Sabbir Rahman: ధోనీనే నన్ను ఐపీఎల్ ఆడమన్నాడు.. కానీ కుదరలేదు: బంగ్లాదేశ్ క్రికెటర్

Sabbir Rahman: ధోనీనే నన్ను ఐపీఎల్ ఆడమన్నాడు.. కానీ కుదరలేదు: బంగ్లాదేశ్ క్రికెటర్

2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో బంగ్లాదేశ్ పై టీమిండియా ఒక్క పరుగు తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ధోనీ అద్భుత కెప్టెన్సీతో భారత్ బంగ్లాపై గట్టెక్కి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాటర్ సబీర్ రహమాన్ ను ధోనీ స్టంపింగ్ చేసిన విధానం హైలెట్ గా నిలిచింది. రైనా బౌలింగ్ లో మహేంద్రుడు మెరుపు వేగంతో చేసిన స్టంపింగ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఈ మ్యాచ్ ను గుర్తు చేసుకుంటూ బంగ్లాదేశ్ బ్యాటర్ సబీర్ రహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

సబీర్ రహమాన్ మాట్లాడుతూ.. " 2016 టీ20 వరల్డ్ కప్ లో ధోనీ నన్ను స్టంపౌట్ చేశాడు. మేము మళ్ళి 2019 వన్డే వరల్డ్ కప్ లో భారత్ తో ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో నేను పాఠం నేర్చుకున్నాను. ధోనీకి ఔట్ చేసే అవకాశం ఇవ్వలేదు. 2016 బెంగుళూరు వేదికగా టీమిండియాపై మ్యాచ్ ఆడుతున్నప్పుడు ధోనీ నన్ను ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాలని చెప్పాడు. కానీ అప్పుడు జాతీయ జట్టుతో ఉన్న కమ్మిట్ మెంట్ ల కారణంగా ఆటగాళ్లకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో నేను ఐపీఎల్ ఆడే అవకాశం కోల్పోయాను". అని ఈ బంగ్లా క్రికెటర్ శుక్రవారం క్రిక్‌ఫ్రెంజీ ఫేస్‌బుక్ లైవ్‌లో అన్నారు.      

Also Read : అచ్చుగుద్దినట్టు దింపేశాడుగా

సబీర్ రహమాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టులో చోటు కోల్పోయాడు. గతంలో బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ లో తమ టైమింగ్ తో అద్భుతమైన షాట్లు ఆడేవాడు. చివరిసారిగా 2022 లో పాకిస్థాన్ పై టీ20 మ్యాచ్ ఆడాడు. 33 ఏళ్ళ ఈ బంగ్లా బ్యాటర్.. అంతర్జాతీయ క్రికెట్ లో 11 టెస్టులు, 66 వన్డేలు, 48 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఇటీవలే జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో విధ్వంసమే సృష్టించాడు. 200 పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. ఒక మ్యాచ్ లో 33 బంతుల్లోనే 9 సిక్సర్లు.. 3 ఫోర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.