Champions Trophy 2025: దంచికొట్టిన సఫారీలు.. ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యం

Champions Trophy 2025: దంచికొట్టిన సఫారీలు.. ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యం

ఛాంపియన్స్ ట్రోఫీని సౌతాఫ్రికా గ్రాండ్ గా ప్రారంభించింది. కరాచీ నేషనల్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటింగ్ లో దుమ్ములేపింది. ఆఫ్గన్ బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(103: 106 బంతుల్లో.. 7 ఫోర్లు, సిక్సర్) సెంచరీతో పాటు కెప్టెన్ బవుమా(58), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(52),ఐడెన్ మార్క్రామ్(52) హాఫ్ సెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఆరంభంలోనే ఆ జట్టు వికెట్ కోల్పోయింది. టోనీ డి జోర్జీ 11 పరుగులు చేసి నబీ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ ఓపెనర్ రికెల్టన్, బవుమా ఇన్నింగ్స్ ను ముందు తీసుకెళ్లారు. ఆఫ్గన్ బౌలర్లను ఈజీగా ఆడిస్తూ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండో వికెట్ కు ఏకంగా 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోర్ కు బాటలు వేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 

హాఫ్ సెంచరీ తర్వాత బవుమా(58) ఔటైనా.. వాన్ డెర్ డస్సెన్ సహకారంతో రికెల్టన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిల్లర్ విఫలమైనా డస్సెన్, మార్కరం హాఫ్ సెంచరీలతో సౌతాఫ్రికా స్కోర్ బోర్డును 300 పరుగులు దాటించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫరూఖీ, ఓమర్జాయ్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.