టంగా కాలాన్ని దాటుతున్నారు. కారణం, ఉక్రెయిన్‌పై దండయాత్రకు ప్రతిగా.. చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. వ్యాపారాలను తెంచేసుకున్నాయి. డబ్బులను ట్రాన్స్ఫర్ చేయలేకుండా పీటముడిని బిగించాయి. ఫలితంగా కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా రష్యాలో వ్యాపారాలను బంద్పెట్టాయి. డబ్బులకు కటకట ఏర్పడింది. ఎగుమతులు, దిగుమతులు బంద్ అయ్యాయి. తిండి ధరలు పెరిగాయి. జాబ్‌లు ఊడిపోయాయి. రూబుల్ విలువ దారుణంగా పడిపోయింది. యుద్ధం మొదలైనప్పట్నుంచి స్టాక్ మార్కెట్లు బంద్ కావడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు పోగొట్టుకున్నారు. రష్యా ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. ఒక్కటేమిటి పైకికనిపించకపోయినా యుద్ధం ఎఫెక్ట్.. రష్యాపైనా, ఆ దేశ ప్రజలపైనా భారీగానే పడింది.
ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు అమాంతం పైకి
ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ లేనిది రోజు గడవడం కష్టమైపోతోంది. కానీ, ఇప్పుడు రష్యాకు అన్ని ఎలక్ట్రానిక్ సంస్థలు టెక్నాలజీపై ఆంక్షలు పెట్టేశాయి. కొత్త ప్రొడక్ట్స్ రావడం ఆగిపోయాయి. దీంతో షాపుల్లో స్టాక్ అయిపోక ముందే వాటిని కొనేందుకు ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇదే అదునుగా చాలా సంస్థలు రేట్లు పెంచేశాయి. ఒక్కో ప్రొడక్ట్‌పై 15% వరకు ధరలను పెంచాయి. విదేశీ కార్లు, టీవీలు, ఏసీలు, కూలర్ల ధరలు విపరీతంగా పెరిగాయి.
జాబ్‌లు కల్లాస్
లీసా.. 19 ఏండ్ల యువతి. తన తల్లి, తమ్ముడిని సాకేది ఆమెనే. మాస్కోలోని యూనిక్లో అనే బట్టల చెయిన్‌లో ఈ మధ్యే మంచి జీతంతో ఉద్యోగం సంపాదించింది. కానీ, ఆ సంస్థ ఆపరేషన్లను ఆపేయడంతో ఆమె జాబ్ పోయింది. ఇంట్ల కష్టమైపోయింది. అది చాలా మంచి కంపెనీ అని, మంచి జీతం పోయిందని లీసా వాపోయింది. ఇప్పుడు మరో కంపెనీని వెతుక్కున్నా.. అంత జీతం ఇస్తరో..ఇయ్యరోనని టెన్షన్ పెట్టుకుంది. అది ఆ ఒక్క యువతి పరిస్థితేకాదు.. కొన్ని లక్షల మందిదీ అట్లనే ఉంది. ఇంటర్నేషనల్ బ్యాంకులు, టెక్నాలజీలో టాప్ కంపెనీలు, సాఫ్ట్వేర్ సంస్థలు, ఆటోమొబైల్ సంస్థలు, స్పోర్ట్స్ కంపెనీలు, కార్ల కంపెనీలు, ఫ్యాక్టరీలు తదితర 300కుపైగా పెద్ద సంస్థలు దేశం నుంచి వెనక్కు వెళ్లిపోయాయి. యాపిల్‌తో మొదలైన ఆ తంతు ఇంకా కొనసాగుతూనే ఉంది. చిన్నాపెద్ద సంస్థలు ఒకదాని తర్వాత ఒకటి రష్యాకు షాకిస్తూనే ఉన్నాయి. దీంతో ప్రొడక్షన్ ఆగిపోయింది. సప్లై చెయిన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా ఆ కంపెనీల్లో పనిచేస్తున్న కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోయారు. మున్ముందు ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని రష్యా ఆర్థికవేత్త ఆండ్రీ మోవ్చాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు మరింత పేదరికంలోకి జారిపోయే ముప్పుందన్నారు. జనవరిలో 4.4 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఇప్పుడు రెండంకెలకు చేరుకుందని, మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే, నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు రష్యా ప్రభుత్వం చర్యలనూ చేపట్టింది. కార్యకలాపాలను ఆపేసిన పెద్ద సంస్థల్లో 25% లేదా పూర్తి వాటా తీసుకుని ఆపరేట్ చేసేలా స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తోంది. అందుకు ఆ విదేశీ సంస్థలను వేలం వేయాలని పుతిన్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. కొంతైనా ఆ ప్రభావాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది.
