
పాతనంతిట్ట: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ శుభవార్త చెప్పింది. శబరిమలలో మార్చి 14, 2025 నుంచి కొత్త దర్శన విధానం అమల్లోకి రానుంది. ఇకపై శబరిమలలో18 మెట్లు ఎక్కగానే భక్తులకు స్వామి వారి నిజ దర్శనం ప్రాప్తించేలా కొత్త నమూనాను ఆలయ అధికారులు రూపొందించారు. అయ్యప్ప స్వామి భక్తులు18 మెట్లు ఎక్కగానే నేరుగా సన్నిధానంలోకి అనుమతించేలా నిబంధనలను మార్చారు.
ఇప్పటివరకూ ఎలా ఉండేదంటే.. 18 మెట్లు(పదునెట్టాంబడి) ఎక్కగానే సన్నిధానంలోకి వెళ్లేందుకు భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి 500 మీటర్ల దూరం ఉండే ఫ్లై ఓవర్ మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ వంతెనను తొలగించాలని ట్రావెన్ కోర్ అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగా.. 18 మెట్లు ఎక్కగానే అయ్యప్పను దర్శించుకోవచ్చు.
మార్చి 14, 2025న మీన మాస పూజల కోసం శబరిమలలో అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. ఆ సమయంలో ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజ స్తంభానికి ఇరువైపులా రెండు లేదంటే నాలుగు లైన్లు దారిలోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి నేరుగా బలికల్‌పుర (కణిక్కవంచి -నైవేద్య పాత్ర) మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుని మణికంఠుడిని దర్శించుకోవచ్చు. ఇప్పటివరకూ ఫ్లై ఓవర్ దిగాక అయ్యప్ప సన్నిధి ఎడమ వైపు నుంచి దర్శనానికి అనుమతించేవారు.
ALSO READ | ఢిల్లీ తొక్కిసలాట ఘటనతో కుంభమేళా రైళ్లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం
సన్నిధానానికి ఎదురుగా భక్తులు వెళ్లినప్పుడు రెండుమూడు సెకన్ల పాటు మాత్రమే స్వామిని దర్శించుకునే వీలుండేది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామి దర్శనం ఆ మాత్రం కూడా దక్కక భక్తులు నిరాశ చెందేవారు. అందుకే.. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని.. స్వామిని వీలైనంత ఎక్కువ సేపు దర్శించుకునేలా ట్రావెన్ కోర్ బోర్డ్ దేవస్థానం కొత్త దర్శన విధానాన్ని అమలు చేయాలని డిసైడ్ అయింది.
కొత్త దర్శన విధానం అమల్లోకి వస్తే.. కణిక్కవంచి నుంచి వెళ్తే 30 సెకన్ల నుంచి దాదాపు ఒక నిమిషం పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం భక్తులకు ఉంటుంది. ప్రస్తుతం శబరిమలలో కుంభమాస పూజలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 21 వరకు ఆలయం తెరిచే ఉంటుంది.