రష్యా..లూనా 25 చంద్రమిషన్ పై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతున్నాయా.. చంద్రుడి దక్షిణ ధృవంపై ఫస్ట్ ల్యాండ్ అవ్వాలనుకున్న రష్యాకు అంతరిక్షంలో చుక్కెదురైందా? రష్యా ప్రయోగించిన లూనా25లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నాయా అంటే.. అవుననే తెలుస్తోంది. లూనా 25 చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కు ఒక్కరోజు ముందే సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ట్ కాస్మోస్ ప్రకటించింది. ఆటోమెటిక్ స్టేసన్ లో ఎమర్జెన్సీ తలెత్తినట్లు రష్యా స్పేస్ సెంటర్ వెల్లడించింది.
చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా -25లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆగస్టు 11న రష్యా ప్రయోగించిన లూనా -25లో శనివారం సాంకేతిక సమస్య గుర్తించినట్లు ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ వెల్లడించింది. చంద్రుడిపై దిగేందుకు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే ముందు దీనిని గుర్తించినట్లు తెలిపింది. అయితే ఆగస్టు 21న ల్యాండింగ్ పై రోస్ కాస్మోస్ ఎలాంటి స్పష్టతను ప్రకటించలేదు.
2023 జూలై 14న చంద్రుడిపైకి చంద్రయాన్ 3 ని ఇస్రో ప్రయోగించింది. అయితే సరిగ్గా 25 రోజుల తర్వాత రష్యా.. చంద్రుడిపై అదే దక్షిణ ధృవంపై ల్యాండింగ్ కోసం లూనా 25ని ఆగస్టు 11న ప్రయోగించింది. ల్యాండింగ్ ప్రక్రియలో భాగంగా సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తూ ఇస్రో చంద్రుడిపై ల్యాండింగ్ కు 40 రోజుల సమయాన్ని నిర్ణయించింది. అయితే రష్యా మాత్రం కేవలం 11 రోజుల్లోనే లూనా 25 ని చంద్రుడి దక్షిణ ధృవం పై ల్యాండింగ్ చేసేందుకు షెడ్యూల్ ప్రకటించింది.
లూనా 25 ప్రయోగించిన తొలి రోజునే పలు అనుమానాలు తలెత్తాయి. చంద్రుడి దక్షిణ ధృవంపై రెండు స్పేప్ క్రాఫ్ట్ లు ఒకేచోట ల్యాండ్ అవుతాయా.. ఢీకొనే ప్రమాదం ఉందా.. అతి తక్కువ సమయంలో లూనా 25 ల్యాండింగ్ ప్రక్రియ సాధ్యమేనా ఇలా అనేక సందేహాలు తలెత్తాయి.
షెడ్యూల్ ప్రకారం.. చంద్రుడిపైన రష్యా ప్రయోగించిన లూనా -25 ఈ నెల 21న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగాల్సి ఉండగా.. శనివారం సాంకేతిక సమస్య వెలుగు చూసింది.దీంతో ఆటోమేటిక్ స్టేషన్ లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. దాదాపు 50 ఏళ్ల విరామం తరువాత రష్యా చంద్రుడిపై పరిశోధనల కోసం లూనా -25ని రష్యా ప్రయోగించింది. కేవలం 11 రోజుల్లోనే చంద్రుడిపై దిగేందుకు రష్యా ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది.
ఈ సమయంలో భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన -3 కీలక దశలు పూర్తి చేసింది. ఇక చంద్రుడిపై దిగేందుకు సిద్దంగా ఉంది. జాబిల్లికి కేవలం ఒక అడుగు దూరంలో మాత్రమే ఉందని ఇస్రో ప్రకటించింది. చంద్రుడికి అత్యంత దిగువన ల్యాండర్ మాడ్యూల్ కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు తగ్గించారు. ఫైనల్ డీ బూస్టింగ్ అపరేషన్ చేపట్టి విజయంతంగా ల్యాండర్ ను దిగువ కక్ష్యకు చేర్చారు. దీంతో చంద్రుడి నుంచి అతి దగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యూల్ చేరింది.
విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25 కిలో మీటర్లు, అత్యధికంగా 134 కిలో మీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ కీలక ఘట్టం పూర్తి కావటంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగటం మిగిలి ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం కీలకంగా భావిస్తున్న చివరి దశ అయిన విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ పై దృష్టి పెట్టారు. ఇదే క్రమంలో అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న సాయంత్రం 5.45కి చంద్రుడిపై అడుగు పెట్టే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.