- పోలెండ్‌కు దగ్గర్లోని ల్వీవ్ మిలిటరీ బేస్‌పై మిసైళ్ల వర్షం
- 35 మంది చనిపోయారన్న రీజియన్ గవర్నర్
- స్లొవేకియా, హంగరీ బార్డర్లలోని ఫ్రాంకివిస్క్ ఎయిర్‌పోర్టుపై అటాక్స్
- క్రిమియాకు దగ్గర్లోని మైకొలేవ్‌పై వైమానిక దాడి.. 9 మంది మృతి
- శ్మశానంలా ఇర్పిన్ పట్టణం.. వీధులు, పార్కుల్లో శవాలు
- కీవ్‌ను వేగంగా చుట్టుముడుతున్న రష్యన్ ట్యాంకులు
కీవ్/ల్వీవ్/మరియుపోల్/న్యూఢిల్లీ: రష్యా విస్త‘రణం’ కొనసాగుతున్నది. కీవ్‌తో మొదలుపెట్టి ఉక్రెయిన్‌లోని కీలక నగరాలన్నింటిపైనా దాడులు చేస్తున్నది. ఇప్పుడు ఒకడుగు ముందుకు వేసి నాటో సభ్య దేశాల సరిహద్దుల్లోనూ బాంబులు వేస్తున్నది. పోలండ్ బార్డర్‌కు దగ్గర్లోని ల్వీవ్ సిటీ మిలిటరీ బేస్‌పై.. స్లొవేకియా, హంగరీ బార్డర్లలోని ఇవానో ఫ్రాంకివిస్క్ ఎయిర్‌పోర్టుపై అటాక్స్ చేసింది. కీవ్‌కు దగ్గరగా వచ్చిన రష్యన్ సైనిక బలగాలు.. ఆ సిటీని ట్యాంకులతో అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్నాయి. ఖార్కివ్, మరియుపోల్, చెర్నిహివ్ లాంటి సిటీల్లో నిరంతరం షెల్లింగ్ చేస్తూనే ఉన్నది.
నాటో వాడుకునే బేస్‌పై 30 మిసైళ్లు!
ల్వీవ్ సిటీ మిలిటరీ బేస్‌పై రష్యా మిసైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 9 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఆదివారం ఉదయం 6 గంటల టైంలో యవోరివ్ మిలిటరీ కాంప్లెక్స్‌పై రష్యన్ దళాలు మిసైళ్ల వర్షం కురిపించాయని ఉక్రెయిన్ ఆఫీసర్లు చెప్పారు. కనీసం 8 మిసైళ్లు వేసినట్లు ప్రాథిమిక రిపోర్టుల్లో తేలింది. కానీ 30 క్రూయిజ్ మిసైళ్లతో దాడి చేశారని, 35 మంది చనిపోయారని, 134 మంది గాయపడ్డారని ల్వీవ్ రీజియన్ గవర్నర్ మాక్‌సిమ్ కోజిట్స్‌కీ తెలిపారు. దేశం కోసం చనిపోయిన ఏ ఒక్క హీరోను తాము మరిచిపోబోమని, దేశంలోకి చొరబడిన ఏ ఒక్క ఆక్రమణదారుడినీ వదిలిపెట్టబోమని చెప్పారు. యవోరివ్ మిలిటరీ కాంప్లెక్స్‌ను ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పీస్‌కీపింగ్, సెక్యూరిటీ’గా కూడా పిలుస్తారు. ఈ కాంప్లెక్స్‌పై దాడి తర్వాత అయినా.. ఉక్రెయిన్‌ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ కోరారు. మరోవైపు రెండు మిసైళ్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నాశనం చేశాయని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ వెస్ట్ తెలిపింది. స్లొవేకియా, హంగరీ బార్డర్లలోని ఇవానో ఫ్రాంకివిస్క్ విమానాశ్రయంపై రష్యా బాంబులు కుమ్మరించింది. భయాందోళనను సృష్టించడమే రష్యా లక్ష్యమని ఇవానో ఫ్రాంకివిస్క్ మేయర్ మండిపడ్డారు.
