
శృతిక సముద్రాల.. జీ సరిగమప చూస్తున్న వాళ్లందరికీ ఈ పేరు బాగా తెలుసు. ఈ యంగ్ సింగర్ ఏ పాట పాడినా... ఒరిజినల్ వెర్షన్ పాడింది మరొకరు అంటే ఒక్క క్షణం ఆలోచిస్తాం. అంత అందంగా శృతి, గమకాల్ని పట్టుకుంటుంది. తన మ్యాజికల్ వాయిస్‌తో.. ఈ కొత్త సింగర్ సోషల్ మీడియాలోనూ సూపర్ పాపులర్. మైల్ స్టోన్ పాటలు పాడాలన్నదే తన కల అంటున్న ఈమె.. దానికోసం ఆరేండ్ల వయసు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టిందట. అంత చిన్న వయసులో.. పాటలతో చెలిమి ఎలా కుదిరిందని అడిగితే...
‘‘నేను పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న శశికాంత్ ప్రైవేట్ ఉద్యోగి. అమ్మ రూప హౌస్‌వైఫ్. అమ్మానాన్నలిద్దరికీ పాటలంటే ఇష్టం. వాళ్లు మ్యూజిక్ నేర్చుకోలేదు కానీ బాగా పాడతారు. అవి వింటూ మా అక్క శరణ్య కూడా కూనిరాగాలు తీస్తుండేది. అమ్మానాన్నలకి మాకు సంగీతం నేర్పించాలని ఉండటంతో మొదట అక్కని కర్ణాటక సంగీతంలో చేర్పించారు. తనని చూసి నేనూ పాడటం మొదలుపెట్టా. నా ఇంట్రెస్ట్ చూసి ఆరేండ్ల వయసులో వసుమతి మాధవన్ దగ్గర కర్ణాటక సంగీతం నేర్పించారు. ఆ తర్వాత నిహాల్ కొండూరి దగ్గర చేరా. అదే టైంలో రామాచారి లిటిల్ మ్యుజీషియన్ అకాడమీ(ఎల్ఎమ్ఏ) లో లైట్ మ్యూజిక్ నేర్చుకున్నా. మొదట్లో మ్యూజిక్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ, ఓరోజు చిత్రమ్మ పాటలు వింటున్నప్పుడు.. ఒక పాటతో అంతగా కనెక్ట్ అవ్వగలమా అనిపించింది. అప్పట్నించీ మ్యూజిక్‌ని సీరియస్‌గా తీసుకున్నా. ఎల్ఎమ్ఏలో చేరాక అక్కడ మిగతా సింగర్స్‌ని చూసి మరింత ఇన్స్పైర్ అయ్యా.
ఎలిమినేట్ అయ్యి...
నేను పార్టిసిపేట్ చేసిన మొదటి సింగింగ్ రియాలిటీ షో ‘బోల్ బేబీ బోల్’. అప్పటికి నా వయసు పదమూడేండ్లు. ఆ షోలో నేను పాడిన ‘పాడెద నీ నామమే గోపాలా’ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ కోటిగారు నిలబడి చప్పట్లు కొట్టారు. కానీ, క్వార్టర్ ఫైనల్స్ తర్వాత ఆ షో నుంచి వెనుదిరిగా. అది అతి పెద్ద లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ నాకు. ఆ ఎలిమినేషన్ తర్వాత మ్యూజిక్‌లో నేను ఏ స్థాయిలో ఉన్నానో తెలిసింది. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలన్న కసి పెరిగింది. మ్యూజిక్ నాలెడ్జ్ పెంచుకుని మళ్లీ రావాలి అనుకున్నా. దానికోసం ప్రతిరోజూ కష్టపడ్డా. ఒక పక్క స్కూల్, కాలేజీలకి వెళ్తూనే.. గంటలు తరబడి ప్రాక్టీస్ చేశా. కొన్ని ప్రైవేట్ సాంగ్స్‌కి కోరస్‌లు పాడా. చాలామంది నన్ను ‘‘ఈ బిజీ షెడ్యూల్స్ వల్ల చిన్నచిన్న సరదాల్ని మిస్సయ్యావా? ”అని అడుగుతుంటారు. ఈ మ్యూజిక్ జర్నీని నేను చాలా ఎంజాయ్ చేశా. అందుకే ఏదో మిస్ అయ్యానన్న ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు.
ఆ అవకాశం ఇలా..
సరిగమప అవకాశం విషయానికొస్తే...సరిగమప కిందటి సీజన్‌కి ఫస్ట్ రౌండ్ ఆడిషన్స్ పూర్తి చేశా. రెండో రౌండ్‌కి రమ్మని ఫోన్ వచ్చింది. కాకపోతే కరోనా , లాక్డౌన్ వల్ల వదులుకున్నా. ఈ సారి ఎలాగైనా షోలో చోటు సంపాదించాలి అనుకున్నా. కానీ, షో ఫస్ట్ ఎపిసోడ్‌లోనే నన్ను డేంజర్ జోన్లో పెట్టారు. షోలో ఉన్నానా? లేదా? అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తామన్నారు. ఆ వారం రోజులూ మైండ్‌లో ‘నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి’ అన్న ఒక్క ఆలోచనే. చాలా ప్రాక్టీస్ చేసి ‘నువ్వు లేక నేను లేను’ సినిమాలోని ‘ఎలా ఎలా ఎలా తెలుపను..’ పాట పాడా. ఆ పర్ఫార్మెన్స్ అయిపోగానే.. కోటిగారు ‘నువ్వు షోలో ఉన్నావ’ని చెప్పారు. ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను పాడిన ‘ పూలనే కునుకేయమంటా..’ పాటకి మెంటార్స్, జడ్జీలు వందకి వంద మార్కులు ఇచ్చి గోల్డెన్ సీటు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. షో టైటిల్ విషయానికొస్తే..గెలుస్తానన్న నమ్మకం ఉంది.’’
‘నీకు నువ్వు కాంపిటీషన్ అనుకోవాలి. ప్రతి పాటకి నిన్ను నువ్వు బెటర్ చేసుకోవాలి. సక్సెస్, ఫెయిల్యూర్.. సందర్భం ఏదైనా స్ట్రాంగ్‌గా ఉండాల’ని అమ్మ ఎప్పుడూ చెప్తుంటుంది. అందుకే నా ప్రయత్నం నేను చేస్తా. ఫ్యూచర్లో సినిమా పాటలు పాడాలనుకుంటున్నా. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్‌తో పనిచేయాలని ఉంది. దీనంతటికి మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో మెసేజ్‌లు పెడుతుంటారు చాలామంది. అవి చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తోంది. యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టా’ అంటోంది శృతిక.
ఆవుల యమున