సర్వికల్​ కేన్సర్‌ను తరిమేసిన రువాండా

సర్వికల్​ కేన్సర్‌ను తరిమేసిన రువాండా

సెర్వికల్​ (గర్భాశయ) కేన్సర్​​ ప్రపంచ మహిళను పీడించే రోగాల్లో ఒకటి. పోయినేడాది దీనివల్ల మూడు లక్షల పైచిలుకు ఆడవాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని అరికట్టడంలోనూ, కంట్రోల్‌‌‌‌ చేయడంలోనూ అమెరికా, ఫ్రాన్స్‌‌‌‌ లాంటి ధనిక దేశాలు చేతులెత్తేశాయి. సెక్సువల్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫెక్షన్‌‌‌‌తో సోకే హ్యూమన్‌‌‌‌ పాపిలోమా వైరస్‌‌‌‌ (హెచ్‌‌‌‌పీవీ)ని టీకా మందుతో కంట్రోల్‌‌‌‌ చేయవచ్చు. కొన్ని దేశాల్లో  టీకా వేయడంపై అనేక అపోహలుంటాయి. ఆర్థికంగా చితికిపోయిన సెంట్రల్‌‌‌‌ ఆఫ్రికా దేశం రువాండా ఈ విషయంలో చొరవ తీసుకుంది.  సెర్వికల్‌‌‌‌ కేన్సర్​‌‌‌‌ని తరిమేసింది.

జాతుల  అంతర్యుద్ధంలో ఆర్థికంగా అట్టడుగుకి చేరుకున్న ఆఫ్రికా దేశాల్లో రువాండా ఒకటి. అది కొద్ది కాలంలోనే వేగంగా పుంజుకుంది. ఇప్పుడు ధనిక దేశాలు చేతులెత్తేసిన ఒక ప్రాణాంతక వ్యాధిని కంట్రోల్‌‌‌‌ చేయడానికి చొరవ చూపిస్తోంది. మూడేళ్ల కిందటే సెర్వికల్‌‌‌‌ కేన్సర్​‌‌‌‌ని కంట్రోల్‌‌‌‌ చేయడానికి నడుం బిగించింది. ఇంటర్నేషనల్​ ఫార్మా కంపెనీ మెర్క్​తో ఒప్పందం కుదుర్చుకుంది. సెర్వికల్​ కేన్సర్​​కు కారణమయ్యే హ్యూమన్​ పాపిలోమా వైరస్ (హెచ్​పీవీ) కట్టడికి ఈ సంస్థ వ్యాక్సిన్​ అందిస్తుంది. ఈ​ కేన్సర్​​పై పోరాటానికి నేషనల్​ ప్రివెన్షన్​ ప్రోగ్రామ్​ను ఒక ఆఫ్రికా దేశం చేపట్టడం ఇదే తొలిసారి.  రువాండాలో ఆడవాళ్లకు కామన్‌‌‌‌గా ఎటాక్​ అయ్యే కేన్సర్​​లలో సెర్వికల్​ కేన్సర్​ ప్రధానమైంది.

వ్యాధి నివారణలో సర్కార్​కి కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. వాటిని దాటుకొని టార్గెట్​ను చేరింది. హెచ్​పీవీ సెక్సువల్​గా వచ్చే ఇన్ఫెక్షన్​. ప్రపంచంలో చాలా దేశాల మాదిరిగానే రువాండాలోనూ సెక్స్​ గురించి ఓపెన్‌‌‌‌గా మాట్లాడుకోవటం నిషేధం. దీనికితోడు ఈ టీకా మందు​ వల్ల భవిష్యత్​లో సంతానం కలగదనే పుకార్లు షికారు చేశాయి. ఫలితంగా పేరెంట్స్​ తమ పిల్లలకు వ్యాక్సిన్​ వేయించటానికి జంకారు. 1994లో జాతుల మధ్య హత్యాకాండ తర్వాత రువాండాను ప్రపంచంలోని పేద దేశాల్లో ఒకటిగా పరిగణించారు. అమెరికా, ఫ్రాన్స్​ లాంటి సంపన్న దేశాలే హెచ్​పీవీ టీకాని తమ ప్రజలందరికీ అందించలేక చేతులెత్తేశాయి. అందువల్ల రువాండా ఈ లక్ష్యాన్ని ఎలా సాధిస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రపంచంలో మహిళలకు సోకే కేన్సర్​​లలో సెర్వికల్​ కేన్సర్​​ది నాలుగో స్థానం. 2018లో 5 లక్షల 70 వేల కొత్త కేసులు నమోదైతే 3 లక్షల 10 వేల మంది చనిపోయారు. వాళ్లలో అధిక శాతం తక్కువ, మధ్య ఆదాయ దేశాల వారే.

వ్యాధి గుర్తింపునకు రొటీన్​ స్ర్కీనింగ్​ నిర్వహించటం, వ్యాక్సిన్​ అందించటంలో సబ్​ సహారన్​ ఆఫ్రికా వెనకబడింది. కేన్సర్​​ సోకిందా లేదా అనేది గుర్తించరు.  అడ్వాన్స్​డ్​ స్టేజ్​కి చేరేదాక ట్రీట్​మెంట్ ఇవ్వరు. 1994 నాటి అంతర్యుద్ధం​లో 8 లక్షల మందికి పైగా చనిపోయారు. రువాండా సర్వనాశనమైంది. అప్పట్లో వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​ రికమండ్​ చేసిన వ్యాక్సిన్లుకూడా అందేవి కావు. రువాండాలో ఒకప్పుడు 25 శాతం దాటని వ్యాక్సినేషన్‌‌‌‌ ఇప్పుడు 95 శాతానికి పెరిగింది.

