- బ్యాటర్లు రాణిస్తేనే సిరీస్‌లో ముందుకు
- రా. 8.30 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో లైవ్
సెంచూరియన్: సంజు శాంసన్ సూపర్ సెంచరీతో తొలి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ సాధించి.. టాపార్డర్ ఫెయిల్యూర్‌తో రెండోపోరులో ఓడిన టీమిండియా బ్యాటింగ్‌లో తడబాటును వీడాల్సిన సమయం వచ్చింది. సౌతాఫ్రికా బలంగా పుంజుకున్న నేపథ్యంలో బుధవారం జరిగే మూడో టీ20లో బ్యాటర్ల నుంచి మెరుగైన ఆటను ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌కు వేదిక కానున్న సూపర్‌స్పోర్ట్ పార్క్ పరిస్థితులపై అంతగా అవగాహన లేనందున సూర్యకుమార్ అండ్ కో జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది.
2009 నుంచి ఈ వేదికపై ఇండియా ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడింది. 2018లో జరిగిన ఆ పోరులో ఆరు వికెట్ల తేడాతో ఓడింది. నాటి మ్యాచ్‌లో ఆడిన వారిలో హార్దిక్ పాండ్యా ఒక్కడే ప్రస్తుత టీమ్‌లో ఉన్నాడు. రెండో మ్యాచ్ మాదిరిగా ఇక్కడి ఈ వికెట్‌పై మంచి పేస్, బౌన్స్ లభించనుంది. గెబెహాలో ఇండియా బ్యాటర్లు సఫారీ పేసర్లను ఎదుర్కోలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. టాపార్డర్ పూర్తిగా తేలిపోవడంతో 124 స్కోరుకే పరిమితం అయ్యారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును రేసులోకి తెచ్చినా.. టార్గెట్ చిన్నది కావడంతో ఆతిథ్య జట్టు గెలిచి సిరీస్‌ను 1–1తో సమం చేసింది. అదే జోరుతో సఫారీ జట్టు మరో విజయంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో సిరీస్‌లో ముందుకెళ్లేందుకు ఇండియా బ్యాటర్లే ఇప్పుడు కీలకం కానున్నారు.
టాపార్డర్ సత్తా చాటేనా!
గత రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్‌లో ఇండియాకు సరైన ఆరంభం లభించలేదు. ఇందుకు కారణం ఓపెనర్ అభిషేక్ శర్మ ఫెయిల్యూర్. ఐపీఎల్‌తో మంచి పేరు తెచ్చుకొని నేషనల్ టీమ్‌లోకి వచ్చిన ఈ కుర్రాడు తన రెండో టీ20లోనే జింబాబ్వేపై సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ, తర్వాతి ఎనిమిది మ్యాచ్‌ల్లో కలిపి 70 రన్స్ మాత్రమే చేశాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో 4, 7, 4తో సింగిల్ డిజిట్స్‌కే పరిమితం అయ్యాడు. తను ఫామ్‌లోకి రాకపోతే ఓపెనింగ్ కాంబినేషన్‌ను మార్చడం తప్ప టీమ్ మేనేజ్‌మెంట్ కు మరో ఆప్షన్ ఉండబోదు. వరుసగా రెండు సెంచరీల తర్వాత గత మ్యాచ్‌లో డకౌటైన శాంసన్ ఈ మ్యాచ్‌లో మంచి ఆరంభం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
కుర్రాళ్లతో పాటు కెప్టెన్ సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ కూడా తమ స్థాయికి తగ్గట్టుగా ఆడాలి. గత మ్యాచ్‌లో పాండ్యా టాప్ స్కోరర్‌గా నిలిచినా.. వేగంగా ఆడలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్య, రింకూ తక్షణమే తమ బ్యాట్లకు పని చెప్పాలి. బౌలింగ్‌లో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ అదరగొడుతున్నారు. కానీ, పేసర్లు అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. రెండో టీ20లో స్పిన్నర్లు జట్టును విజయానికి చేరువ చేస్తే.. స్లాగ్ ఓవర్లలో భారీ రన్స్ ఇచ్చి జట్టు ఓటమికి కారణం అయ్యారు. ఈ ఇద్దరూ గాడిలో పడకుంటే యష్ దయాల్, వైశాఖ్ విజయ్‌కుమార్ కోసం తమ స్థానాలు త్యాగం చేయాల్సి ఉంటుంది.
ఆత్మవిశ్వాసంలో ఆతిథ్య జట్టు
తొలి మ్యాచ్‌లో తేలిపోయినా.. గెబెహాలో ఉత్కంఠ విజయం సాధించిన సౌతాఫ్రికా జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. అయితే, ఇండియా మాదిరిగా సఫారీలు కూడా బ్యాటింగ్ ఫెయిల్యూర్‌తో ఇబ్బంది పడుతున్నారు. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్‌తో పాటు సీనియర్లు డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ సిరీస్‌లో ఇప్పటివరకూ తమ మార్కు చూపెట్టలేదు. గత పోరులో పేసర్లకు తోడు ట్రిస్టాన్ స్టబ్స్, ఆల్‌రౌండర్ గెరాల్డ్ కొయేట్జీ పోరాటం వల్లే సఫారీలు గట్టెక్కారు.
సిరీస్‌లో ఆధిక్యంలోకి రావాలని చూస్తున్న ఆతిథ్య జట్టు బ్యాటర్ల నుంచి మంచి పెర్ఫామెన్స్ ఆశిస్తోంది. ముఖ్యంగా ఇండియా స్పిన్నర్ల బౌలింగ్‌లో మెరుగ్గా ఆడాలని కోరుకుంటోంది. బౌలింగ్‌లో సౌతాఫ్రికాకు ఇబ్బందులు లేవు. తొలి మ్యాచ్‌లో మొదట్లో తేలిపోయినా.. చివర్లో ఇండియా బ్యాటర్లను కట్టడి చేసిన ఆతిథ్య బౌలర్లు గెబెహాలో ఆరంభం నుంచి అదరగొట్టారు. సెంచూరియన్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నారు. ఈ వికెట్‌పై మంచి పేస్, బౌన్స్ లభించనుంది. ఇది సఫారీ బౌలర్లకు అనుకూలం కానుంది. ఈ మ్యాచ్‌కు వాతావరణం ఆహ్లాదంగా ఉండనుంది. వర్ష సూచన లేదు.
జట్లు (అంచనా)
ఇండియా: శాంసన్, అభిషేక్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి.
సౌతాఫ్రికా: రికెల్టన్, రీజా హెండ్రిక్స్, మార్‌క్రమ్ (కెప్టెన్), స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, యాన్సెన్, సిమిలెన్/సిపమ్లా, కొయెట్జీ, కేశవ్, పీటర్.