- పదేండ్లు మాటలతో మోసం చేసిన్రు
- రూ.లక్ష కూడా మాఫీ చేయలేని కేటీఆర్, హరీశ్‌రావు అడ్డగోలుగా మాట్లాడుతున్నరు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వరంగల్, వెలుగు : ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, కుట్రలు చేసినా ఈ నెల 26 నుంచి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డితో కలిసి పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గీసుగొండ మండలం మొగిలిచర్లలో నిర్వహించిన సభలో భట్టి మాట్లాడారు. సంక్రాంతి కానుకగా రైతులకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని చెప్పారు.
బీఆర్‌ఎస్ సర్కార్ పదేండ్లు వాగ్ధానాలు, మాటలతోనే మోసం చేసింది తప్పితే రూ. లక్ష కూడా సక్రమంగా రుణమాఫీ చేయలేదన్నారు. ఇచ్చిన ఆ కాస్తా డబ్బులు కూడా నాలుగు విడతలుగా ఇవ్వడంతో అదంతా వడ్డీలకే సరిపోయిందన్నారు. రుణమాఫీ చేయలేని కేటీఆర్, హరీశ్‌రావు తమ ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‍ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేయడంతో దాని వడ్డీలకే రూ.6,500 కోట్లు కడుతున్నామని, అయినా తాము ఇచ్చిన హామీలను మాత్రం ఆపడం లేదన్నారు.
ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా సంక్షేమ పథకాలు ఆపబోమని స్పష్టం చేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సొంత గ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ కాపీని గ్రామస్తులకు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్.నాగరాజు, రామచంద్రునాయక్, మోహన్‌నాయక్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ కలెక్టర్ సత్యశారద, టీజీఎన్‍పీడీసీఎల్ సీఎండీ వరుణ్‍రెడ్డి, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా డైట్ చార్జీలు పెంచినం
యాదాద్రి, వెలుగు : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా పిల్లల ఆరోగ్యం కోసం డైట్ చార్జీలను 40 శాతం పెంచామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆదివారం యాదాద్రి జిల్లా బీబీనగర్‌లోని ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెనూ పాటిస్తున్నారా ? కాస్మొటిక్ చార్జీలు సక్రమంగా అందుతున్నాయా ? లేదా ? అని ఆరా తీశారు.
చార్జీలు పెంచిన తర్వాత మెనూలో వచ్చిన మార్పులు, సరుకుల్లో నాణ్యత వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్ల ఆరోగ్య వివరాలకు సంబంధించిన రిజిస్టర్లు, కిచెన్, స్టోర్ రూం, తరగతి గదులను పరిశీలించి, స్టూడెంట్లతో కలిసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందో లేదో తెలుసుకునేందుకు నెలకోసారి హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ తనిఖీ చేస్తామని చెప్పారు. అనంతరం వరంగల్‌కు వెళ్తూ రోడ్డు పక్కన మక్కజొన్న కంకులు కాలుస్తున్న మహిళతో ముచ్చటించారు.