- 9 నెలల్లో 3 దశలుగాసర్కారుకు రిపోర్ట్
- మార్చి చివరి నాటికి తొలి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం
- మూడేండ్లలో సర్వే పూర్తిచేయాలని సర్కారు లక్ష్యం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని పబ్లిక్–ప్రైవేట్–పార్ట్ నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేసే అంశంపై అధ్యయనం చేసే బాధ్యతలను ఆర్ వీ అసోసియేట్, లీ అసోసియేట్ కంపెనీలు జాయింట్ వెంచర్ గా టెండర్ దక్కించుకున్నాయి. వచ్చే 9 నెలల్లో రాష్ట్రంలో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధి, రిపేర్లపై 3 దశల్లో సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని , తొలి దశ రిపోర్టును మార్చ్ చివరి నాటికి అందించాలని ప్రభుత్వం టెండర్ లో స్పష్టం చేసింది. గత ఏడాది నవంబరులో నోడల్ ఏజెన్సీగా ఉన్న పంచాయతీ రాజ్ శాఖ.. రోడ్ల అభివృద్ధి సర్వేపై టెండర్లు ఆహ్వానించింది. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ రోడ్లు ఎక్కువగా ఉన్నందున రోడ్ల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీగా పీఆర్ ఇంజినీరింగ్ ను ప్రభుత్వం ఎంపిక చేసింది.
టెండర్ దక్కించుకున్న కంపెనీలు (కన్సల్టెన్సీ).. రాష్ర్టంలోని స్టేట్ హైవేస్, మేజర్ డిస్ర్టిక్ట్ రోడ్స్, అదర్ డిస్ర్టిక్ రోడ్స్, ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతీ రోడ్ల మరమ్మతులు, దానికి అవసరమయ్యే నిధులను అంచనా వేయడం, నిధుల సమీకరణ, ఆ రోడ్ల మీద రోజువారీ ట్రాఫిక్, ఏ పద్ధతిన రోడ్లను అభివృద్ధి చేయాలన్న అంశాలపై ప్రభుత్వం విధించిన గడువు లోగా డీపీఆర్ ను అందజేయనున్నాయి. తర్వాత ప్రభుత్వం ఏటా ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయించి రోడ్ల మరమ్మతు పనులు చేపడుతుంది. ఇందుకు వచ్చే నెలలో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా.. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ రెండు శాఖల రోడ్లు కలిపి 2900 కి.మీ మేర రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మూడు కేటగిరీలుగా రోడ్ల అభివృద్ధి
రాష్ర్టంలో గ్రామాల నుంచి మండలాల వరకు, మండలాల నుంచి జిల్లా కేంద్రం వరకు, జిల్లా కేంద్రం నుంచి రాష్ర్ట రాజధాని వరకు రోడ్లను పీపీపీ పద్ధతిలో డెవలప్ చేయాలని గత ఏడాది అక్టోబరులో జరిగిన కేబినెట్ మీటింగ్ లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణా రావు చైర్మన్ గా, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్ మెంబర్లుగా, ఆర్ అండ్ బీ రోడ్స్ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్, పంచాయతీ రాజ్ ఈఎన్సీ కనకరత్నం, ట్రైబల్ చీఫ్ ఇంజినీర్ శంకర్ తో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలుసార్లు సమావేశమై కన్సల్టెన్సీ ఎంపిక, వారి విధులు, రోడ్ల అభివృద్ధిలో సీఎం చేసిన ఆదేశాలపై చర్చించింది. గ్రామాల నుంచి మండలాలు, మండలాల నుంచి జిల్లా కేంద్రం వరకు 1120 కి.మీ, జిల్లా కేంద్రం నుంచి రాజధాని వరకు 400 కి.మీ మేర రోడ్లను అభివృద్ధి చేయాల్సి ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ప్రతినెలా రూ. 150 కోట్లు రిలీజ్
రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ.1000 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించారు. ఈ రహదారుల నిర్మాణానికి ఈనెల నుంచి నెలకు రూ.150 కోట్ల చొప్పున జూన్ నెలాఖరు నాటికి రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఈనెల 3న జరిగిన రివ్యూ మీటింగ్ లో లో సీఎం ఆదేశించారు. వాహనాలు ఆటంకాలు లేకుండా సాగిపోయేందుకు వీలుగా రహదారులను నిర్మించాలన్నారు. ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని సీఎం ఆదేశించారు. గ్రామాల నుంచి మండలాల వరకు సింగిల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు కచ్చితంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుంతలు పడిన రహదారులకు వెంటనే రిపేర్లు చేయాలని సీఎం సూచించారు.