బీఆర్ఎస్ హయాంలో కబ్జా భూములకూ రైతుబంధు

బీఆర్ఎస్ హయాంలో కబ్జా భూములకూ రైతుబంధు
  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో కబ్జా భూములకు కూడా రైతుబంధు వేశారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆరోపించారు. ఫామ్ హౌస్​లు ఉన్నోళ్లకు రైతుబంధు ఎందుకని ప్రశ్నించారు. అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్​ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం అసెంబ్లీలో  ఆయన మాట్లాడారు. " గత బీఆర్ఎస్ సర్కారు పంటల బీమాను అమలు చేయలేదు. 

దానివల్ల రైతులకు పంట నష్ట పరిహారం అందలేదు. పంటల బీమాను మా ప్రభుత్వం మళ్లీ అమలు చేస్తుంది. రేషన్​షాపుల ద్వారా సన్న బియ్యాన్ని ఇచ్చే ఏర్పాటు చేయాలని సీఎంను కోరుతున్నా. భూపాలపల్లి జిల్లాలో మోరంచపల్లివాగు ఉధృతికి నిరుడు 126 చెరువులు తెగిపోయాయి. చాలా మంది చనిపోయారు. ఇందిరాసాగర్​, మోరంచపల్లి లిఫ్ట్, రోడ్లు డ్యామేజ్​అయ్యాయి.  కేంద్ర ప్రభుత్వం, గత బీఆర్ఎస్​ సర్కార్ ఒక్క​రూపాయి కూడా సాయం చేయలేదు.

రూ.250 కోట్లుతో రామప్ప నుంచి డీబీ 4 లింక్​ కలిపి ఉంటే నాలుగు మండలాల్లోని 40 వేల ఎకరాలకు నీళ్లు అందేవి. పోడు భూములు గతంలో ఇచ్చినోళ్లకే ఇచ్చారు. నిజమైన లబ్ధిదారులకు పోడు హక్కులను కల్పించాలి. మేం హామీలన్నింటినీ అమలు చేస్తం" అని సత్యనారాయణ పేర్కొన్నారు.