నాగర్ కర్నూల్, వెలుగు : గ్రామాల్లో బెల్టు షాపులు సృష్టిస్తున్న విధ్వంసం చిన్నారుల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది ఓ స్టూడెంట్రాసిన సమాధానం. నాగర్‌కర్నూల్‌జిల్లా తాడూరు మండలంలోని ఓ స్కూల్లో ఈ మధ్య ఎస్ఏ–1 పరీక్షలు నిర్వహించారు. ఇందులో తెలుగు సబ్జెక్ట్‌లో ‘కొంపముంచు’ అనే పదంతో సొంత వాక్యం రాయాలని ప్రశ్న ఇచ్చారు.
దీనికి ఓ స్టూడెంట్‘ మా గ్రామంలో మందు దుకాణాలు పెట్టి ప్రభుత్వం వారు మా కొంపముంచారు' అని సమాధానం రాసింది. పేపర్ కరెక్షన్చేసే టైంలో తెలుగు టీచర్‌ను విద్యార్థి రాసిన లైన్ కదిలించింది. ఆ సమాధానం ఫొటోగా మారి నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రూపుల్లో వైరల్‌గా మారింది. బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం మోపుతామని, అన్నింటినీ మూసేయిస్తామని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన నేపథ్యంలో స్టూడెంట్ రాసిన సమాధానం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.