మన దేశం వ్యవసాయిక దేశం. ప్రపంచంలో మరే దేశానికి లేని ఘన, చారిత్రక విశిష్టత మన వ్యవసాయంతో ముడిపడి ఉంది. వేల సంవత్సరాలుగా సాగు చేయడమే ప్రధాన వృత్తిగా విరాజిల్లుతున్న మన వ్యవసాయరంగ చరిత్రలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మక పథకం ప్రవేశపెట్టింది తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం. ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చింది ప్రజా ప్రభుత్వం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం మట్టికి ఆత్మగౌరవాన్ని దిద్దింది, మట్టిని నమ్ముకున్న మనిషికి ఆత్మీయ భరోసాన్నిచ్చి గుర్తించింది. గణతంత్ర భారతం సగర్వంగా డైమండ్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్నవేళ సంవత్సరానికి 12వేల రూపాయల్ని అందిస్తూ రైతు కూలీల సంక్షేమంలో సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం.
భూమి అంటేనే ఆత్మగౌరవం. అందుకే భూమి కోసం భుక్తి కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. తెలంగాణ అంటేనే గుర్తుకొచ్చే సాయుధ రైతాంగ పోరాటం, పటేల్, పట్వారీ వ్యవస్థలపై తిరగబడ్డ ఇక్కడి మట్టిబిడ్డల పోరాటాలు అన్నీ భూమిని అల్లుకునే జరిగాయి. 1960వ దశకంలో జరిగిన కార్వాన్ రైతు కూలీల పోరాటం, కొండవీడు పోరాటాలు, వరంగల్ కూలీ పెంపు ఉద్యమాలు అన్నీ రైతు కూలీల కోసమే జరిగాయి. తెలంగాణలో నాడు కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్న భూమి తదనంతరం ఇలాంటి ఉద్యమాల వల్లనే సామాన్యుల చేతుల్లోకి కొంత చేరింది. అయినప్పటికీ ఇక్కడ రైతు కూలీల సంఖ్య అధికంగానే ఉంది. భూ యజమానులు, మార్కెట్ శక్తుల గుత్తాధిపత్యంతో కూలీ నాలీ చేసుకునే రైతుబిడ్డలకు అరకొరగానే కూలి దక్కేది. దశాబ్దాల పాటు ఈ అణచివేత కొనసాగుతూనే వచ్చింది. వ్యవసాయం లాభసాటిగా ఉన్నా.. లేకున్నా.. రైతు కూలీలు మాత్రం శ్రమదోపిడీకి గురవుతూనే ఉండేవారు. ఇది గత చరిత్ర. స్వాతంత్ర్య భారతంలో నాటి ప్రభుత్వాలు ఇలాంటి రైతు కూలీల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వచ్చాయి,
కాంగ్రెస్ పాలనల్లో గీటురాళ్లు
ముఖ్యంగా నాడు భూస్వాముల చేతుల్లో చిక్కిన వేల ఎకరాల భూముల్ని లాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి పేదలకు పంచింది కూడా ఇందిరమ్మ పాలనలోనే.. అందుకే గరీబీ హటావో అని ఆమె చేసిన నినాదం, లక్షలాది మంది కూలీలను భూ యజమానులుగా చేసింది. ఆ తర్వాత ఈ మధ్యనే పరమపదించిన దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం వరకూ ఆ సంస్కరణలు కొనసాగాయి. రైతు కూలీల సంక్షేమంలో ఇవి గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు. దాదాపు తొంబై కోట్ల గ్రామీణ కూలీ కుటుంబాలకు వంద రోజుల ఖచ్చితమైన పనిని ఇవ్వడమే కాకుండా అప్పటివరకూ పెత్తం
దారుల చేతుల్లోనే ఉంటూ వస్తున్న కూలీ ధరలు సైతం ఖచ్చితంగా పెంచే స్థితిని తీసుకొచ్చి భారత గ్రామీణ ముఖచిత్రాన్నే మార్చివేసింది. ఇప్పుడు మళ్లీ అదే కాంగ్రెస్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని తీసుకొచ్చింది.
