-
మాకు మేమే నిర్ణయం తీసుకోవడం లేదు
-
రైతు భరోసాపై అందరితో చర్చిస్తం
-
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆదిలాబాద్: పంట పెట్టుబడి ఎలా అందించాలనే దానిపై రైతుల అభిప్రాయాల్ని తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ రైతు భరోసా ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు. రైతు భరోసా విధివిధానాలపై అందరితో చర్చించి అభిప్రాయాలు తీసుకోవాలనే సదుద్దేశంతో తాము ఉన్నామన్నారు. మాకు మేమే ఏదో నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. రైతుల అభిప్రాయాన్ని తీసుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైతుకి న్యాయ బద్దంగా, ధర్మంగా సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాతో తనకు అవినాభావ సంబంధం ఉందని ఆయన అన్నారు. ప్రజా పాలన తీసుకు రావడం కోసం నెల రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో పాద యాత్ర చేసినట్లు తెలిపారు. ఇక్కడి ప్రజల సమస్యలు తనకు తెలుసని, అయినా అందరి అభిప్రాయం తీసుకుంటామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
పట్టాలు లేనోళ్ల సూచనలూ తీసుకుంటం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పట్టాలు లేని వారు, ఇతరుల సూచనలు కూడా తీసుకుని రైతు భరోసా విధివిధానాలు తయారు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తరహాలో నాలుగు గోడ ల మధ్యనే నిర్ణయాలను తాము తీసుకోబోమన్నారు. ప్రతి పైసా పేద వారికి అందాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమననారు. కొండలు, గుట్టలు, ఫార్మ్ హౌస్ లు ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాళ లేదా అనేది మీరే చెప్పాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో భూమికి సరైన పత్రాలు కూడా లేవన్నారు. అసెంబ్లీ లో సైతం అందరి అభిప్రాయం తీసుకోని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.