స్టార్టప్ : కూరగాయలు ఎండబెడితే .. కోట్లలో బిజినెస్​!

స్టార్టప్ : కూరగాయలు ఎండబెడితే .. కోట్లలో బిజినెస్​!

సాధారణంగా సాగు చేసి లాభాలు పొందే రైతుల కంటే అప్పుల పాలయ్యే రైతులే ఎక్కువ. అందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ పంట చేతికొచ్చాక ఎదురయ్యే పరిస్థితులే రైతులకు ఎక్కువ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. కొందరు రైతులయితే.. టమాటా లాంటి పంటలు అమ్ముడుపోక ఒక్కోసారి మార్కెట్ల పక్కన, పొలాల దగ్గర పారబోస్తుంటారు. కానీ.. ‘ముంబా’ వల్ల అలాంటి ఎంతోమంది రైతులు లాభాలు పొందుతున్నారు. అంతేకాదు.. ఆ రైతులు మరికొందరు ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తున్నారు. అదెలాగంటే.. 

మన దేశంలో పంట చేతికొచ్చాక నష్టపోయే రైతులే ఎక్కువ. మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో దాదాపు 40 శాతం పంట కోశాక ఎదురయ్యే పరిస్థితుల వల్లే నష్టపోతున్నారు. దీనివల్ల ఏడాదికి సుమారుగా 14 బిలియన్ల డాలర్ల ఆర్థిక నష్టం జరుగుతోంది. దీనికి కారణాలు అనేకం. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, డిమాండ్​కు మించి సప్లయ్​ ఉండడం, పంట చేతికొచ్చే దశలో చీడపీడల వల్ల క్వాలిటీ లేని దిగుబడి రావడం, నాసిరకం పంటకు డిమాండ్​ లేకపోవడం లాంటివి ముఖ్య కారణాలు. 

వీటన్నింటికీ ఒకే ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చి రైతులకు ఆసరాగా నిలిచింది ‘ఎస్​4ఎస్ టెక్నాలజీస్’ అనే స్టార్టప్​ కంపెనీ. మహారాష్ట్రకు చెందిన ఈ కంపెనీ ‘ముంబా’ బ్రాండ్​ పేరుతో డ్రై కూరగాయలను మార్కెట్​లో అమ్ముతోంది. అప్పుల వలయం నుండి రైతులను రక్షించే ప్రయత్నంలో భాగంగా ఆరుగురు ఫ్రెండ్స్​తో కలిసి వైభవ్ టిడ్కే ఈ స్టార్టప్​ మొదలుపెట్టాడు. దీని ద్వారా రకరకాల డ్రై వెజిటబుల్స్​ని మార్కెట్​ చేస్తున్నారు. 

ఈ కంపెనీ సోలార్ కండక్షన్ డ్రయ్యర్ (ఎస్​సీడీ) టెక్నాలజీని ఉపయోగించి దెబ్బతిన్న లేదా తక్కువ గ్రేడ్ పంటలను షెల్ఫ్–స్టేబుల్ ఫుడ్​ ఇంగ్రెడియెంట్స్​గా మారుస్తున్నారు. అంటే వృథా అయ్యే పంటకు మార్కెట్‌‌ని క్రియేట్ చేస్తున్నారు. ఇలా సోలార్​ డ్రై చేసిన ప్రొడక్ట్స్​ హై క్వాలిటీతో ఉండడమే కాకుండా వాటి షెల్ఫ్​ లైఫ్ ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం అందుతోంది. వీళ్లు వాడే డ్రయ్యింగ్​ టెక్నాలజీకి కంపెనీ పేటెంట్​ కూడా తీసుకుంది. 

3500 మంది రైతులకు పని

‘‘మార్కెట్​లో అమ్ముడుపోని లేదా తక్కువగా డిమాండ్​ ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను ఈజీగా అమ్మే  డిమాండ్​ ఉన్న ప్రొడక్ట్స్​గా మార్చడమే మా పని. అలా చేయడం వల్ల ప్రస్తుతం 3,500 మంది మహిళా రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం. వాళ్లు గతంతో పోలిస్తే.. ఏడాదికి 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. చాలా మంది రైతులకు వాళ్ల పొలాల్లో తిరిగి పెట్టుబడి పెట్టడానికి, వాళ్ల జీవనోపాధిని మెరుగుపరచడానికి అవసరమైన ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తున్నాం” అని ఈ స్టార్టప్ సీఈవో, కో -–ఫౌండర్​ వైభవ్ టిడ్కే అన్నారు. 

