పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్
తమ అణ్వాయుధ పాలసీని మార్చుకున్నామని ప్రకటన
మాస్కో: పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూక్లియర్ వార్నింగ్ ఇచ్చారు. తమ శత్రువుకు ఆయుధ సాయం చేసే దేశాలను తమపై డైరెక్ట్‌గా దాడి చేసినట్టుగానే భావిస్తామన్నారు. అలాంటి దేశాలపై న్యూక్లియర్ బాంబులు వేస్తామన్నారు. గురువారం మాస్కోలో దేశ అత్యున్నత స్థాయి భద్రతామండలితో పుతిన్ సమావేశమయ్యారు. దేశ అణ్వాయుధ పాలసీలో మార్పులను ఆమోదించారు.
రష్యాపై వైమానిక దాడులు చేస్తున్న ఉక్రెయిన్‌కు అత్యధునిక ‘స్టార్మ్ షాడో’ క్షిపణులను ఇవ్వాలని బ్రిటన్ ఇటీవల నిర్ణయించింది. అలాగే రష్యాపై అనుసరిం చాల్సిన వ్యూహాలపై యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌తో చర్చించేందుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అమెరికా వెళ్లారు. ఇది పుతిన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
అందుకే తమపై దాడులు చేసే దేశాలకు సాయం చేసే దేశాలపై రష్యా అణ్వాయుధ దాడికి దిగుతుందని హెచ్చరించారు. ఈ మేరకు తమ దేశ అణ్వస్త్ర పాలసీని మార్చినట్టు ప్రకటించారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు వెపన్స్ ఇచ్చినా, ఆ వెపన్స్ ద్వారా తమపై దాడి జరిగినా.. ఆ దేశాలు రష్యాపై దాడికి పాల్పడినట్టుగానే భావిస్తామన్నారు.