ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచాలి : ఆర్వీ కర్ణన్

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచాలి : ఆర్వీ కర్ణన్

హనుమకొండ/గ్రేటర్​ వరంగల్, వెలుగు: ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో కాన్పులు పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని స్టేట్ హెల్త్​అండ్​ఫ్యామిలీ వెల్ఫేర్​కమిషనర్​ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని సోమవారం ఆయన ఆకస్మికంగా  తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్ ను పరిశీలించి టీ డయాగ్నోస్టిక్​ హబ్​ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ, ల్యాబ్, వార్డు, నవజాత శిశువు సంరక్షణ కేంద్రం, మిల్క్ బ్యాంకు, ఐసీటీసీ సెంటర్లను పరిశీలించారు.  

సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ప్రతి రోజు కాన్పులు, ఇతర ఆపరేషన్లు ఎన్ని చేస్తున్నారని ఆరా తీశారు. కేస్​ షీట్ లు,  ఇతర రికార్డులను తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడి సేవలు, మందులపై అడిగి తెలుసుకున్నారు. ప్రతి గర్భిణి పీహెచ్​సీ నుంచి జీఎంహెచ్ కు చెకప్ లకు వచ్చేలా ఆశాలు, ఏఎన్ఎంలు చొరవ చూపాలన్నారు.  డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. 

హాజరు పట్టికను పరిశీలించి  గైర్హాజరు, సెలవులో ఉన్న వారి వివరాలపై ఆరా తీశారు. ఆయన వెంట హనుమకొండ డీఎంహెచ్​వో డాక్టర్ ఏ.అప్పయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఇతర వైద్య సిబ్బంది డాక్టర్ కే.లలితాదేవి, ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి, ఆర్ఎంవో డాక్టర్ అంబరీశ్,  డాక్టర్ నాగరాజు, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.