ఈ కంపెనీ తీసుకొచ్చిన టెక్నాలజీని దాదాపు నాలుగు లక్షల మంది రైతులు వాడుతున్నారు. ముంబాలో పనిచేసే 3,500 మంది మహిళా రైతులు వాళ్ల నెలవారీ ఆదాయాన్ని సగటున రూ.4,000 నుంచి రూ.8,000 వరకు పెంచుకున్నారు. ముంబా ఆడవాళ్లకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడానికి పనిచేస్తోంది. అందుకే ఈ టెక్నాలజీని ఆపరేట్ చేయడానికి, ప్రొడక్ట్స్​ని మార్కెట్ చేయడానికి కావాల్సిన స్కిల్స్​ని మహిళా రైతులకే నేర్పిస్తున్నారు. వాళ్ల ద్వారా ఇప్పటివరకు ముంబా రెండు లక్షల టన్నుల ఫుడ్​ వృథా కాకుండా అడ్డుకోగలిగింది. 

సోలార్​ పద్ధతిలోనే...

కూరగాయలను ఆరబెట్టేందుకు రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నా.. వైభవ్​ మాత్రం సోలార్​ డ్రైయింగ్​ పద్ధతిలోనే ఆరపెడుతున్నాడు. అందుకు కారణం.. పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తూ.. గ్రీన్‌‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించాలని. అంతేకాకుండా పాడైపోయే పంటలను ఎండబెట్టి వాడుకోవడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. దీని వల్ల దాదాపు1.8 మిలియన్ టన్నుల కార్బన్–​డై–ఆక్సైడ్​ ఉద్గారాలు తగ్గడానికి కారణమయ్యారు. 

ఇలా మొదలైంది

వైభవ్ టిడ్కే, స్వప్నిల్ కొకటే, తుషార్ గవారే, నిధి పంత్, అశ్విన్ పవాడే, గణేష్ భేరే, శీతల్ సోమాని కలిసి 2019లో ఎస్​4ఎస్​ టెక్నాలజీస్‌‌ను స్థాపించారు. వీళ్లందరూ అగ్రికల్చర్​ బ్యాక్​గ్రౌండ్​ ఉన్నవాళ్లే. వాళ్ల శాస్ర్తీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి చిన్నకారు రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ స్టార్టప్​ మొదలుపెట్టారు. పంటకోత తర్వాత కలిగే నష్టాల గురించి మాట్లాడుతూ ‘‘తగినంత స్టోరేజీ కెపాసిటీ ఫెసిలిటీస్​ లేకపోవడం, మౌలిక సదుపాయాలు సరిగ్గా అందకపోవడం, అసమర్థమైన సప్లయ్​ చైన్, ​సరైన ప్రాసెసింగ్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం లాంటి కారణాల వల్ల నష్టాలు వస్తున్నాయి. 

దాంతో పంటల నుండి వచ్చే ఆదాయం తగ్గుతోంది. చాలామంది చిన్న రైతులు ఎక్కువ అప్పులు చేయడానికి ఇదే ప్రధాన కారణం. అప్పుల వల్ల పేదరికం, రుణభారం అనే చక్రాల కింద నలిగిపోతున్నారు రైతులు. ఈ సమస్యలు అన్నింటికీ పరిష్కారాలను తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా పుట్టిందే ముంబా బ్రాండ్. ముంబా ద్వారా దెబ్బతిన్న లేదా  తక్కువ–గ్రేడ్ పంటలను ముఖ్యంగా మార్కెట్​ గేట్​ దగ్గరే ఉండిపోయిన చిన్న రైతుల నుండి కొనుగోలు చేస్తున్నాం. వాటిని సోలార్ కండక్షన్ డ్రయ్యర్ టెక్నాలజీతో డీ హైడ్రేట్​ చేస్తున్నాం’’ అని చెప్పాడు వైభవ్​.

ట్రేల్లో ఆరబెట్టి.. 

ఈ టెక్నాలజీలో కూరగాయలు, పండ్లను ఆరబెట్టడానికి నలుపురంగు ట్రేలు వాడతారు. ఆ ట్రేకి ఒక నల్లని ఫుడ్​ గ్రేడ్​ పూత పూస్తారు. అది సోలార్​ రేడియేషన్​ అబ్జార్ప్షన్​ని పెంచుతుంది. అందువల్ల తొందరగా వేడెక్కుతుంది. ఆ వేడి వల్ల ట్రేలోని కూరగాయలు లేదా పండ్ల ముక్కల్లోని నీటి శాతం తగ్గుతుంది. ఈ ట్రేల మీద ట్రాన్సపరెంట్ ప్లాస్టిక్ కవర్‌‌ కప్పుతారు. అది సూర్యరశ్మిని లోపలికి చొచ్చుకుపోయేలా చేస్తుంది. ఈ ప్రాసెస్​ ఎవరైనా ఈజీగా చేయగలరు. కానీ.. దీనికి కొంత ట్రైనింగ్​ అవసరం ఉంటుంది. ట్రైనింగ్​ తీసుకుంటే రైతులే సొంతంగా డ్రయ్యింగ్​ ప్లాంట్​ని మెయింటెయిన్​ చేసుకోవచ్చు. 

