మంచిర్యాల జిల్లాలో అక్రమ పట్టాలకు రైతుబంధు

మంచిర్యాల జిల్లాలో అక్రమ పట్టాలకు రైతుబంధు
  •     ధరణిలో 600 ఎకరాల సర్కారు భూముల ఎంట్రీ 
  •     ఏటా రూ.60 లక్షలు తీసుకుంటున్న అక్రమార్కులు
  •     అక్రమమని తేల్చినా రైతుబంధు మాత్రం ఆగట్లే
  •     నెన్నెల మండలంలో వేల ఎకరాలకు ఇల్లీగల్ పట్టాలు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు పరులపాలయ్యాయి. కొంతమంది ఖాళీ జాగలను కబ్జా చేసి లీడర్లు, బ్రోకర్లు, రెవెన్యూ అధికారుల సహకారంతో పట్టాలు చేసుకున్నారు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో రికార్డులు చెక్ చేయకుండానే అధికారులు వాటిని ధరణి పోర్టల్​లో నమోదు చేశారు. తర్వాత 2020–21లో మరికొన్ని సర్వే నంబర్లను ఎంట్రీ చేశారు. 

ఫలితంగా సుమారు 600 ఎకరాలకు రైతుబంధు కింద ఏటా రూ.60 లక్షలు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయి. అధికారుల ఎంక్వైరీలో అక్రమ పట్టాలుగా తేల్చినప్పటికీ, వారికి రైతుబంధు మాత్రం ఆగలేదు. రెవెన్యూ అధికారులు పట్టాలను రద్దు చేయకపోవడంతో గత రెండేండ్లుగా రైతుబంధు అందుకోవడమే కాకుండా బ్యాంకుల్లో క్రాప్​లోన్లు కూడా తీసుకుంటున్నారు. కొందరి పేర్లను ధరణి నుంచి డిలీట్ చేసినప్పటికీ కబ్జాలో మాత్రం వాళ్లే కొనసాగుతున్నారు. సదరు భూములను స్వాధీనం చేసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  

1070 ఎకరాలకు ఇల్లీగల్ పట్టాలు ఇచ్చారని ఫిర్యాదు

నెన్నెల మండల కేంద్రంతో పాటు గొల్లపల్లి శివార్లలో 1070 ఎకరాలకు రెవెన్యూ అధికారులు ఇల్లీగల్ పట్టా పాస్​బుక్​జారీ చేశారని అదే మండలం గొల్లపల్లికి చెందిన సామాజిక కార్యకర్త ఇందూరి రామ్మోహన్ 2017లో కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆధారాలు సేకరించి 2017, 2022లో  హైకోర్టులో మూడు పిల్స్ (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్) దాఖలు చేశారు. 

నెన్నెల శివారులోని 900 ఎకరాలు, గొల్లపల్లి శివారులో 170 ఎకరాలను 2020–21లో 351 మంది పేరిట ధరణిలో ఎంట్రీ చేశారని, వీటికి అసెంబ్లీ రివ్యూ కమిటీ (ఏఆర్సీ) అప్రూవల్ లేదని, అసైన్మెంట్ పట్టాలు కూడా లేవని పేర్కొన్నారు. 2017లో అప్పటి కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ 88 మంది అనర్హులకు 207 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమంగా కట్టబెట్టి ఇల్లీగల్ పట్టాలు జారీ చేసినట్టు హైకోర్టుకు రిపోర్టు సమర్పించారు. ఆ తర్వాత ఇందులో కొన్ని పట్టాలను అధికారులు రద్దు చేశారు. బాధ్యులైన అధికారులను తప్పించి ధరణి ఆపరేటర్​పై కేసు పెట్టి మమ అనిపించారు. 

అక్రమమని తేలినా రైతుబంధు ఆగలే..

