రైతుల అభిప్రాయం మేరకే రైతుభరోసా గైడ్​లైన్స్​

రైతుల అభిప్రాయం మేరకే  రైతుభరోసా గైడ్​లైన్స్​
  •      రైతులు చెప్పిన ప్రతి అంశాన్ని  అసెంబ్లీలో చర్చిస్తాం
  •     రైతు భరోసాతో పాటు  ఇన్​పుట్​ సబ్సిడీ  అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం
  •     ‘రైతు భరోసా’ అభిప్రాయ సేకరణలో  కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి 

హనుమకొండ, వెలుగు: పెట్టుబడి సాయంపై రైతుల అభిప్రాయమే రైతు భరోసా జీవోగా రాబోతోందని కేబినెట్ సబ్​కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొండలు, గుట్టలు, రియల్ ​ఎస్టేట్​వెంచర్లు, ఫామ్​హౌస్​లకు రైతుబంధు పేరున కోట్లాది రూపాయలు చెల్లించినట్లు ఆడిట్​శాఖ, నిఘా వర్గాలు చెబుతున్నాయని, వీటిపై ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

‘రైతు భరోసా’ పథకం విధివిధానాలపై ఉమ్మడి వరంగల్​జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో వరంగల్ కలెక్టర్​ సత్య శారదాదేవి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. దీనికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్​ఛార్జ్​ మంత్రి, రెవెన్యూ, హౌసింగ్, పౌర సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వానికి కట్టే పన్నుల నుంచి వచ్చే ఆదాయం కాబట్టి తామంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నామన్నారు. జిల్లాల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి శాసనసభలో చర్చకు పెడతామని, సభలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రైతు భరోసాతో పాటు ఇన్​పుట్​సబ్సిడీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని, తొందర్లోనే చారిత్రక నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కౌలు రైతుల సమస్యలపైనా ఒపీనియన్స్ సేకరించామని, చర్చ జరిపి దానిపైనా డెసిషన్​ తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

తొందర్లోనే  పంటలకు నష్ట పరిహారం

రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే సంకల్పంతో ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసా కింద ఇప్పటికే రూ.7,562 కోట్లు జమ చేశామని, రైతుబంధు అవకతవకల నేపథ్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగితే ఎలాంటి పరిహారం రాకపోయేదని, కానీ, ఇకపై పంట నష్టపోతే బీమా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.

 ఇప్పటికే ఇన్య్సూరెన్స్ ​కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధుకు కటాఫ్ ​నిర్ణయించాలని, లేదంటే భూస్వాములకు లక్షలు చేరి, చిన్న, సన్న కారు రైతులకు లబ్ధి చేకూరదని 

చెప్పానని మంత్రి కొండా సురేఖ అన్నారు. కానీ, గత బీఆర్​ఎస్​ సర్కారు పట్టించుకోకపోవడం వల్ల భారీగా ప్రజాధనం వృథా కావడమే కాకుండా, అర్హులైన  రైతులకు అన్యాయం జరిగిందన్నారు. పశువులకు కూడా ఇన్య్సూరెన్స్​ చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నామన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం పంటకు  కాకుండా పట్టాకు పెట్టుబడి సాయం ఇచ్చిందన్నారు. సాగు భూములు, అర్హులైన రైతులకు మాత్రం సాయం దక్కలేదన్నారు.  

పాన్​కార్డు ఉంటే రైతు భరోసా ఇవ్వరనేది  తప్పుడు ప్రచారం : మంత్రి పొంగులేటి 

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు రైతులు, నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొడుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆరోపించారు. పాన్​కార్డు ఉన్న  రైతులకు రైతు భరోసా ఇవ్వరని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ లేదన్నారు. పంట మీద వచ్చిన ఆదాయానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదని, ఫామ్​హౌస్​లో కూర్చుని కోట్లు సంపాదిస్తున్న వారికి రైతు భరోసా ఇవ్వాలా.. వద్దా అనేదానిపైనే అభిప్రాయం సేకరిస్తున్నామన్నారు. 

రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారని, అప్పులను సాకుగా చూపి హామీల అమలులో వెనకడుగు వేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు నడుస్తున్నామన్నారు.

సాగు భూములకే  రైతుభరోసా ఇవ్వాలి

రైతు భరోసా పథకంపై విస్తృతస్థాయి సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 250 మంది వరకు రైతులు హాజరవగా, వారి అభిప్రాయాలను కేబినెట్ సబ్ ​కమిటీ మెంబర్స్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా వర్తింపజేయాలని కోరారు. గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుబంధు పేరున దోచుకున్నారని, పెట్టుబడి సాయాన్ని పది ఎకరాల్లోపు వారికే  పరిమితం చేయాలన్నారు. 

చిన్నచిన్న ఉద్యోగులు కొద్దో గొప్పో భూమి కొనుక్కుని ఉంటారని, వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సాగు చేసే రైతులకు గత ప్రభుత్వం ఎత్తివేసిన సబ్సిడీలను మళ్లీ ఇవ్వాలన్నారు. దీంతో వారి అభిప్రాయాలు సేకరించిన కేబినెట్ సబ్​ కమిటీ శాసనసభలో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.