ఇంతవరకూ భూమిలేని రైతుల గురించి ఎవరైనా ఆలోచన చేశారా? భూమి అంటేనే ఆత్మగౌరవం అనే దేశంలో మరి ఆ భూమిలేని రైతులకు, రైతు కూలీలకు ఆత్మగౌరవం ఎలా కల్పించాలని మదన పడి తీసుకొచ్చిన పథకమే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం. రైతు కూలీల గురించి ఆలోచించిన ప్రభుత్వమే రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వం. నాటి గ్రామీణ ఉపాధి హామీ ఎలాగైతే కూలీల కడుపునింపు వారికి జీవన భద్రతను కలిగించిందో.. నేటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం సైతం రైతు కూలీలను సగర్వంగా గుర్తించి వారికి భూమితో, వ్యవసాయంతో ఉన్న అనుబంధానికి అధికారిక గుర్తింపుగా నిలుస్తుంది, అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి ప్రకోపంతో అల్లాడే రైతు వద్ద కూలీల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియంది కాదు. వారికి ఆత్మీయ భరోసా రూ.12వేల ఆర్థిక భరోసాగా నిలిచి వారిలో ధైర్యాన్ని నింపుతుంది. ప్రభుత్వానికి ఒక నిరుపేద మీద సానుభూతి ఉంటే ఎలాంటి పథకాలు రూపుదిద్దుకుంటాయో చెప్పడానికి ఈ ఒక్క పథకం చాలు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన దగ్గరి నుంచి ఇలాంటి పథకాలకే ప్రాణం పోస్తోంది. మేనిపెస్టోలో హామీలను పెట్టేటప్పుడే వాటి ప్రయోజనాల్ని ఖచ్చితంగా అంచనా వేసుకొని రూపొందించింది.
రైతు కూలీ చరిత్రలో ఇదొక మైలురాయి
రేవంత్ రెడ్డికి నమస్సుమాంజలి. ఒక సన్న, చిన్నకారు రైతు కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి ఎందరికో రైతు కూలీల అగచాట్లు తెలుసు. వారి వెతలు తెలుసు. ఒకనాడు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయన్న వలసల ముఖచిత్రంలో ఉన్నది కూడా భూమిలేని రైతు కూలీలే. ఇంతవరకూ వారికి ప్రత్యక్ష గుర్తింపునిచ్చే ఒక్క పథకం కూడా లేదన్న వెలితిని బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల వేడుకల వేళ తీరిపోవడం మరింత ఆనందాన్నిస్తుంది. ఏ పని చేసినా రంధ్రాన్వేషణ చేయడం అనేది ఎప్పుడైనా ఎంతో కొంత ఉంటుంది. దాని పర్యవసానాల జోలికి పోవడం, దానిపై మనదైన వ్యాఖ్య చేయడం కాదు.మనసున్న మనుషులుగా తరతరాలుగా కుల, మత, జాతి అనే సంబంధం లేకుండా అనేక రకాల దోపిడీకి గురైన రైతు కూలీల సంక్షేమం కోసం నేడు పడ్డ ఈ అడుగు.. ప్రవాహ ఒరవడి దాల్చాలి. జనవరి 26 నుంచి రైతు కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అమలుకాబోతున్నది. అందుకు తెలంగాణలోని ప్రతి రైతు కూలీ ఆత్మవిశ్వాసంతో, గౌరవంగా బతికే రోజులు వచ్చాయని గుర్తుచేసుకుంటూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలి. రైతు కూలీని ఆదుకునే పథకం ఏనాడూ లేదు. మొదటిసారి రేవంత్రెడ్డి ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో ఒక పథకం తెచ్చింది. రైతు కూలీ చరిత్రలో ఈ పథకం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
ప్రాధాన్యతల ఆధారంగానే పథకాలు
అత్యంత నిరుపేదకు, సామాన్య గృహిణికి, రైతు కూలీకి లబ్ధి చేకూర్చే వాటినే తమ ప్రాథమ్యాంశాలుగా నిర్ణయించుకొని అమలు చేయడం హర్షణీయం. అందుకు నిదర్శనమే అధికారం చేపట్టిన 48గంటల్లోపే తెలంగాణ ఆడపడుచులకు, ఇంకా చెప్పాలంటే ప్రగతి రథచక్రమైన ఆర్టీసీ బస్సుల్లో తిరిగి తమ రోజువారీ జీవనాన్ని కొనసాగించే మధ్యతరగతి, పేద వర్గాలకు లబ్ధి చేకూర్చే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. ఆ వెనువెంటనే వారికి మరింత ఉపశమనం కలిగేలా వైద్య ఖర్చులకు రూ.10లక్షల బీమాను అందించింది, ఆ పరంపర కొనసాగింపే 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500కే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు వంటివి. వీటన్నింటిలో కనబడుతుంది కేవలం మధ్యతరగతి, దారిద్ర్యరేఖకు దిగువన ఉండే కుటుంబాల కష్టమే. గత ప్రభుత్వం ఎంత సేపూ నడిపిన ఓట్ల తాయిలాల పథకాలవలె కాకుండా.. సగటు పేద, మధ్యతరగతి కుటుంబాల కనీస అవసరాలు తీర్చే సంక్షేమ పథకాలని చెప్పొచ్చు. పథకాల ప్రాధాన్యతను గుర్తించి అమలు చేసినపుడే, అది సంక్షేమ పాలన అనిపించుకుంటుంది.
- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,
సీఈవో,
టిసాట్ నెట్వర్క్