ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నల్లగొండ నియోజకవర్గంలో 8వేల 358 ఖాతాల ద్వారా 7 వేల 890 కుటుంబాలకు రుణమాఫీ జరిగిందన్నారు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా రైతులు పండుగ చేసుకుంటున్నారన్నారు. రైతు రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం 46.16 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు కలిగిన దాదాపు 11 కోట్ల కుటుంబాలకి 11.50 లక్షల ఖాతాల ద్వారా రూ. 6వేల 098 కోట్ల రూపాయల రుణాలు మాఫీ జరిగిందన్నారు
రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించడంతో రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు భారీ బైక్ ర్యాలీచేశారు. పెర్కిట్ నుండి మామిడిపల్లి చౌరస్తా మీదుగా ఆర్మూర్ పట్టణం లోని రైతు వేదికకు ర్యాలీగా రైతులు తరలివచ్చారు. మోర్తాడ్ లో ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, రైతులు,కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా రైతు సంబరాలు అంబరాన్నంటాయి. బాన్స్ వాడ అంబేడ్కర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ చిత్రపటానికి మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ చేయడంతో రైతులు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ఏక కాలంలో రుణ మాఫీ చేసి సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారన్నారు. మంచిర్యాల జిల్లా మందపల్లి మండలం సారంగపల్లి రైతు వేదికలో రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అమలు చేసినందుకు రైతులు సంతోషం వ్యక్తం చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మేల్యే నల్లాల ఓదెలు,మాజీ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. చెన్నూర్ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి.. స్వీట్లు పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. రైతులు తీసుకున్న అప్పులను మాఫీ చేసి ఆర్థిక తోడ్పాటును అందిస్తోందని హర్షం వ్యక్తం చేశారు...