రైతు భరోసా అమలు కోసం.. సాగుభూముల సర్వే

  • నేటి నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన
  • పంటలు పండించే భూములకే సాయం  
  • మండలాల వారీగా టీమ్స్​ఏర్పాటు
  • ఉపాధికార్డుల ఆధారంగా  ఆత్మీయభరోసా లబ్దిదారుల ఎంపిక

కామారెడ్డి, వెలుగు : రైతుభరోసా అమలులో భాగంగా సాగులో ఉన్న వ్యసాయ భూములను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నారు.  ప్రభుత్వం   ఈనెల 26 నుంచి రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,  కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభిస్తోంది. గతంలో బీఆర్ఎస్​ ప్రభుత్వం రైతుబంధు పేర ఎకరానికి 10 వేల సాయాన్ని అందించగా కాంగ్రెస్​ ప్రభుత్వం రైతుభరోసా పేరిట ఆర్థికసాయాన్ని 12 వేలకు పెంచింది. ఈ పథకాన్ని సాగులో ఉన్న భూములకే వర్తింపచేయాలన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే జరపనుంది.    
కామారెడ్డి జిల్లాలో 5,35,755 ఎకరాల భూమి ఉంది.

 2023–-24   వానాకాలం సీజన్​లో  2,99,705 మంది రైతులకు సంబంధించి  5,22,034 ఎకరాలకు ప్రభుత్వం  రైతుబంధు కింద  రూ. 261 కోట్లు ఇచ్చింది.  యాసంగిలో 2,88,304 మందికి సంబంధించి5,19,987 ఎకరాలకు   రూ.260 కోట్లు ఇచ్చారు. గతంలో సాగు చేయని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం మాత్రం  సాగు చేయని భూములకు సాయం ఇవ్వమని ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగే క్షేత్రస్థాయి సర్వేలో లేఅవుట్లుగా మారిన భూములు,  రోడ్లు, ఇండస్ట్రియల్, గోడౌన్స్, రాళ్లు, రప్పలు,  గుట్టలతో ఉండి సాగు చేయని భూములు, వివిధ అవసరాల కోసం ప్రభుత్వం సేకరించిన భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి తొలగిస్తారు. 

మండల స్థాయిలో తహసీల్దార్, అగ్రికల్చర్​ఆఫీసర్, గ్రామ స్థాయిలో రెవెన్యూ ఉద్యోగి,  ఏఈవో సర్వే చేస్తారు. ​రైతుబంధు లిస్ట్​ఆధారంగా ఆయా సర్వే నంబర్లలోని భూములను పరిశీలించి సాగుకు యోగ్యం కాని  సర్వే నంబర్లను మార్కు చేస్తారు.  ఈ నెల21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి సాగుకు యోగ్యం కాని భూముల వివరాలను  చదివి  వినిపిస్తారు. అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితా తయారు చేస్తారు.   

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా

భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు  ప్రతి ఏటా రూ. 12వేలు ఇచ్చేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్​ ప్రవేశపెట్టారు. ఎన్​ఆర్​ఈజీఎస్ ​జాబ్​కార్డులున్న భూమి లేని వ్యవసాయ కూలిలను ఈ స్కీమ్​ కింద లబ్ది పొందడానికి అర్హులు.  2023–-24 లో  కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ స్కీమ్​లో కూలీగా పని చేసి ఉండాలి. కామారెడ్డి జిల్లాలో 2.50  లక్షల జాబ్​కార్డులు ఉన్నాయి. 2023–-24 లో జిల్లాలో 20 రోజులకు పైగా పని చేసిన వారు 60,500 మంది వరకు ఉన్నారు.

ఇందులో నుంచి భూమి లేని వారిని గుర్తించి వారి పేర్లను   గ్రామసభల్లో చదువుతారు. అభ్యంతరాలు ఉంటే ఎంపీడీవోలకు ఫిర్యాదు చేయవచ్చు. కొత్త రేషన్​ కార్డుల జారీ పక్రియ కూడా షూరు కానుంది. కుల గణన సర్వే ఆధారంగా రేషన్​ కార్డు లేని వారిని గుర్తించి  క్షేత్ర స్థాయిలో పరిశీలించి కొత్త కార్డులు ఇస్తారు.  ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతోంది.  నియోజక వర్గానికి 3,500 ఇండ్లను ప్రభుత్వం  మంజూరు చేసింది.  జిల్లాలో 4 నియోజక వర్గాలుండగా బాన్సువాడ నియోజకవర్గం సగం నిజామాబాద్​ జిల్లా పరిధికి వస్తుంది. జిల్లాకు 12,500 ఇండ్లు రానున్నాయి.