సాగు యోగ్యం కాని భూముల లెక్కలు తేలినయ్

సాగు యోగ్యం కాని  భూముల లెక్కలు తేలినయ్
  • సాగుచేయని 13,128 ఎకరాలకు గతంలో రైతుబంధు 
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వేలో బహిర్గతం
  • బండరాళ్లు, వెంచర్లు, లే అవుట్లుగా మారిన భూములు 
  • వాటికి ఐదేళ్లలో రూ.65.64 కోట్లు జమ
  • గ్రామ సభల్లో ప్రదర్శించి ఆమోదం తెలుపనున్న అధికారులు 

రాళ్లురప్పలు, ముళ్ల పొదలుగా కనిపిస్తున్న ఈ భూమి జైనథ్ మండలంలోని ముక్తాపూర్ గ్రామంలోనిది. సాగుకు పనికిరానికి ఈ భూమి దాదాపు 12 ఎకరాలు ఉన్నట్లు అధికారులు సర్వేలో గుర్తించారు. కానీ కొన్నేండ్లుగా 
ఈ 12 ఎకరాలకు రైతుబంధు చెల్లిస్తున్నారు. ఇలా ఇదొక్కటే కాదు చాలా చోట్ల బండరాళ్లు, భవనాలు, లే అవుట్లుగా ఉన్న భూములను అధికారులు గుర్తించారు.

ఆదిలాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం పేరుతో ఏడాదికి రెండుసార్లు ఎకరానికి రూ.5 వేలు అందజేసింది. ధరణి పోర్టల్ ఆధారంగా అందులో ఉన్న పట్టా ఉన్న భూములన్నింటికీ ఈ పథకాలను వర్తింపజేసింది. అయితే పట్టాలు ఉన్న భూములు సాగుకు యోగ్యంగా ఉన్నాయా.. సాగుకు అనువైన భూముల్లో ఏమైనా లేఅవుట్లు, ఇతర వ్యాపారాలు చేస్తున్నారా? అని వివరాలేం తీసుకోకుండానే ఇన్నేళ్లుగా రైతుబంధు అందజేసింది. 

అయితే సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం అందించాలని కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. లేఅవుట్లుగా మారిన భూములు, రాళ్లు, రప్పలు, గోదాములు, ఇటుక బట్టీలు, సాగుకు పనికి రాకుండా ఉన్న పడావ్ భూములకు, రోడ్లుగా మారిన వాటికి సైతం రైతుబంధు చెల్లిస్తున్నట్లు తేలింది.  

విస్తుపోతున్న ప్రజలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా అధికారులు నిర్వహించిన సర్వేలో 13,128 ఎకరాలను సాగుకు యోగ్యంగా లేని భూములుగా గుర్తించారు. దాదాపు రూ.65 కోట్లు సాగుకు యోగ్యంగా లేని భూములకు రైతుబంధు జమచేసినట్లు తేలింది. ఇన్నేళ్లుగా సాగులో లేని వ్యవసాయ భూములకు రైతుబంధు ఇవ్వడం పట్ల ప్రజలు విస్తుపోతున్నారు. 

వ్యవసాయ భూములు సాగులో లేకుండా లే అవుట్లకు, వెంచర్లు, ఇతర వ్యాపారాల కోసం వినియోగించాలంటే నాలా పర్మిషన్ తప్పనిసరి. అప్పుడు ఆ భూమి ధరణి పోర్టల్​లో వ్యవసాయేతర భూమిగా రిజిస్టర్ అవుతుంది. దీంతో పెట్టుబడి సాయం ఆగిపోతుంది. కానీ నాలా అనుమతి లేకుండా వ్యవసాయ భూముల్లో లే అవుట్లు, వెంచర్లు, వ్యాపారాల సముదాయాలు ఏర్పాటు చేసుకున్నారు. సాగులో లేకున్నప్పటికీ రైతుబంధు పొందారు. 

అందరిముందు ప్రదర్శిస్తాం..

రైతు భరోసా పథకం అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు సర్వే నిర్వహించాం. జిల్లాలో 3028 ఎకరాలు భూములు సాగుకు యోగ్యంగా లేవని తేలింది. వీటికి కూడా రైతు బంధు వస్తోంది. గ్రామ సభల్లో ఈ పనికిరాని భూములను అందరి ముందు ప్రదర్శిస్తాం. సాగుకు యోగ్యంగా లేనివాటికి రైతు భరోసా వర్తించదు.  - శ్రీధర్ స్వామి, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్, ఆదిలాబాద్

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ సాగు వివరాలు

జిల్లా    సాగులో ఉన్న ఎకరాలు    సాగుకు యోగ్యం కానివి 

ఆదిలాబాద్             5.15 లక్షలు                   3028
మంచిర్యాల            3.80 లక్షలు                   3700
నిర్మల్                     4.50 లక్షలు                   4900
ఆసిఫాబాద్              4.60 లక్షలు                  1500