IND vs NZ: గిల్‌ రీ ఎంట్రీ కంఫర్మ్.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు: భారత అసిస్టెంట్ కోచ్

IND vs NZ: గిల్‌ రీ ఎంట్రీ కంఫర్మ్.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు: భారత అసిస్టెంట్ కోచ్

గాయం కారణంగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు దూరమైన శుభమాన్ గిల్ ఫిట్‌గా ఉన్నట్లు భారత అసిస్టెంట్ కోచ్‌ ర్యాన్‌ డెస్కాటే స్పష్టం చేశారు. అతని రాకతో తుదిజట్టులో చోటు కోసం తీవ్ర పోటీ నెలకొందని డెస్కాటే వెల్లడించారు. కేఎల్ రాహుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌లలో ఒకరిని తప్పించడం అనివార్యమవుతుందని పేర్కొన్నారు. కాగా, మెడ కండరాలు పట్టేయడంతో గిల్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. 

సర్ఫరాజ్‌‌పై వేటు..

కేఎల్ రాహుల్‌ ప్రదర్శనపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని, అతడి ఫామ్‌ గురించి కూడా ఎలాంటి బెంగ లేదని ర్యాన్‌ డెస్కాటే స్పష్టం చేశారు. రాహుల్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కోచ్ గౌతం గంభీర్‌ భావిస్తున్నారని తెలిపారు. ఈ మాటలను బట్టు వేటు పడేది సర్ఫరాజ్‌‌పైనే అని స్పష్టమవుతోంది. అదే జరిగితే, యువ క్రికెటర్‌కు అన్యాయం జరిగినట్టే.

ALSO READ | Prithvi Shaw: తప్పించినందుకు థాంక్స్.. ముంబై అసోసియేషన్‌పై పృథ్వీ షా సెటైర్లు

తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. మ్యాచ్‌ను నాలుగు రోజుల వరకు తీసుకెళ్లింది అంటే, అందుకు ప్రధాన కారణం.. సర్ఫరాజ్‌. రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్‌కు ప్రాణం పోసి.. ఘోర ఓటమి నుంచి గట్టెక్కించాడు. అదే సమయంలో రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‪లో 6 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవియన్ చేరిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లోనూ 12 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఈ ఇద్దరిలో ఎవరిని తప్పిస్తారనేది రెండు రోజులు ఆగితే కానీ, తెలియదు. సర్ఫరాజ్‌‌పై వేటు సరైనది కాదనేది విశ్లేషకుల మాట. 

పంత్ ఫిట్.. 

అదే సమయంలో బెంగళూరు టెస్టులో కీపింగ్‌ చేస్తూ గాయపడ్డ రిషభ్‌ పంత్‌ సైతం ఫిట్‌గా ఉన్నట్లు డెస్కాటే తెలిపాడు. మొదటి టెస్టుతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌ జరుగుతున్నప్పుడు పంత్ వికెట్‌కీపింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే.

కాగా, తొలి టెస్టులో ఓడిన భారత్.. చివరి రెండు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్ చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ ఇరు జట్ల మధ్య అక్టోబర్ 24 నుంచి పూణే వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.