విమానాలు ఆగినయ్
యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, యూరప్ సహా చాలా దేశాలు రష్యాకు విమానాలను బంద్ పెట్టాయి. దీంతో రష్యా నుంచి విదేశాలకు వెళ్లేటోళ్లు, విదేశాల్లో ఉన్న రష్యన్లు తిరిగొచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో లక్షన్నర మందికిపైగా రష్యా టూరిస్టులు చిక్కుకుపోయారు. స్విఫ్ట్ ఆంక్షలు, మాస్టర్ కార్డ్, వీసా కార్డ్‌లు రష్యాకు సేవలను నిలిపేయడంతో.. విదేశాల్లో చిక్కుకున్న రష్యా టూరిస్టులు డబ్బులను డ్రా చేసుకోలేక, కార్డులతో చెల్లింపులు చేయలేక తంటాలు పడుతున్నారు. ఇటు విమానయాన సంస్థలూ తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో పనిచేసే ఉద్యోగులకూ జీతాలివ్వలేని పరిస్థితులున్నట్టు తెలుస్తోంది.
స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు గల్లంతు
యుద్ధం మొదలైనప్పట్నుంచి రష్యా స్టాక్ మార్కెట్లకు తాళం పడే ఉంది. ఇప్పటిదాకా తెరుచుకోనేలేదు. మార్చి 18 నుంచి మార్కెట్లను కేవలం ట్రాన్సాక్షన్ల కోసం ఓపెన్ చేసేందుకు రష్యా సెంట్రల్ బ్యాంక్ కసరత్తులు చేస్తున్నా అవి ఎంత వరకు ఫలిస్తాయన్నది తెలియట్లేదు. దీంతో అన్ని కంపెనీల షేర్ల విలువ 50 శాతానికిపైగా పడిపోయిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. షేర్ హోల్డర్లు కొన్ని లక్షల కోట్ల రూబుల్స్‌ను నష్టపోయినట్టు చెప్తున్నారు. ఆంక్షలతో అయితే, మార్కెట్లు ఓపెన్ అయినప్పుడు వెయ్యి కోట్ల డాలర్లతో (సుమారు రూ.76,759 కోట్లు) మార్కెట్‌కు మళ్లీ కళ తెస్తామని సెంట్రల్ బ్యాంక్ హామీ ఇస్తోంది. మార్కెట్లు 18 నుంచి ఓపెన్ అయినా ట్రేడింగ్ మార్చి 21 తర్వాతనే మొదలు పెట్టే చాన్స్ ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్లూ.. రష్యా స్టాక్స్‌పై బ్యాన్ విధించాయి.
