SA20 2024: హెన్రిచ్ క్లాసెన్ ఊచకోత.. సన్‌రైజర్స్ శిబిరంలో ఆనందం

SA20 2024: హెన్రిచ్ క్లాసెన్ ఊచకోత.. సన్‌రైజర్స్ శిబిరంలో ఆనందం

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ తరుపున ఆడుతున్న క్లాసెన్.. శుక్రవారం ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడా పెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు వణుకు పుట్టించాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. ఇతని ధాటికి ముంబై బ్యాటర్లు నిర్ధేశించిన 207 పరుగుల లక్ష్యం సైతం చిన్నబోయింది.

రికెల్టన్  విధ్వంసం

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (87; 51 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్ లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. వాండెర్ డసెన్ (24), లివింగ్‌స్టోన్ (25), కీరన్ పొలార్డ్ (31 నాటౌట్) పరుగులు చేశారు. డర్బన్‌ బౌలర్లలో కీమో పాల్‌ 2 వికెట్లు పడగొట్టగా.. కేశవ్‌ మహారాజ్‌, ప్రిటోరియస్‌, రిచర్డ్‌ గ్లీసన్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. 

క్లాసెన్ వన్ మ్యాన్ షో

అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డర్బన్ 52 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డి కాక్ (5), వియాన్ ముల్డర్(5), కీమో పాల్(15) విఫలమయ్యారు. ఆ సమయంలో జులోకి వచ్చిన క్లాసెన్ వన్ మ్యాన్‌ షోతో అలరించాడు. ఒక ఎండ్ లో సహచరులు వెనుదిరుగుతున్నా.. మరో ఎండ్ లో బౌండరీల మోత మోగించాడు. అయితే డర్బన్‌ జెయింట్స్‌ విజయానికి 34 పరుగులు కావాల్సిన టైంలో అతడు వెనుదిరగ్గా.. ఆపై కొద్దిసేపటికే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆపై వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో డర్బన్ జట్టును విజేతగా ప్రకటించారు.

ఆనందంలో కావ్యా మారన్

క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ శిబిరంలో ఆనందం చిగురించింది. మరో 50 రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుండటంతో.. అక్కడా ఇదే ఫామ్ కొనసాగించాలని తెలుగు అభిమానులు ఆశిస్తున్నారు.