పోలియో, మీజిల్స్, రూబెల్లా టీకాలను రెగ్యులర్​గా ఇస్తుండటంతో రువాండా ప్రజల సగటు జీవిత కాలం 1995–2011లో పెరిగింది. ఇదే స్ఫూర్తితో హెచ్​పీవీ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రభుత్వం ధీమాగా ముందుకొచ్చింది. జిల్లాల్లోని మెయిన్​ సెంటర్లలో బిల్​ బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. కూల్​ డ్రింక్​లతోపాటు పబ్లిక్​ హెల్త్​ యాడ్స్​ను​ జారీ చేసింది. ‘సెక్స్​ గురించి ఓపెన్​గా మాట్లాడుకోవటంలో తప్పులేదు. దానికి సంబంధించిన మంచీ చెడుల పట్ల పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అది వాళ్ల జీవితాలను కాపాడుతుంది’ అని పేరెంట్స్​ అందరికీ తెలియజేసింది. దేశంలో 93 శాతం మంది అమ్మాయిలకు టీకా వేయించింది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. లక్ష్య సాధనలో  పొలిటికల్​, నేషనల్​ మొబిలైజేషన్​ ఫలితాన్ని ఇచ్చింది. స్కూల్​–బేస్డ్​ ప్రోగ్రామ్​గా చేపట్టడమూ సక్సెస్​కి ఒక కారణం.

సైలెంట్​ కిల్లర్..

దాదాపు అన్ని సెర్వికల్ కేన్సర్​లూ హెచ్​పీవీ వల్లే వస్తాయి. అది కూడా సెక్సువల్​గానే సంక్రమిస్తుంది. హెచ్​పీవీలో 100కి పైగా రకాలు ఉన్నాయి. హెచ్​పీవీ–16, 18 జాతులు 70 శాతం సెర్వికల్​ కేన్సర్​​లకు కారణం. జీవితంలో ఏదో ఒక దశలో ఏదో ఒక రకమైన జెనిటల్​ హెచ్​పీవీ సోకుతుంది. మెజారిటీ కేసుల్లో ఈ వైరస్​ ప్రమాదకరం కాదు. ఎలాంటి సింప్టమ్స్‌‌‌‌నీ చూపించకుండానే దానంతటదే వీక్‌‌‌‌ అయిపోతుంది. హెచ్​పీవీని అదుపు చేసే వ్యాక్సిన్​ను తొలిసారిగా 2006లో తయారుచేశారు. రువాండాలో మొదటిసారిగా 2011లో ప్రవేశపెట్టారు. హెచ్​పీవీ–16, 18 రకాలపై ఎఫెక్టివ్​గా పని చేసే మూడు రకాల టీకాలు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి.  వీటిలో​ గార్డసిల్​–9  అనేది 90 శాతం సెర్వికల్​ కేన్సర్​​లకు కారణమయ్యే 9 రకాల హెచ్​పీవీలను అంతమొందిస్తుంది. కాబట్టి ఈ టీకాను ‘గార్డసిల్​–9’గా వ్యవహరిస్తారు. ఈ వ్యాక్సిన్​కి 2014లో లైసెన్స్​ వచ్చింది.

అందుకే ఇండియా వెనకడుగు…

హెచ్​పీవీ వ్యాక్సిన్​ను సహజంగా అమ్మాయిలకు వేస్తారు. కొన్ని దేశాల్లో 12–13 ఏళ్ల అబ్బాయిలకూ దీన్ని వాడాలని సూచిస్తారు. టీనేజ్‌‌‌‌లోనే హెచ్​పీవీ ఎటాక్​ గురించి హెచ్చరించాలి. ఈ టీకా టీనేజ్‌‌‌‌ సెక్స్‌‌‌‌ని  ఎంకరేజ్​ చేస్తుందనే అపోహలను తొలగించాలి. ఎందుకంటే, ఈ వ్యాక్సిన్​తో సెక్సువల్‌‌‌‌ యాక్టివిటీ పెరుగుతుందనడానికి ఆధారాల్లేవు. అయినా.. హెచ్​పీవీ వ్యాక్సిన్​ వల్ల టీనేజర్ల ఆలోచనలు సెక్స్​ వైపు మళ్లుతాయనే ఆందోళన ఇండియాలోనూ నెలకొంది. మన దేశంలో హెచ్​పీవీ టీకాను ప్రవేశపెట్టకపోవటానికి గల కారణాల్లో ఇదీ ఒకటని అంటున్నారు. ఇండియాలో ఏటా 67 వేల మందికి పైగా ఆడవాళ్లు సెర్వికల్​ కేన్సర్​​తో చనిపోతున్నారు. అయినాగానీ రొటీన్​ ఇమ్యునైజేషన్​ ప్రోగ్రామ్స్​లో హెచ్​పీవీకి ప్రభుత్వం చోటు కల్పించట్లేదు. ఇలాంటి మూఢ నమ్మకాలను పారదోలటంలో రువాండా ముందంజలో ఉంది.