- కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 5,386 ఎకరాలు గుర్తింపు
- పెద్దపల్లి జిల్లాలో 2,198 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 2 వేల ఎకరాలు
- గత ప్రభుత్వంలో గుట్టలు, క్వారీలు, పౌల్ట్రీ ఫామ్‌లకు రైతుబంధు
ఈ ఫొటోలో కనిపిస్తున్న గుట్ట శంకరపట్నం మండలం మొలంగూరు రెవెన్యూ విలేజీ పరిధిలోని మక్త గ్రామ శివారు క్వారీకి సంబంధించింది. 906 సర్వే నంబర్ లో ఉన్న ఈ గురిజాల గుట్ట భూభాగం ధరణిలో వ్యవసాయ భూమిగా నమోదైంది. అంబవరం చంద్రశేఖర్ రెడ్డి పేరిట పట్టాదారు పాస్ బుక్ జారీ అయింది.
ఈ భూమికి ఐదేళ్లుగా పది విడతల్లో కలిపి రూ.9.50 లక్షల మేర రైతుబంధు జమయినట్లు తెలిసింది. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయేతర భూములను సర్వే చేస్తున్న క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్/పెద్దపల్లి/జగిత్యాల, వెలుగు: రైతుభరోసా అమలులో భాగంగా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు చేసిన సర్వేలో వ్యవసాయ యోగ్యం కాని భూముల లెక్క తేలింది. గత ప్రభుత్వంలో పంటలు సాగు చేయని గుట్టలు, క్వారీలు, పౌల్ట్రీ ఫామ్ లకు రైతు బంధు ఇచ్చినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్ల సర్వేలో వెలుగు చూసింది.
వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వ్యవసాయ అధికారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించగా.. అనేక విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. శంకరపట్నం, హుజూరాబాద్, మానకొండూరు మండలాల్లో గుట్టలకు ఐదేళ్లుగా రైతుబంధు ఇచ్చిన విషయం బయటకు వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 5,386 ఎకరాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా వ్యవసాయానికి యోగ్యం కాని భూములను ఆఫీసర్లు గుర్తించారు. ఈ జిల్లాలో 5,386 ఎకరాల భూములను వ్యవసాయేతర భూములుగా గుర్తించగా.. ఇందులో క్వారీలు, గుట్టలు, పౌల్ట్రీ ఫామ్ లు, లే ఔట్ వెంచర్లు ఉన్నాయి. అలాగే పెద్దపల్లి జిల్లాలో 2,198 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో సుమారు 2 వేల ఎకరాలు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో సుమారు రెండున్నర వేల ఎకరాల్లో వ్యవసాయం చేయకపోయినా గత సర్కార్ హయాంలో రైతుబంధు జమ చేసినట్లు క్షేత్ర స్థాయి సర్వేలో ఆఫీసర్లు గుర్తించారు.
ఆఫీసర్లపై ఒత్తిళ్లు..?
ఎలాంటి పంట వేయకపోయినా, వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగిస్తున్నప్పటికీ గత సర్కార్ లక్షలాది రూపాయలు రైతుబంధు రూపంలో జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి భూములను గుర్తిస్తుండడంతో సదరు పట్టాదారులు.. తమ భూములను తీసేయొద్దని అగ్రికల్చర్ ఆఫీసర్లపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో కొన్ని గ్రామాల్లో వ్యవసాయేతర భూముల జాబితాలో చేర్చేందుకు కొందరు ఆఫీసర్లు వెనకాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ALSO READ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ
పౌల్ట్రీ ఫామ్‌కు పెట్టుబడి సాయం
మానకొండూరు మండలం గంగిపల్లి రెవెన్యూ విలేజీ పరిధిలో వాలా సిద్దేశ్వర్ రావుకు 1018 సర్వే నంబర్ లో 2.20 ఎకరాల్లో పౌల్ట్రీ ఫామ్ ఉంది. ఆయనకు ఈ సర్వే నంబర్ తోపాటు మరో 11 సర్వే నంబర్లు కలిపి 9.1375 ఎకరాలకు పట్టాదారు పాస్ బుక్ జారీ అయింది. ఇందులో కోళ్ల ఫామ్ నిర్మించిన రెండున్నర ఎకరాల భూమికి కూడా రైతు బంధు జమ అవుతోంది. వ్యవసాయ అధికారుల సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది.