శబరిమల అయ్యప్ప దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆన్ లైన్ బుకింగ్ ద్వారానే దర్శనానికి భక్తులకు పర్మిషన్ ఇస్తున్నట్లు తెలిపింది. గరిష్టంగా రోజుకు 80 వేల మందికి అయ్యప్ప దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. అంతేగాకుండా వర్చువల్ క్యూబుకింగ్ సమయంలో భక్తులు తమ ప్రయాణా మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
మూడు నెలల ముందే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు ఆలయ అధికారులు. ఇంతకు ముందు 10 రోజుల ముందు మాత్రమే బుకింగ్ సదుపాయం ఉండేది. ఇపుడు దాన్ని మూడు నెలల వరకు పెంచింది ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు. శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా బుక్ చేసుకున్నవారికి దర్శన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.
2023 డిసెంబర్ లో మండల పూజల సమయంలో శబరిమల భక్తులు భారీగా వచ్చారు. ఈ క్రమంలో కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం కాకుండా ఇంటికి తిరిగొచ్చారు.దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.