4 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి.. ఇప్పటివరకు 54.74 లక్షల మంది రైతులకు లబ్ధి

4 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి.. ఇప్పటివరకు 54.74 లక్షల మంది రైతులకు లబ్ధి
  • మంగళవారం లక్ష మంది రైతులకు రూ.199 కోట్లు జమ 
  • మరో రెండు రోజుల్లో 5 ఎకరాల వరకు పెట్టుబడి సాయం 
  • 77.78 లక్షల ఎకరాలకు నిధులు జమ 
  • మొత్తం 71శాతం మందికి రైతు భరోసా కంప్లీట్ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధుల విడుదల పూర్తయింది. మంగళవారం 3.33 లక్షల ఎకరాలకు గాను 1.06 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.199.99 కోట్ల నిధులను సర్కారు జమ చేసింది. దీంతో రైతు భరోసా అమలు ప్రారంభమైనప్పటి నుంచి మంగళవారం వరకు 77.78 లక్షల ఎకరాలకు గాను 54.74 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,666.60 కోట్ల మేరకు నిధులు జమ అయ్యాయి.

రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. సీజన్‌‌కు రూ.6 వేల చొప్పున రెండు సీజన్లు కలిపి ఎకరాకు రూ.12 వేలు రైతులకు సాయం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు యాసంగి సీజన్‌‌కు సంబంధించి ఎకరాకు రూ.6 వేల చొప్పున గత జనవరి 27 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. ఈ నెలాఖరుకల్లా 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. 

71 శాతం మందికి నిధులు జమ.. 

రైతు భరోసా కింద ఇప్పటివరకూ 4 ఎకరాల వరకు నిధుల విడుదల పూర్తయింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 71 శాతం మంది రైతులకు రైతు భరోసా సాయం అందినట్టయింది. రెవెన్యూ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 77 లక్షల మంది రైతు భరోసా లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పటివరకూ 54.74 లక్షల మందికి పెట్టుబడి సాయం అందగా.. ఇంకా దాదాపు 22 లక్షల మంది రైతులకు నిధులు జమకావాల్సి ఉన్నది. కాగా, రైతు భరోసా కింద ఇప్పటివరకు అత్యధికంగా నల్లగొండ జిల్లాకు రూ.335.50 కోట్లు రిలీజ్ అయ్యాయి. 

ఆ తర్వాత అత్యధికంగా సంగారెడ్డికి రూ.230.06 కోట్లు, కామారెడ్డికి రూ.217.26 కోట్లు, ఖమ్మం జిల్లాకు రూ. 216.91 కోట్లు, నిజామాబాద్​కు రూ.211.11 కోట్లు, నాగర్ కర్నూల్ కు 203.38 కోట్లు, సిద్దిపేటకు రూ.199.98 కోట్లు, సూర్యాపేటకు రూ.197.61 కోట్లు, వికారాబాద్ కు రూ.172.02 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.163.99 కోట్ల చొప్పున నిధులు విడుదలయ్యాయి.