మరో మేయర్ కిడ్నాప్
మరో మేయర్‌ను రష్యన్ దళాలు కిడ్నాప్ చేశాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా చెప్పారు. ‘‘దక్షిణ ఉక్రెయిన్‌లోని డ్నిప్రోరూడ్నే మేయర్ యేవ్‌హెన్ మత్వెయేవ్‌ను రష్యన్ యుద్ధ నేరస్థులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల నుంచి మద్దతు దొరక్కపోవడంతో ఆక్రమణదారులు బీభత్సానికి పాల్పడుతున్నారు. ఉక్రెయిన్, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న రష్యా ఉగ్రవాదాన్ని ఆపాలని అన్ని దేశాలు, అంతర్జాతీయ సంస్థలను కోరుతున్నా” అని అన్నారు. శనివారం కూడా మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడొరోవ్‌ను
కిడ్నాప్ చేశారని చెప్పారు.
పోలెండ్‌కు ఇండియన్ ఎంబసీ
యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్ నుంచి పక్క దేశం పోలెండ్‌కు ఎంబసీని తాత్కాలికంగా మార్చాలని ఇండియా నిర్ణయించింది. ఆదివారం ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్ పరిణామాల ఆధారంగా ఎంబసీని ఎక్కడ కొనసాగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. భారత పౌరులను తరలించేందుకు ల్వీవ్‌లో మన ఎంబసీ క్యాంపును ల్వీవ్‌లో ఏర్పాటు చేశారు.
శరణార్థులకు ఆశ్రయమిస్తే నెలకు 35 వేలు
ఉక్రెయిన్ శరణార్థులను ఆదుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లో ఉక్రెయిన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించే ఫ్యామిలీలకు నెలకు రూ.35 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. ఇందుకోసం ‘‘హోమ్స్ ఫర్ ఉక్రెయిన్” స్కీమ్ ను ప్రవేశపెట్టింది.
12 రోజుల్లో 1,582 మంది చనిపోయిన్రు: ఉక్రెయిన్ మంత్రి ట్వీట్
‘పగలు రాత్రీ తేడా లేకుండా బాంబులు పేలుతున్నయ్.. గడిచిన 12 రోజులలో రష్యా దాడుల్లో 1582 మంది ఉక్రెయిన్ పౌరులు కన్నుమూశారు. వాళ్లను ఇదిగో ఇలా సామూహికంగా పూడ్చేస్తున్నరు. మా ఆర్మీని ఎదుర్కోలేక పుతిన్ సర్కారు నిరాయుధులపై బాంబులతో దాడి చేస్తోంది. సామాన్యులకు సాయం అందకుండా అడ్డుకుంటూ వారిని ఆకలితో మాడ్చి చనిపోయేలా చేస్తోంది. భూమ్మీద ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితిని మరియుపోల్ ఎదుర్కొంటోంది’ అని ఉక్రెయిన్ ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ డిమిత్రో కులేబా ఆదివారం ఈ ఫొటోను ట్వీట్ చేశారు. మరియుపోల్‌కు కరెంట్, నీటి సరఫరా కట్ చేశారని ఆయన చెప్పారు. రష్యా చేస్తున్న దాడుల కారణంగా బిల్డింగ్స్, ఇండ్లు, హాస్పిటళ్లు, వీధులు పూర్తిగా ధ్వంసమయ్యాయని వివరించారు. ఈ సంక్షోభ సమయంలో ఉక్రెయిన్ ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారని, దేశాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
కీవ్‌ను పూర్తిగా నేలమట్టం చేసినంకే.. జెలెన్‌స్కీ
పిల్లల్ని కూడా రష్యన్ సోల్జర్లు కాలుస్తున్నారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఆరోపించారు. పుతిన్ దళాలు కీవ్‌ను పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాతే.. ఆ సిటీ వారికి దక్కుతుందని అన్నారు. ‘‘ఈ రీజియన్ చరిత్రను, కీవన్ రస్ చరిత్రను, యూరప్ చరిత్రను చెరిపేయాలనుకుంటే, మమ్మల్ని అందరినీ నాశనం చేయాలని అనుకుంటే.. వారు కీవ్‌లోకి రాగలరు. అదే వారి గోల్ అయితే.. వాళ్లను రానివ్వండి. కాకపోతే.. వాళ్లు మాత్రమే ఇక్కడ జీవిస్తరు” అని స్పష్టం చేశారు.