SA20 2024: ముంబై బ్యాటర్ల విధ్వంసం.. చిత్తుచిత్తుగా ఓడిన సూపర్ కింగ్స్

SA20 2024: ముంబై బ్యాటర్ల విధ్వంసం.. చిత్తుచిత్తుగా ఓడిన సూపర్ కింగ్స్

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌ బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. ఎడా పెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే వీరి విధ్వంసం మ్యాచ్ ముగిశాక టీవీల్లో వచ్చే హైలైట్స్‌లా సాగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఏకంగా 98 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిందంటే వారి బ్యాటింగ్ ఎంత భయంకరంగా సాగిందో అర్థం చేసుకోవాలి.    

200 పరుగుల వరకు No వికెట్

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై ఓపెనర్లు వాండర్ డస్సెన్, ర్యాన్ రికెల్‌టెన్ ఆదినుంచే బాదడం మొదలుపెట్టారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 200 పరుగులు జోడించారు. వాండర్ డస్సెన్ 50 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో శతకం(104) బాదగా.. రికెల్‌టెన్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 98 పరుగులు చేశారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.

అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్ 145 పరుగులకే కుప్పకూలింది. మొదటి నుంచి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన సూపర్ కింగ్స్ 17.5 ఓవర్లలోనే ఇన్నింగ్స్ ముగించింది. రీజా హెన్డ్రిక్స్ డకౌట్ కాగా, డుప్లెసిస్(6), మొయిన్ అలీ(11) పరుగులు చేశారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లూయిస్ డూప్లాయ్(48; 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు పోరాటం చేశాడు. ముంబై బౌలర్లలో లిండే, ఓలీ స్టోన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. రబడా, బ్యూరన్ హెన్డ్రిక్స్, లివింగ్‌స్టోన్, సామ్ కురాన్ తలో ఒక వికెట్ తీసుకున్నారు.