- డెంగ్యూ నియంత్రణపై చర్యలు చేపట్టాలి
- రక్త పరీక్షలు పెంచండి.. ఫీవర్ సర్వే రెగ్యులర్ గా చేయండి
- రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్ వీ కర్ణన్
- సీజనల్ వ్యాధులపై కలెక్టర్, అధికారులతో సమీక్ష
ఖమ్మం టౌన్/కుసుమంచి, వెలుగు : డ్రై డే కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, అధికారులతో కలిసి సీజనల్ వ్యాధులు, డెంగ్యూ నియంత్రణ, వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. తొలుత ఆయన ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను విజిట్ చేశారు.హాస్పిటల్ లో టీ హబ్ ను పరిశీలించారు. రక్త నమూనాల సంఖ్య టెస్టుల నమోదు ఆన్లైన్ లో కాకుండా, మాన్యువల్‌గా నమోదు చేయడంపై, ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం కలెక్టరేట్ లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లోనూ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. డెంగ్యూ నియంత్రణ పై వైద్య ఆరోగ్య శాఖతోపాటు స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రై డే కార్యక్రమాలతో దోమల వృద్ధిని అరికట్ట వచ్చన్నారు.
ఫీవర్ సర్వే రెగ్యులర్ గా చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ తిరిగి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టాలన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో డెంగ్యూ పేషెంట్లకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేకరించే నమూనాలు టీ హబ్ లో, ప్రయివేట్ ఆసుపత్రుల నమూనాలు ఐడీఎస్పీ ల్యాబ్ ల్లో పరీక్షలు చేయించాలని సూచించారు. ప్లేట్లెట్స్, బ్లడ్ అందుబాటులో ఉండేట్లు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సూచించారు.
కావాల్సిన మందులకు ఇండిట్ పంపాలన్నారు. అంతకుముందు కూసుమంచి పీహెచ్‌సీని కమిషనర్ తనిఖీ చేశారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతీ శుక్రవారం జిల్లాలో డ్రై డే ను పటిష్టంగా చేపడుతున్నామని తెలిపారు. స్లమ్ ఏరియాలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని చెప్పారు. ప్రజల్లో సీజనల్ వ్యాధులపై అవగాహనకు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు.
ఆరోగ్య కేంద్రంలో రెఫరల్, అంబులెన్స్, డెలివరీ రిజిష్టర్లను పరిశీలించారు. లాబరేటరీ పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. డెలివరీలు పెంచాలని, గర్భిణులకు రెగ్యులర్ చెకప్ అయ్యేలా చూడాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, డీఆర్డీవో సన్యాసయ్య, డీఎంహెచ్‌వో మాలతి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుంకర రాజేశ్వర రావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్, డీటీసీవో డాక్టర్ సుబ్బారావు, ఇన్చార్జి జడ్సీ సీఈవో నాగలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో సైదులు, డాక్టర్ సీతారాం, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ చందు నాయక్, డాక్టర్ రామకృష్ణ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, ఆర్ఎంవో డాక్టర్ రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.