సర్వేలో బయటపడ్తున్న రైతుబంధు అక్రమాలు

  • గతంలో వెంచర్లు, గుట్టలు, బంక్​లు, పౌల్ట్రీ ఫామ్​లకూ రైతుబంధు
  • గ్రానైట్ క్వారీలు, ఇటుకబట్టీలు, రైస్​ మిల్లులకు కూడా..
  • రైతు భరోసా సర్వేతో తేలుతున్న అనర్హుల జాబితా 
  • ఇప్పటి వరకు 3,168 ఎకరాలు గుర్తింపు 

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే కొనసాగుతోంది. ఉన్నతాధికారులు నిర్ణయించిన ప్రకారం  ఈనెల 20లోపు ఫీల్డ్ వర్క్​కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా పథకం కోసం సాగు యోగ్యం కాని భూములను గుర్తించే పనిలో సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో 3,168 ఎకరాలు సాగులో లేవని తేల్చారు.

 రియల్ ఎస్టేట్ వెంచర్లు, మట్టి గుట్టలు, పెట్రోల్ బంక్​లు, పౌల్ట్రీ ఫామ్​లు, గ్రానైట్ క్వారీలు, ఇటుకబట్టీలు, రైస్​ మిల్లులు, జిన్నింగ్ మిల్లులతో పాటు కాల్వల కింద ప్రభుత్వం సేకరించిన భూములకు కూడా ఇన్నేళ్లుగా రైతు బంధు నిధులు అందినట్టు గుర్తించారు. ఖమ్మం నగరం చుట్టు పక్కన ఉన్న మండలాల్లోనే ఇలాంటి సాగులో లేని భూములు ఎక్కువగా ఉన్నాయని అధికారులు 
చెబుతున్నారు. సర్వే పూర్తయితే మొత్తం రైతు భరోసా కింద సాగు యోగ్యమైన భూముల లెక్క తేలనుంది.

1,077 టీమ్​ల ఏర్పాటు.. 

ఖమ్మం జిల్లాలో మొత్తం 379 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో నాలుగు స్కీమ్​ల సర్వే కోసం 1,077 టీమ్​లను ఏర్పాటు  చేశారు. ఇందులో గ్రామ స్థాయిలో ఏఈవో, ఆర్ఐలు, గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల ద్వారా వెంచర్లుగా మారిన భూములు, వివిధ ప్రాజెక్టులు, రోడ్లు, కాల్వల కోసం సేకరించిన భూములను గుర్తిస్తున్నారు. ఇలా వ్యవసాయం చేయకుండా ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్న భూములను గుర్తించి, వాటిని అనర్హుల జాబితాలో చేరుస్తున్నారు. 

ALSO READ : పల్లె పోరుకు అంతా సిద్ధం.. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా పోటీకి రెడీ అంటున్న ఆశావహులు

ఈనెల 20లోపు సర్వే పూర్తి చేసి, 21 నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు. వాటిలో అన్ని స్కీమ్​ లకు అర్హులు, అనర్హుల జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. గతేడాది వరకు జిల్లాలో 3,29,982 మంది రైతులకు చెందిన దాదాపు 7.30 లక్షల ఎకరాల భూమికి గాను రూ.362.94 కోట్లు రైతుబంధు పంపిణీ చేశారు. శనివారం సాయంత్రం వరకు 281 రెవెన్యూ గ్రామాల్లో రైతు భరోసా సర్వే పూర్తి కాగా, వాటిలో 3,168 ఎకరాల్లో సాగు జరగడం లేదని గుర్తించారు. ఇందులో ఎక్కువగా రియల్​ఎస్టేట్​గా వెంచర్లుగా మారిన భూములున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో మిగిలిన గ్రామాల్లోనూ సర్వే పూర్తయితే ఈ సంఖ్య మరింత పెరిగే చాన్సుంది.