
హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట, వెలుగు: సిటీలోని పలు ప్రాంతాల్లోని జ్యూస్ షాపులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు చేశారు. వెంగళరావు నగర్ లోని ఏ1 ఫ్రూట్ జ్యూస్ షాప్, అలాగే అమీర్ పేట్ లోని కొకనట్ జ్యూస్ బార్, కేజీఎన్ జ్యూస్ సెంటర్, న్యాచురల్ ఫ్లేవర్స్, బాంబే జ్యూస్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు.
ఇందులో ఏ–1 జ్యూస్ షాపు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉండటం, తప్పు పట్టిన కత్తులతో ఫ్రూట్స్ కట్ చేస్తున్నట్లు గుర్తించారు. కొకనట్ జ్యూస్ బార్ లోని ఫ్రిడ్జ్ లో బొద్దింకలు ఉన్నట్లు, కుళ్లిపోయిన ఫ్రూట్స్‌తో జ్యూస్ తయారు చేస్తున్నట్లు, పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయనని గుర్తించారు.
కేజీఎన్ జ్యూస్ సెంటర్‌లోని తయారీ ఏరియాలో ఈగలు తిరుగుతున్నాయని, ఫ్రిడ్జ్ అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు, పాడైన ఫ్రూట్ సలాడ్‌ను ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి వినియోగదారులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. న్యాచురల్ఫ్లేవర్స్ లో లైసెన్స్ లేకుండా వ్యాపారం కొనసాగిస్తున్నట్లు, గడువు ముగిసిన ఫ్రూట్ సిరప్‌లు ఉన్నట్లు గుర్తించారు. మ్యానుఫ్యాక్చరింగ్ లేబుల్ లేని సోడాను గుర్తించారు.
బాంబే జ్యూస్ సెంటర్ ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసిన కుళ్లిన పండ్లు, కూరగాయలను జ్యూస్ తయారీకి ఉపయోగిస్తున్నట్లు చూసి నివ్వెరపోయారు. లైసెన్స్ లేదని, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేవని, ఫుడ్ హ్యాండ్లర్లు ఆహార తయారీ సమయంలో పరిశుభ్రత పాటించడం లేదని, డస్ట్‌బిన్‌లు తెరిచి ఉన్నట్లు గుర్తించారు. ఈ జ్యూస్‌సెంటర్లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 కింద అధికారులు నోటీసులు జారీ చేశారు.