ఏం లాభం 

సోలార్​ డ్రయ్యింగ్​ వల్ల ప్రొడక్ట్స్​ షెల్ఫ్ లైఫ్​ పెరుగుతుంది. డ్రయ్యింగ్​ కోసం కరెంట్​, ఫాజిల్​ ఫ్యుయెల్స్​ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. గ్రామాల్లో స్టోరేజీ ఫెసిలిటీస్​ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ఉండే రైతులు ఇలా డ్రై చేసుకుని డిమాండ్​ పెరిగినప్పుడు మార్కెట్​ చేసుకుంటే సరిపోతుంది. 

ఎన్నో రకాలు

ముంబా తీసుకొచ్చిన టెక్నాలజీతో అనేక రకాల పండ్లు, కూరగాయలను ఆరబెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఆలుగడ్డలు, పచ్చి మిరపకాయలు, పచ్చి బఠానీలు, వెల్లుల్లి, ఉల్లిగడ్డలు, మొక్కజొన్న, అల్లం, టమాటా, పాలకూర, గుమ్మడికాయ లాంటి వాటిని డీ హైడ్రేట్​ చేసి నిల్వ చేసుకుంటున్నారు. వీటిని ముందుగా కావాల్సిన సైజులో తరుగుతారు. తర్వాత ఆరబెట్టి పొడి చేసుకుంటారు. లేదంటే అలాగే అమ్మేస్తారు. ఇవే కాదు.. కొన్నిసార్లు బియ్యం, సోయా, తృణధాన్యాలు, పప్పులు, పండు మిర్చి,  పసుపు లాంటి సుగంధ ద్రవ్యాలను కూడా ప్రాసెస్ చేస్తున్నారు.  

200 కోట్ల ఆదాయం

ముంబా ప్రొడక్ట్స్​ని పెద్ద పెద్ద ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు, క్లౌడ్ కిచెన్లు, క్విక్–సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్‌‌ఆర్‌‌లు), ఎక్స్​పోర్ట్​ హౌజ్​లు, హోటళ్లు, రెస్టారెంట్లు,  క్యాటరింగ్ ఇండస్ట్రీలకు సప్లయ్​ చేస్తున్నారు. ఈ కంపెనీకి దాదాపు10,000 మంది కస్టమర్లు ఉన్నారు. కంపెనీ వార్షిక ఆదాయం ఇప్పుడు 200 కోట్ల రూపాయలకు చేరింది.

మూడేళ్లుగా పని.. 

మూడేళ్లుగా ఎస్‌‌4ఎస్‌‌ టెక్నాలజీస్‌‌లో పనిచేస్తున్న కాశీ శివాజీ పవార్ భూమిలేని రైతు. ఆమె గతంలో వ్యవసాయ కూలీగా పనిచేసేది. “నేను ప్రతి రోజూ పని వెతుక్కుంటూ రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఎండలో రోజంతా పనిచేసినా నాకు రోజుకు 200 రూపాయలు మాత్రమే వచ్చేవి. ఆర్థిక ఇబ్బందులతో 12వ తరగతి పూర్తికాగానే నా కూతుర్ని చదువు మాన్పించా. 

కానీ.. ఇప్పుడు  ఇక్కడ పని చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి రోజుకు 400 నుంచి 450 రూపాయల వరకు సంపాదిస్తున్నా. అంటే నా ఆదాయం గతంతో పోలిస్తే రెట్టింపు అయ్యింది. నేను పనిచేసే కేంద్రం కూడా దగ్గర్లోనే ఉంది. కాబట్టి పిల్లల్ని చూసుకోవడం కూడా చాలా ఈజీ అయ్యింది. నా కూతుర్ని  కాలేజీలో చేర్పించా. తను గ్రాడ్యుయేషన్‌‌ చేస్తోంది. టైపింగ్​ కూడా నేర్చుకుంటోంది” అని జల్నా జిల్లా మత్రేవాడి గ్రామంలో ఉంటున్న కాశీ తన ఎక్స్​పీరియెన్స్ చెప్పింది.