ఊరంతా సంక్రాంతి.. ప్రపంచంలో ఎక్కడున్నా పండక్కి సొంతూరికే

  • 12 ఏళ్లుగా రైతునగర్​ గ్రామస్తుల ఆదర్శం 
  • జన్మభూమి ట్రస్ట్​ పేరిట పండుగ సంబరాలు 
  • మూడు రోజుల పాటు ఘనంగా వేడుకలు

బీర్కూర్​, వెలుగు: కన్న తల్లిని, జన్మభూమిని ఎప్పటికీ మరవద్దన్న ఆదర్శాన్ని ఆ గ్రామస్తులు పాటిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఎక్కడున్నా ప్రతి సంక్రాంతికి స్వగ్రామానికి చేరుకొని అంతా కలిసి ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్​ మండలం రైతునగర్​ గ్రామానికి చెందిన వారంతా జన్మభూమి చారిటబుల్​ ట్రస్ట్​ పేరిట 12ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. బీర్కూర్​ మండలం రైతునగర్​ గ్రామానికి చెందిన ఉద్యోగులు, గ్రామస్తులు కలిసి 2013 జనవరిలో జన్మభూమి చారిటబుల్​ ట్రస్ట్​ను ఏర్పాటు చేశారు. గ్రామ యువత, పిల్లలు గ్రామీణ ప్రాంత పండుగలు, సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు.

ఘనంగా వేడుకలు...

జన్మభూమి ట్రస్ట్​ ఆధ్వర్యంలో ప్రి ఏటా సంక్రాంతి పండుగను సంబురంగా జరుపుకుంటున్నారు. మూడు రోజులపాటు స్వాగత తోరణాలు, డీజే పాటలతో ఊరంతా సందడిగా మారుతుంది. మంగళవారం సంక్రాంతి పండగను, బుధవారం కనుమ పండగను అందరం కలసి జరుపుకుంటామని ట్రస్ట్​ ప్రతినిధులు చెప్తున్నారు. గ్రామానికి చెందిన వారు చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా కొందరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ స్థిరపడ్డారు. ఎవరు ఎక్కడున్నా ఏడాదికి ఒకసారి సంక్రాంతికి సొంతఊరికి రావాలని నిర్ణయించుకున్నారు. 12 ఏండ్ల కింద ఈ నిర్ణయం తీసుకోగా ప్రతిఒక్కరూ విధిగా పండుగకు ముందు ఊరికి చేరుకుంటున్నారు. 

ఏడాదంతా పనుల్లో తీరిక లేకుండా గడిపిన వారంతా బంధువులను, పాత మిత్రులను కలుసుకుని సంబరపడతారు. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడుపుతారు.పండుగ వేడుకల్లో భాగంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తారు. మహిళలకు ముగ్గుల పోటీ, తాడాట, కుర్చీలాట, పురుషులకు ఖోఖో, కబడ్డీ, రన్నింగ్​, షటీల్​లాంటి పోటీలు పెడతారు. కనుమ నాడు ఊరంతా ఒకదగ్గరే భోజనాలు చేస్తారు. ట్రస్ట్​ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 

మూలాలను మర్చిపోవద్దని...

మనుషుల మధ్య సంబంధాలు తెగిపోయి ప్రజలు తమ మూలాలు మర్చిపోతున్నారు. జన్మభూమిని, కన్న తల్లిదండ్రులను, చిన్ననాటి జ్ఞాపకాలను మర్చిపోవద్దనే ఉద్దేశ్యంతో జన్మభూమి ట్రస్ట్​ను నెలకొల్పాం. 12ఏళ్లుగా సంక్రాంతి సంబరాలను స్వగ్రామంలో చిన్ననాటి మిత్రుల మధ్య జరుపుకుంటున్నాం. దేశ, విదేశాల్లో ఉన్నవారంతా ఊరికి తరలివచ్చి పండగలో పాల్గొనడం సంతోషంగా ఉంది - చైతన్య సిరిగిరి, మిర్జాపూర్​ పీఏసీఎస్​ వైస్ చైర్మన్