
- ర్యాలంపాడ్ రిజర్వాయర్ రిపేర్ లపై ముందుకు
- రేపు రిజర్వాయర్ పరిశీలనకు పూణే కమిటీ
- 144 కోట్ల ఎస్టిమేషన్ ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్
- కమిటీ నివేదిక ఆధారంగా ఫండ్స్ రిలీజ్ చేసే ఛాన్స్
గద్వాల, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్లపై కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టి సారించింది. ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్లకు పూణే కమిటీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీన పూణే లోని సెంటర్ వాటర్ పవర్ రిసెర్స్ స్టేషన్ కు చెందిన ఐదు మంది సైంటిస్టులు ర్యాలంపాడ్ రిజర్వాయర్ ను సందర్శించనున్నారు.
ఇటీవల ఇరిగేషన్ ఆఫీసర్లు రిపేర్లపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్టిమేషన్లు వేసి నివేదిక పంపించారు. ర్యాలంపాడ్ రిజర్వాయర్ రిపేర్ల కోసం రూ. 144 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం ఎస్టిమేషన్ల ఫైలు ఫైనాన్స్ శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. పూణే కమిటీ వచ్చి ఆఫీసర్లకు నివేదిక ఇచ్చాక ఫండ్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు.
కమిటీ నిర్ణయం మేరకే
సెంటర్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పూణే నుంచి ఐదుగురు సైంటిస్టులు పదో తేదీన ధరూర్ మండల పరిధిలోని ర్యాలంపాడ్ దగ్గర నిర్మించిన రిజర్వాయర్ ను పరిశీలించనున్నారు. ఈ మేరకు వారు లీకేజీలపై, కట్ట రిపేర్లపై ఒక క్లారిటీకి వచ్చి వారిచ్చే నివేదిక ఆధారంగా పనులు చేసేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు పోతుంది.
కట్ట వెడల్పు చేయాలి
కట్ట బలహీనంగా ఉండడంతో దానికి రిపేర్లు చేయాల్సి వస్తుందని ఆఫీసర్లు గుర్తించారు. కట్ట ఎత్తు పెంచడంతోపాటు వెడల్పు చేయాలని నిపుణులు సూచించారు. రివిట్ మెంట్ పై భాగంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించి గ్రౌటింగ్ చేయాలని సూచించారు. దీనికి రూ. 144 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఆ ఫైల్ ఫైనాన్స్ శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. పూణే కమిటీ నిర్ణయం ఇచ్చాక ఏ పనులు చేస్తారని దానిపై ఒక క్లారిటీకి వచ్చి ఫండ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.
నెట్టెంపాడు రైతులకు శాపం
ర్యాలంపాడు రిజర్వాయర్‌కి ఐదేళ్ల క్రితం బుంగలుపడి లీకేజీ అవుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతన్నలకు శాపంగా మారింది. సర్వేలు, రిటైర్డ్ ఇంజనీర్ల బృందం తనిఖీల పేరుతో కాలయాపన చేశారే తప్ప రిపేర్లు చేయకపోవడంతో నాలుగేళ్ల నుంచి సగం ఆయకట్టుకే నీరు అందుతుంది. గతంలో సర్వే చేసి ఏండ్లు గడిచినా ఇప్పటివరకు సర్వే రిపోర్ట్ బయటపెట్టని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులో 80 శాతం పనులు కంప్లీట్ చేశారు. 20 శాతం పనులు మిగిలాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం నెట్టెంపాడు లిఫ్టులోని మిగిలి ఉన్న పనులను కంప్లీట్ చేయలేదు.
ఈ క్రమంలోనే 2019లో నెట్టెంపాడు పరిధిలోని ర్యాలంపాడు రిజర్వాయర్ కి బుంగలు పడడంతో పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలోనే రిపేర్లు చేసి ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదని రైతులు వాపోతున్నారు. రైతుల ఆందోళనతో మూడేళ్ల క్రితం సర్వే చేసినా రిపేర్లు మాత్రం చేపట్టడం లేదు. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 4 టీఎంసీలు కాగా.. ఒక టీఎంసీ డెడ్‌స్టోరేజీకి పోయినా మూడు టీఎంసీలు వాడుకునే అవకాశం ఉండేది. రిపేర్లు చేయకపోవడంతో రెండు టీఎంసీలకే పరిమితం అయిపోయింది. దీంతో రైతులకు శాపంగా మారింది.
2019లో సీపేజీ గుర్తించినా..
కృష్ణ బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోసే విధంగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేశారు. అందులో భాగంగా ర్యాలంపాడు, గుడ్డందొడ్డి, ముచ్చోనిపల్లి, సంగాల, నాగర్ దొడ్డి రిజర్వాయర్లను నిర్మించారు. మొత్తం 10 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవాల్సి ఉంది. నెట్టెంపాడు లిఫ్టులోని ర్యాలంపాడు రిజర్వాయర్ అతి పెద్దది. ఈ రిజర్వాయర్ లో నాలుగు టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంపై అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు ముందు నుంచి వివక్ష చూపుతూ వచ్చింది.
కనీసం మెయింటెనెన్స్ కి డబ్బులు ఇవ్వకపోవడంతో రిజర్వాయర్లు, కెనాల్స్ దెబ్బతిన్నాయి. ర్యాలంపాడు రిజర్వాయర్ కట్ట నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయని 2019లోనే గుర్తించారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీపేజీ మరింత పెరిగింది. రైతులు నిరసనలు చేయడంతో 2021లో రిటైర్డ్ ఇంజనీర్ల బృందం రిజర్వాయర్‌ను పరిశీలించింది. పూర్తి స్థాయిలో నింపితే కట్టకు ప్రమాదం అని చెప్పి సామర్థ్యాన్ని సగానికి తగ్గించారు. దీంతో మూడేళ్ల నుంచి రెండు టీఎంసీల నీటినేనింపుతున్నారు.
పూణే కమిటీ వస్తుంది..
ర్యాలంపాడ్ రిజర్వాయర్ రిపేర్లపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. పూణే కమిటీ నిర్ణయం మేరకే ముందుకు వెళ్లేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిపేర్ల కోసం రూ. 144 కోట్లు నిధులు అవసరమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ ఫైలు ఫైనాన్స్ శాఖ వద్ద పెండింగ్ లో ఉంది.- రహీముద్దీన్ ఎస్ సి జూరాల ప్రాజెక్టు గద్వాల