తిండి కోసం షాపుల ముందు జనాల క్యూలు
మెక్ డొనాల్డ్స్, స్టార్‌బక్స్, కేఎఫ్‌సీ, పిజ్జాహట్, పాలిగ్, వాలియో లాంటి పెద్దపెద్ద రెస్టారెంట్లు, ఫుడ్ చెయిన్స్ తమ వ్యాపారాన్ని బంద్పెట్టాయి. ఫలితంగా తిండికి కటకట ఏర్పడింది. జనాలు షాపుల ముందు క్యూ కడుతున్నారు. ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున సరుకులు కొంటున్రు. దీంతో కొరత ఏర్పడింది. ధరలు 10 నుంచి 50 శాతం పెరిగాయి. చాలా మంది సరుకులు దొరకక ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొనే వస్తువులపై పరిమితులు పెట్టారు. జపాన్ పంపే టోఫు నుంచి మన దేశం నుంచి వచ్చే బాస్మతిరైస్, కొబ్బరి నూనెల వరకు రేషనింగ్‌ను విధించారు. రష్యాలో ప్రధానంగా తినేది బ్రెడ్. దానికి అవసరమయ్యే పిండిని ఒక్కో వ్యక్తికి 10 కిలోలు మాత్రమే అమ్ముతున్రు. చక్కెర 10 కిలోలు, నూనె 10 బాటిళ్లు, ఉప్పు 3 కిలోలు, పాస్తా 10 ప్యాకెట్లు అమ్ముతున్రు.
రూబుల్ పడింది.. ప్రజలు పేదోళ్లయితున్నరు
యుద్ధం మొదలుపెట్టాక అమెరికా స్విఫ్ట్(సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలి కమ్యూనికేషన్స్) ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రపంచ ఆర్థిక లావాదేవీల నుంచి రష్యాను ఒంటరిని చేసింది. ఆ దేశ సెంట్రల్ బ్యాంకు సహా అనేక బ్యాంకులను నిషేధించింది. ఏ దేశంతోనూ రష్యా కరెన్సీని మార్చుకోలేకుండా, విదేశాల్లో ఉన్న నిధులను డ్రా చేసుకోలేకుండా కట్టిపడేసింది. దీంతో రష్యాకు ఆర్థికంగా దెబ్బ పడింది. ఆర్థిక లావాదేవీలకు ఎంతో ముఖ్యమైన మాస్టర్ కార్డ్, వీసాలు తమ ఆపరేషన్లను బంద్ పెట్టడంతో ట్రాన్సాక్షన్లు తగ్గిపోయాయి. జనాలు ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూ కట్టి సొమ్ములు డ్రా చేసుకున్నారు. మున్ముందు డబ్బులకు మరింత కష్టమయ్యే ప్రమాదముందని గ్రహించి బ్యాంకుల్లోని సేవింగ్స్‌ను వెనక్కు తీసేసుకున్నారు. ఖాతాలను క్లోజ్ చేసేశారు. మొత్తం డబ్బులను డ్రా చేసుకోవడంతో.. రష్యా ఖజానా కరిగిపోయింది. విదేశీ లావాదేవీల్లేక డాలర్ నిల్వలు పడిపోయాయి. రష్యా కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. యుద్ధం మొదలవడానికి ముందు డాలర్‌కు 74 రూబుల్స్‌గా ఉన్న రష్యా కరెన్సీ విలువ ఇప్పుడు 134కి దిగజారింది. దీంతో సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 20% పెంచేసింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గించేసింది. ఫలితంగా చాలా మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోతున్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్‌కూ దెబ్బ
ఆర్థిక, వ్యాపారాల పరంగానే కాదు.. కల్చరల్ యాక్టివిటీస్, క్రీడలపైనా పెద్ద దెబ్బే పడింది. రష్యా ఆటగాళ్లను చాలా దేశాలు బ్యాన్ చేశాయి. ఫుట్‌బాల్ క్లబ్, బ్యాడ్మింటన్, హాకీ సంఘాలు రష్యాపై నిషేధం విధించాయి. డిస్నీ, వార్నర్ బ్రదర్స్, పారామౌంట్ వంటి సినీ ఇండస్ట్రీలు రష్యాలో సేవలు ఆపేశాయి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, యూరోవిజన్ సాంగ్ కంటెస్ట్ నుంచి రష్యా పార్టిసిపెంట్లను నిషేధించాయి.