2022లో హైకోర్టులో వేసిన పిల్స్​కు సంబంధించి 1070 ఎకరాల ప్రభుత్వ భూముల విషయంలో ఎంక్వైరీ జరిపి రిపోర్టు సమర్పించాలని అప్పటి కలెక్టర్ భారతి హోళికేరిని హైకోర్టు ఆదేశించింది. అప్పటి బెల్లంపల్లి ఆర్డీవో విచారణ జరిపి నెన్నెల శివారులో 79 సర్వే నంబర్లలోని 300 ఎకరాలను ధరణిలో డైరెక్టుగా ఎంట్రీ చేశారని తేల్చారు. 73 సర్వే నంబర్లలోని 200 ఎకరాలను ఇల్లీగల్ పీవోటీ ద్వారా మొత్తం 152 మందికి ధరణి పట్టాలు జారీ చేశారని పేర్కొన్నారు. అలాగే, గొల్లపల్లి శివారుకు సంబంధించి 22 మంది సర్వే నంబర్లు డైరెక్టు ఎంట్రీ చేయగా, 16 మందికి ఇల్లీగల్ పీవోటీ ద్వారా 100 ఎకరాలను ధరణిలో నమోదు చేసినట్టు నిర్ధారించారు. వీరిందరి నుంచి రైతుబంధు పైసలు రికవరీ చేయాలని కలెక్టర్​కు రిపోర్టు అందజేశారు. ఆర్డీవో రిపోర్టు ప్రకారం రెవెన్యూ ఆఫీసర్లు, అగ్రికల్చర్, బ్యాంకు ఆఫీసర్లు రైతుబంధు రికవరీ చేయకపోగా, ఇప్పటివరకూ ఇల్లీగల్ పట్టాలకు రైతుబంధు జమ చేస్తున్నట్టు రామ్మోహన్ తెలిపారు.   

మరో 4వేల ఎకరాలు ధారాదత్తం...!

జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ భూములు నెన్నెల మండలంలోనే ఉన్నాయి. ఖాళీ భూములపై కన్నేసిన కొంతమంది లీడర్లు, బ్రోకర్లు 2000 సంవత్సరం నుంచి అక్రమ పట్టాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ధరణి పోర్టల్ వచ్చినప్పటికీ ఈ అక్రమ దందాకు బ్రేక్ పడకపోవడం విశేషం. 
ఇలా నెన్నెల, గొల్లపల్లి, ఆవడం, గణపూర్, జోగాపూర్, మైలారం, ఖమ్మంపల్లి, ఖర్జి, మన్నెగూడెం, గుండ్ల సోమారం, నందులపల్లి, భాగిరతిపేట తదితర గ్రామ శివార్లలో ఇంకా సుమారు 4వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్టు తెలుస్తోంది. కొందరు లీడర్లు, బ్రోకర్లు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములకు ధరణి పట్టా పాస్​బుక్​ జారీ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి నెన్నెల మండలంలోని  భూదందాలపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

సీఎం రేవంత్​ రెడ్డి స్పందిస్తేనే...

నెన్నెల మండలంలో కోట్ల విలువైన వేలాది ఎకరాల సర్కారు భూములు అన్యాక్రాంతమయ్యాయి. 600 ఎకరాలకు అక్రమంగా పట్టాలు ఇచ్చినట్టు అధికారుల ఎంక్వైరీలో తేలినప్పటికీ వాటిని రద్దు చేయలేదు. పైగా రెవెన్యూ అధికారులు ధరణి  పాస్​బుక్​ జారీ చేశారు. అక్రమ పట్టాలకు ఇచ్చిన రైతుబంధు పైసలు రికవరీ చేయకపోగా, ఇప్పటికీ రైతుబంధు ఇస్తున్నారు. సీఎం రేవంత్​రెడ్డి స్పందించి ఇల్లీగల్ పట్టాలకు రైతుభరోసా, రుణమాఫీ రద్దు చేయాలి.  
-ఇందూరి రామ్మోహన్, సామాజిక కార్యకర్త